Monday, September 7, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిసైద్ధాంతిక ‘చేతివాటం’

సైద్ధాంతిక ‘చేతివాటం’

- Advertisement -

వలస పాలనా కాలంలో సామ్రాజ్యవాద దేశాలు తమ వలసలను కొల్లగొట్టడమే గాక వాటిని స్వతంత్ర ఆర్థిక శక్తిగా ఎదగనివ్వకుండా అడ్డుపడ్డాయి. వందల సంవత్సరాల వలస దోపిడీ ఫలితంగా మూడవ ప్రపంచ దేశాలు వెనుకబడి పోయాయి. వలస పాలనాదశ అంతమైన తర్వాత కొత్తగా విముక్తి పొందిన మూడవ ప్రపంచ దేశాలు తమ గత కాలపు దుస్థితి నుండి బైట పడేందుకు అవసరమైన అభివృద్ధి విధానాలను చేపట్టాయి. అందుకోసం అవి దిగుమతులపై ఆధారపడ నవసరం లేని స్వతంత్ర పారిశ్రామిక విధానాన్ని అభివృద్ధి చేయడానికి పూనుకున్నాయి. వలస పాలనా కాలంలో ఆధిపత్యం చెలాయించిన దేశాలకు ఈ విధానాలు రుచించలేదు కాని అవి ఆనాటి పరిస్థితుల్లో ఏమీ చేయలేక మిన్నకుండి పోయాయి. వియత్నాం యుద్ధంలో అమెరికన్‌ సామ్రాజ్యవాదం ‌చావుదెబ్బ తినడమేగాక మూడవ ప్రపంచ దేశాల అభివృద్ధికి శత్రువుగా వ్యవహరిస్తోందన్న అప్రతిష్ట మూటగట్టు కుంది. వియత్నాం భంగపాటు అనంతర సంక్షోభ స్థితి నుండి బైటపడేందుకు అమెరికా కొన్ని ఆసియా దేశాలలో పరిశ్రమ లను నెలకొల్పింది. తన దేశంలో అంతవరకూ జరుగుతూ వచ్చిన ఉత్పత్తిని ఆ దేశాలకు బదలాయించింది. ఆసియా దేశాల్లో వేతనాల స్థాయి చాలా తక్కువగా ఉండడం సామ్రాజ్య వాద దేశాలకు లాభసాటిగా పరిణమించింది. దాంతో తూర్పు ఆసియా దేశాలకు సంపన్న దేశాల నుండి పరిశ్రమలను తరలించడం ఒక వ్యూహంగా మారింది. ఆ తూర్పు ఆసియా దేశాలలో జీడీపీ వృద్ధి వేగంగా జరిగింది. ఆ దేశాలన్నీ చిన్న చిన్న దేశాలు. సంపన్న దేశాల నుండి తరలివచ్చిన పరిశ్రమలతో అక్కడ ఉన్న స్థానిక కార్మికులలో అత్యధికులకు ఉపాధి లభించింది.

తూర్పు ఆసియా దేశాల పరిణామాలను సాకుగా చూపించి సంపన్న పెట్టుబడిదారీ దేశాలు మూడవ ప్రపంచ దేశాలు అనుసరించే అభివృద్ధి వ్యూహాల మీద దాడి మొదలైంది. తూర్పు ఆసియా దేశాలు అనుసరించిన నమూనానే అన్ని మూడవ ప్రపంచ దేశాలూ అమలు చేయాలంటూ పాట మొదలైంది. దేశీయ అవసరాలను తామే ఉత్పత్తి చేసి స్వావలం బన సాధించాలన్న మూడవ ప్రపంచ దేశాల వ్యూహాన్ని విడనాడి ‘ఎగుమతులను పెంచే దిశగా’ కొత్త వ్యూహాన్ని అనుసరిం చాలని బోధించడం ప్రారంభమైంది. ప్రపంచ మార్కెట్‌లోకి ఎగుమతులు చేయడానికి వీలుగా సరుకుల, పెట్టుబడుల సంచారం మీద దేశాలు ఎటువంటి నియంత్రణా అమలు చేయకూడదని, సరుకుల ధరల విషయంలో ప్రభుత్వాలు జోక్యం చేసుకోరాదని ఉపదేశాలు మొదలయ్యాయి. ఆ తర్వాత కాలంలో సామ్రాజ్యవాదం అమలు చేసిన నయా ఉదారవాద వ్యూహానికి కావలసిన సైద్ధాంతిక సమర్ధన ఈ విధంగా రూపొందింది. ఒఇసిడి అనేది సంపన్న దేశాల కూటమి. ఆ కూటమి సభ్యదేశాల కోసం 1970 లో ఒక అధ్యయనం చేపట్టారు. ఏడు సంపుటాలుగా వెలువడిన ఆ అధ్యయనంలో మొదటి సంపుటంలో స్థూల నిర్ధారణలను పేర్కొన్నారు. దానిని ఐఎండి లిటిల్‌, టిబర్‌ ‌స్కిటోవ్‌‌స్కీ, ఎం.ఎఫ్‌‌జి.స్కాట్‌ అనేవారు రచించారు. తక్కిన ఆరు సంపుటాల్లో ఆ యా దేశాల ప్రత్యేక అధ్యయనాల వివరాలను పేర్కొన్నారు.
అలా ప్రత్యేక అధ్యయనం చేసిన దేశాల్లో ఇండియా కూడా ఉంది. ఆ అధ్యయనం లో ఇక్కడ అనుసరించిన నెహ్రూ-మహల్‌‌నోబిస్‌ అభివృద్ధి వ్యూహాన్ని లక్ష్యంగా చేసుకున్నారు. భారతదేశంలో భారీ పరిశ్రమలను, యంత్ర సామగ్రి తయారీ పరిశ్రమలను నిర్మించాలన్నది నెహ్రూ-మహల్‌‌నోబిస్‌ ‌వ్యూహం. ఈ అధ్యయనం దానిపైనే ఎక్కుపెట్టింది. మన దేశంలోని వామపక్షాలు కూడా ఈ వ్యూహాన్ని విమర్శించాయి. కాని ఆ విమర్శ పూర్తిగా విభిన్నమైన ప్రాతిపదికమీద సాగింది. ప్రభుత్వం భూసంస్కరణలను చేపట్టడం లేదని, దాని ఫలితంగా వ్యవసాయరంగ వృద్ధిరేటు, మరీ ముఖ్యంగా ఆహారధాన్యాల ఉత్పత్తి వృద్ధి రేటు బాగా తక్కువగా ఉందని, రెండవ పంచవర్ష ప్రణాళికా కాలంలో దేశం ఎదుర్కొన్న ద్రవ్యోల్బణానికి ఇది దోహదం చేసిందని వామపక్షాలు అప్పట్లో విమర్శించాయి.
