Wednesday, September 9, 2026
E-PAPER
Homeఎడిట్ పేజిఈ వృద్ధి ఎవరి కోసం?!

ఈ వృద్ధి ఎవరి కోసం?!

- Advertisement -

దేశ ఆర్థిక వ్యవస్థ 7.8 శాతం వృద్ధి సాధించిందని ప్రధాని నరేంద్ర మోడీ ముంబయిలో సోమవారం జరిగిన ‘గ్లోబల్‌ ఫిన్‌టెక్‌ ఫెస్ట్‌’లో గర్వంగా ప్రస్తావించారు. ప్రపంచంలో అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ భారత ఆర్థిక వ్యవస్థ బలంగా ముందుకు సాగుతోందని చెప్పారు. నిజంగా వృద్ధి నమోదైతే దాన్ని స్వాగతించాల్సిందే. కానీ, ప్రభుత్వం దీన్ని ఆర్థిక బలానికి నిదర్శనంగా చూపడం మాత్రం సహేతుకం కాదు. దేశంలోని అత్యంత ధనికులైన ఒక శాతం చేతుల్లోనే దాదాపు నలభై శాతం జాతీయ సంపద ఉంది. అలాగే దేశంలో వచ్చే మొత్తం ఆదాయంలో దాదాపు అరవై శాతం మొదటి పది శాతం కుబేరులకే దక్కుతోంది. అంటే ఆర్థిక వ్యవస్థ పెరుగుతున్న కొద్దీ దాని ఫలితాలు అందరికీ సమానంగా చేరడం లేదని ఇది స్పష్టం చేస్తోంది. కొందరి సంపద వేగంగా పెరుగుతుంటే, మరోవైపు కోట్లాది మంది తమ ఆదాయంతో పెరుగు తున్న ధరలను అందుకోలేక ఇబ్బంది పడుతున్న దుస్థితి నెలకొంది. కాబట్టి జీడీపీ ఎంత పెరిగిందన్నదే కాదు.. ఆ వృద్ధి ఫలితం సామాన్యుడి ఆదాయం, ఉద్యోగం, కొనుగోలు శక్తిలో ఎంత కనిపించిందన్నదే అసలు ప్రశ్న.

ఒకవైపు సంపద కొద్దిమంది చేతుల్లో మరింత కేంద్రీకృతమవుతుంటే, మరోవైపు ధరల భారంతో పేద, మధ్య తరగతి కుటుంబాల కొనుగోలు శక్తి క్షీణిస్తోంది. నేటికీ దేశంలో ఎనభై కోట్ల మందికి ఆహార భద్రత లేదంటే ఈ వృద్ధి ఎవరికోసం అన్న ప్రశ్న తలెత్తుతోంది. ఇది ఎవరో ఇచ్చిన గణాంకం కాదు, ప్రభుత్వమే ఇన్ని కోట్ల మందికి రేషన్‌ ఇస్తున్నామని చెబుతుంటే, వారంతా పేదరికం కింద మగ్గుతున్నట్టే కదా? అందుకే ప్రశ్న జీడీపీ ఎంత పెరిగిందన్నది కాదు.. ఆ వృద్ధి ఎవరి జీవితాలను మెరుగుపరిచిందన్నదే. ఇక జీడీపీల లెక్కల్ని చూస్తే, ఇది ఒక నిర్దిష్ట కాలంలో ఉత్పత్తి అయిన వస్తువులు, సేవల మొత్తం విలువను కొలుస్తుంది. ఆర్థిక కార్యకలాపాల పరిమాణాన్ని తెలుసుకోవడానికి అది అవసరమైనదే. కానీ, అది సంపద పంపిణీని కొలవదు. అందుకే జీడీపీ వృద్ధిని ప్రజల సంక్షేమ వృద్ధిగా చూపించడం ఆర్థిక వాస్తవాన్ని దాచిపెట్టడమే. ఇప్పుడు మనం చూడాల్సింది… దేశ సంపద పెరుగుతున్న కొద్దీ అది ఎటు ప్రవహిస్తోంది? ఒకవైపు భారీ పెట్టుబడులు, కార్పొరేట్‌ లాభాలు, ఆస్తుల విలువలు పెరుగుతున్నాయి. మరోవైపు కుటుంబాల ఖర్చులు భారమవుతున్నాయి.

ఆహారం, విద్య, వైద్యం, ఇల్లు వంటి అవసరాల కోసం చేసే వ్యయం సామాన్యుడి ఆదాయాన్ని మించిపోతోంది. ఆర్థిక వ్యవస్థ వేగంగా పెరుగుతోందన్న వార్త అతని నెల జీతంలో కనిపించకపోతే, జీడీపీ వృద్ధి అతని జీవితంలో ఎక్కడ ఉన్నట్టు? Wealth Tracker India 2026 ప్రకారం దేశంలోని అత్యంత ధనికులైన ఒక శాతం ప్రజల వద్దే జాతీయ సంపదలో నలభై శాతం పోగుపడిన తీరు అసమానత తీవ్రతను చాటుతోంది. ఆర్థిక వ్యవస్థ విస్తరిస్తున్న కొద్దీ దాని ఫలాలు సమానంగా విస్తరిస్తున్నాయన్న భావనకు వాస్తవ గణాంకాలు సరిపోవడం లేదు. ఇదే అభివృద్ధి నమూనాపై అసలు ప్రశ్న. దేశ సంపదను సృష్టించడంలో రైతు భూమి, కార్మికుడి శ్రమ, ఉద్యోగి సమయం, చిన్న వ్యాపారి పెట్టుబడి కీలకం. కానీ, సంపద సృష్టి తర్వాత దాని పెద్ద భాగం మూలధనం చేతుల్లో కేంద్రీకృతమైతే వృద్ధి గణాంకం పెరగవచ్చు, అసమానత కూడా పెరగవచ్చు. జీడీపీ ఈ రెండింటినీ ఒకే సంఖ్యలో కలిపేస్తుంది. అందుకే జీడీపీ పెరుగుదల వెనుక ఎవరు లాభపడ్డారు, ఎవరు నష్టపోయారు అన్న లెక్కను కూడా ప్రజల ముందు పెట్టాలి.

పరిశ్రమలు, పెట్టుబడులు, సాంకేతిక రంగం విస్తరించినా వాటి ప్రయోజనం ఎక్కడికి వెళ్తుందన్నదే చూడాలి. ఒకవైపు దేశం ప్రపంచ స్థాయి మౌలిక వసతుల గురించి గర్వపడుతుంటే, మరోవైపు చిన్న ఉత్పత్తిదారు మార్కెట్‌లో నిలబడటానికి ఇబ్బందిపడే విషయాన్ని ఏ ఆర్థిక గణాంకం వెల్లడించదు! ఆర్థిక వ్యవస్థ డిజిటలైజ్‌ అవుతుంటే మరోవైపు ఉపాధి భద్రత ప్రశ్నార్థకంగా మారుతోంది. సంపద సృష్టి వేగం పెరుగుతున్నా దాని పంపిణీ న్యాయంగా లేకపోతే అది అభివృద్ధి కంటే సంపద కేంద్రీకరణకు దారితీసే వృద్ధే అవుతుంది. మోడీ ప్రసంగంలో యూపీఐ విజయాన్ని కూడా ప్రస్తావించారు. ఆగస్టులో యూపీఐ ద్వారా 24.51 బిలియన్‌ లావాదేవీలు జరిగాయని, మరిన్ని దేశాల చెల్లింపు వ్యవస్థలతో దాన్ని అనుసంధానించాలని చెప్పారు. ఫిన్‌టెక్‌ రంగం ఏఐ, టోకెనైజేషన్‌, క్వాంటమ్‌ టెక్నాలజీ వంటి కొత్త రంగాల్లోకి విస్తరించాలని కూడా పిలుపునిచ్చారు. సాంకేతిక పురోగతి అవసరమే. కానీ డిజిటల్‌ విజయాన్ని కూడా ప్రజల ఆర్థిక భద్రత, డేటా రక్షణ, ఉపాధి అవకాశాలతో కలిపి చూడాల్సిందే. దేశం ప్రపంచంలో పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగాలనుకోవడం మంచిదే. కానీ, పెద్ద ఆర్థిక వ్యవస్థ ఎవరి ప్రయోజనాలకు ఉపయోగపడుతోందన్నది సమాధానం లేని ప్రశ్నగా మారుతోంది. ఇది ఆందోళనకరం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -