టైటిల్ వేటలో తిలక్ వర్మ, ఇషాన్ కిషన్
నేటి నుంచి దులీప్ ట్రోఫీ ఫైనల్
నవతెలంగాణ-చెన్నై :
దేశవాళీ క్రికెట్‌సర్క్యూట్‌లో జోనల్ సవాల్‌కు రంగం సిద్ధమైంది. దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్, ఈస్ట్ జోన్‌లు తాడోపేడో తేల్చుకునేందుకు సై అంటున్నాయి. తిలక్ వర్మ సారథ్యంలో సౌత్ జోన్ టైటిల్ ఫేవరేట్‌గా బరిలోకి దిగుతుండగా.. భారత ఆటగాళ్లు దేవదత్ పడిక్కల్, మహ్మద్ సిరాజ్ చేరికతో ఆ జట్టు అవకాశాలు మరింత పెరిగాయి. ఇషాన్ కిషన్ కెప్టెన్సీలో ఈస్ట్ జోన్ 2013 తర్వాత తొలిసారి దులీప్ ట్రోఫీపై కన్నేసింది. యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ, వెటరన్ పేసర్ మహ్మద్ షమి ఈస్ట్ జోన్ అవకాశాలను రెట్టింపు చేస్తున్నారు. మహ్మద్ షమి, శ్రేయాస్ గోపాల్‌కు ఫస్ట్ క్లాస్ కెరీర్‌లో ఇది వందో మ్యాచ్ కావటం విశేషం.
వైభవ్‌పైనే ఫోకస్
వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్‌లో, భారత వైట్‌బాల్ క్రికెట్‌లో ప్రకంపనలు సృష్టించడానికి ముందు అతడి కెరీర్‌ను మలుపు తిప్పిన ఇన్నింగ్స్ ఆస్ర్టేలియా అండర్-19పై చెపాక్‌లో బాదినదే. 58 బంతుల్లోనే సెంచరీతో యూత్ టెస్టులో వైభవ్ రికార్డు నెలకొల్పాడు. దులీప్ ట్రోఫీ ఫైనల్లో ఈస్ట్ జోన్ నుంచి బరిలోకి దిగుతున్న వైభవ్ మళ్లీ ఆ తరహా విధ్వంసక ఇన్నింగ్స్‌పై గురిపెట్టాడు. శనివారం ప్రాక్టీస్ సెషన్లోనూ సూర్యవంశీ తనదైన శైలిలోనే రెచ్చిపోతూ సాధన చేయటం గమనార్హం. ఇటీవల శ్రీలంకతో టెస్టు సిరీస్‌లో వరుస సెంచరీలు సాధించిన దేవదత్ పడిక్కల్ సౌత్ జోన్ నుంచి బరిలోకి దిగుతున్నాడు. భీకర ఫామ్‌లో ఉన్న పడిక్కల్‌ను ఈస్ట్ బౌలర్లు ఏ మేరకు నిలువరిస్తారో చూడాలి. కెఎల్ రాహుల్ సౌత్ జోన్ తుది జట్టులో ఆడటం లేదని కెప్టెన్ తిలక్ వర్మ తెలిపాడు. మహ్మద్ సిరాజ్ మరో హైదరాబాదీ పేసర్ సీవీ మిలింద్ సౌత్ జోన్ తరఫున పేస్ బాధ్యతలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. దులీప్ ట్రోఫీ ఫైనల్ ఉదయం 9.30 గంటలకు ఆరంభం కానుంది.