కాని ఒఇసిడి విమర్శ వేరు. అది భూసంస్కరణలు చేపట్టాలని అనలేదు సరికదా అసలు భూ సమస్య విషయంలో పూర్తిగా మౌనంగా ఉంది. దాని విమర్శ యావత్తూ వలస పాలనా కాలం నాటి అంతర్జాతీయ పారిశ్రామిక ఏర్పాటు నుంచి విడగొట్టుకోడానికి ఇండియా చేస్తున్న ప్రయత్నం మీదనే కేంద్రీకరించబడింది. ఒఇసిడి ముందుకు తెచ్చిన ఈ వాదనను వామపక్షాలు బాగా విమర్శించాయి. ఆ వాదన కేవలం సామ్రాజ్యవాదుల ఆదేశాల మేరకే చేస్తున్నారని తూర్పార బట్టాయి. వామపక్షాల విమర్శ ఈ విధంగా ఉంది…
మూడవ ప్రపంచ దేశాలలో జరుగుతోన్న ఉత్పత్తిలో, ముఖ్యంగా చేస్తున్న ఎగుమతులలో ఎక్కువ భాగం ముడి సరుకులే, అవి కూడా వ్యవసాయ ఉత్పత్తులే ఉంటున్నాయి. ప్రపంచ మార్కెట్లో వీటి డిమాండ్‌లో పెరుగుదల పెద్దగా లేదు. ఇదే విధానాన్ని కొనసాగించడం వలన అభివృద్ధి వేగం పెరిగేది ఏమీ ఉండదు. కనుక ప్రభుత్వం చైతన్యవంతంగా జోక్యం చేసుకుని ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడానికి అవసరమైన అభివృద్ధి వ్యూహాన్ని చేపట్టాలి. అయితే, ఆ వ్యూహం విజ్ఞతతో కూడినదిగా, న్యాయబద్ధంగా ఉండాలి. వివిధ రంగాల మధ్య సమతూకాన్ని పాటించేదిగా ఉండాలి. అప్పుడే ద్రవ్యోల్బణం వంటివి తలెత్తకుండా ఉండగలదు. అప్పుడే శ్రామిక ప్రజానీకపు కడగండ్లు మరింత పెరగకుండా ఉంటాయి. ఇది జరగాలంటే భూసంస్కరణలు చేపట్టడం అత్యంత అవసరం. అప్పుడే వ్యవసాయ రంగంలో వృద్ధి వేగం పుంజుకుంటుంది.

ఈ వాదనను ఒఇసిడి సవాలు చేసింది. మూడవ ప్రపంచ దేశాలు ప్రధానంగా ఎగుమతి చేసే ముడిసరుకులకు ప్రపంచ మార్కెట్లో తగినంత డిమాండ్‌ ‌లేదన్న వాదనను తప్పుబట్టింది. ఏ మూడో ప్రపంచ దేశమైనా ఏ కాలంలోనైనా ఏ సరుకునైనా ఎంత కావాలంటే అంతమేరకు అమ్ముకోగలిగినంత ప్రపంచ మార్కెట్‌ ఉంది అని ప్రకటించింది. ఏ ప్రభుత్వమైనా ఎటువంటి ప్రాజెక్టును ఎంచుకోవాలి అన్న విషయం మీద ఒఇసిడి అధ్యయన గ్రంథ రచయితలు ఒక ప్రాతిపదికను ముందుకు తెచ్చారు. ప్రపంచ మార్కెట్లో అత్యధిక రేటును పొందగలిగే ఉత్పత్తులను తయారు చేసే ప్రాజెక్టును ప్రధానంగా ఎంచు కోవాలని సూత్రీకరించారు. ప్రపంచ మార్కెట్లో ఎగుమతులు నిర్నిరోధంగా ఎల్లకాలమూ కొనసాగించవచ్చు నన్నది ఈ సూత్రానికి ప్రాతిపదిక.
ఈ ప్రాతిపదిక పూర్తిగా అసంబద్ధమైనది. కాని దానిమీద విమర్శలు ఎక్కువగా రాలేదు. మార్కెట్‌లో ప్రభుత్వం జోక్యం కల్పించుకోరాదంటూ ఒఇసిడి చేసిన రెండో వాదన మీదనే ఎక్కువగా విమర్శలు వచ్చాయి. ఒఇసిడి దృష్టాంతంగా చూపి స్తున్న తూర్పు ఆసియా దేశాలలో సైతం జరిగిన పార్రిశామిక అభివృద్ధి కేవలం మార్కెట్‌ ‌శక్తులకు వదలిపెట్టి నందువల్లే సంభవించినది కాదు. ఆ దేశాల ప్రభుత్వాలు తమ తమ దేశీయ మార్కెట్లను కాపాడుకుంటూ తద్వారా అధిక లాభాలను ఆర్జిస్తూ ప్రపంచ మార్కెట్లో తమ సరుకులను చౌకగా అమ్మగలిగినం దువలన ఆ దేశాల్లో వృద్ధి వేగంగా జరిగింది. కాని ఒఇసిడి అధ్యయనం ఆ దేశాలలోని దేశీయ డిమాండ్‌ ‌సంగతిని పూర్తిగా విస్మరించింది. ఆ తూర్పు ఆసియా దేశాలన్నీ చిన్నచిన్న దేశాలన్న పేరుతో వాటి దేశీయ డిమాండ్‌ ‌విషయం అప్రధాన మైనదిగా ఒఇసిడి అద్యయనం పరిగణించింది. ప్రపంచ మార్కెట్‌ ‌చాలా పెద్దది గనుక ఒక చిన్న దేశం ఎంత మోతాదులో ఎగుమతులు పెంచినా, వాటన్నింటినీ ప్రపంచ మార్కెట్‌ ‌కొనుగోలు చేయగలుగుతుంది అన్నదే ఒఇసిడి అధ్యయన రచయితల వాదన. ఏదో ఒక చిన్న దేశం విషయంలోనైతే ఈ వాదన చెల్లుతుంది. కాని ఏకకాలంలో అనేక దేశాలు తమ ఎగుమ తులను పెంచి ప్రపంచ మార్కెట్‌ ‌లోకి పంపితే వాటన్నిం టినీ ఆ ప్రపంచ మార్కెట్‌ ఏ విధంగా ఇముడ్చుకో గలదు ? అందుచేత ఒఇసిడి రచయితల వాదన మొత్తం మూడవ ప్రపంచ దేశాలన్నింటినీ కలిపి చూసినప్పుడు, ఇండియా వంటి పెద్ద దేశాలను గమనంలోకి తీసుకున్నప్పుడు చెల్లదు.
‘పొదుపు చేయడం ద్వారా సంపన్నులు కావచ్చు’ననే సూత్రంలో ఉన్న అసంబద్ధత వంటిదే ఒఇసిడి రచయితల వాదన. వినియోగానికి ఖర్చు చేయకుండా పొదుపు చేయడం వలన సంపన్నులు కావచ్చును అనేది సూత్రం. దాని ప్రకారం ఒక వ్యక్తి పొదుపు చేసి ధనవంతుడు కాగలుగుతాడు. కాని అదే పొదుపును అందరూ చేస్తే అప్పుడు దేశం మొత్తం మీద స్థూల డిమాండ్‌ ‌పడిపోతుంది. దాంతో ఆర్థిక మాంద్యం తలెత్తుతుంది. దాని వలన ఆదాయాలు, ఉపాధి అవకాశాలు తగ్గి పోతాయి. ఒక వ్యక్తి విషయంలో పని చేసే పొదుపు సూత్రం మొత్తం అందరు వ్యక్తులకూ వర్తింపజేయడం కుదరదు. అలాగే ఒక చిన్న దేశం విషయంలో ఒఇసిడి రచయితలు ప్రతిపాదించిన సూత్రం అన్ని దేశాలకూ ఆటోమేటిక్‌ ‌గా వర్తించదు.

ఒఇసిడి గ్రంథ రచయితలు ఇండియా విషయంలో మరొక తప్పుడు వాదనను ముందుకు తెచ్చారు. తన దేశీయ మార్కెట్‌ ను బలోపేతం చేసుకోవడం మీదనే ఇండియా ఎక్కువగా దృష్టి పెడుతున్నందువల్ల అంతర్జాతీయ మార్కెట్లో ఒకప్పుడు ఇండియాకు ఉండిన వాటా క్రమంగా తగ్గిపోతోందన్నదే వారి వాదన. అంతర్జాతీయ మార్కెట్‌లో డిమాండ్‌ ‌పరిమితమైనం దువల్ల కాక, ఇండియా ఎక్కువ ఎగుమతులు చేయలేకపోవడం వల్లే ఈ పరిస్థితి ఎదురైందన్నది వారి నిర్ధారణ.
ఇది పూర్తిగా తప్పుడు వాదన. ఒకానొక దేశం చేసే ఎగుమతులకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్‌ ‌తక్కువగా ఉండి ఆ దేశపు ఎగుమతుల వృద్ధి ఒక్క శాతం మాత్రమే ఉందనుకుందాం. అప్పుడు ఆ దేశం దిగుమతులపై ఆధారప డడం తగ్గించి వాటిని తనదేశంలోనే ఉత్పత్తి చేసే ‘అంతర్ముఖ వ్యూహాన్ని’ అనుసరించిందనుకుందాం. అప్పుడు ఎగుమతులు ఆ దేశానికి జాతీయ ప్రాధాన్యతగా కొనసాగవు. దాని వలన ఆ దేశపు ఎగుమతులలో వృద్ధి ఉండదు. అప్పుడు ప్రపంచ మార్కెట్లో ఆ దేశపు వాటా తగ్గిపోతుంది. అందుకు ఆ దేశపు అభివృద్ధి వ్యూహాన్ని తప్పు బట్టగలమా? ప్రపంచ మార్కెట్‌ ‌లో డిమాండ్‌ ‌తక్కువగా ఉండడం అన్న అంశం వద్ద మొదలైన క్రమాన్ని తలకిందులు చేసి అభివృద్ధి వ్యూహం వల్లే మార్కెట్‌ ‌వాటా తగ్గిపోయిందనడం ఏ తర్కానికీ అందని చెత్త వాదన.
ఆ విధంగా ఒఇసిడి సైద్ధాంతిక ‘చేతివాటాన్ని’ ప్రదర్శిం చింది. తూర్పు ఆసియా దేశాల అనుభవాల మీద తప్పుగా వ్యాఖ్యానించింది. అక్కడ రాజ్యం నిర్వహించిన ‘రక్షక’ పాత్రను విస్మరించింది. మరోపక్క అంతర్జాతీయ మార్కెట్‌లో ఎప్పుడూ అంతులేని డిమాండ్‌ ఉంటుందన్న తప్పుడు సూత్రాన్ని ముందుకు తెచ్చింది. ఈ ఒఇసిడి రచయితలు చేసిన వాదలనపై ఆధారపడి నయా ఉదారవాద విధానాలను సమర్ధించే వాదనలు రూపొందాయి. కనుక ఆ వాదనలు కూడా చెల్లేవి కావు.

సంపన్న పెట్టుబడిదారీ దేశాలన్నీ తమ వద్ద సాగే పారిశ్రామిక కార్యకలాపాలను తక్కువ వేతనాలకు కార్మికులు లభించే మూడవ ప్రపంచ దేశాలకు తరలిస్తాయి కనుక ఆ అవకాశాన్ని మూడవ ప్రపంచ దేశాలు అందిపుచ్చుకుని ఎగుమతులను పెంచి ఆర్థిక వృద్ధి సాధించాలన్న వాదనలో మరొక పొరపాటు కూడా ఉంది. తమ దేశాల నుండి పారిశ్రా మిక కార్యకలాపాలు బైటకు తరలిపోయి ఆర్థిక వృద్ధి దిగజారిపోతూ వుంటే ఆ సంపన్న దేశాలు అలాగే చూస్తూ ఊరకే ఉండిపోతాయా? తమ ఆర్థిక వృద్ధిని తిరిగి పెంచుకునేందుకు అవి తప్పనిసరిగా పూనుకుంటాయి. అప్పుడు మూడవ ప్రపంచ దేశాల నుండి పరిశ్రమలను తమ వద్దకు వెనక్కి రప్పించు కునేందుకు తయారౌతాయి. ప్రస్తుతం అమెరికన్‌ ‌ప్రభుత్వం చేస్తున్నది అదే. ప్రత్యేకించి ట్రంప్‌ ‌ప్రభుత్వం ఈ విషయంలో మరీ పట్టుదలగా వ్యవహరిస్తోంది.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్‌ ‌పట్నాయక్‌

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -