Tuesday, September 8, 2026
E-PAPER
Homeఎడిట్ పేజి‘ఫ్రెండ్లీ ప్రభుత్వం’ అంటే ఇదేనా?

‘ఫ్రెండ్లీ ప్రభుత్వం’ అంటే ఇదేనా?

- Advertisement -

2023 డిసెంబర్‌లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఎ. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఇటీవల 1000 రోజుల పాలన పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జరిగిన సభలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెలా ఒకటో తేదీన జీతాలు చెల్లిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పారు. దీన్ని కూడా గొప్ప విజయంగా ప్రకటించుకున్నారు. సంతోషించాల్సిన విషయమే. కానీ, ఒకటో తేదీన చెల్లిస్తున్న జీతం మూడేండ్ల క్రితమే చెల్లించాల్సినదని, అంటే 38 నెలల క్రితం రావాల్సినదని కూడా చెప్పి ఉంటే మరింత సంతోషించేవాళ్లం. ఎందుకంటే, ఇది వాస్తవం. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్లు ఎన్నో ఏళ్లుగా సాగించిన పోరాటాల ఫలితంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పదేండ్లకోసారి, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేండ్లకోసారి వేతన సవరణ చేయాలనే విధానం ఉంది. పెరుగుతున్న ద్రవ్యోల్బణాన్ని భర్తీ చేసేందుకు ప్రతి ఆరు నెలలకోసారి డీఏ చెల్లించాలి. ఆ ప్రకారం తెలంగాణ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లకు 2023 జూలై 1 నుంచి వేతన సవరణ చేసి, అప్పటి డీఏను మూలవేతనంలో కలిపి కొత్త వేతనాలు చెల్లించాలి. కానీ 38 నెలలు గడిచినా వేతన సవరణ జరగలేదు. 2024 జనవరి నుంచి 2026 జూలై వరకు చెల్లించాల్సిన ఆరు విడతల డీఏ, మొత్తం 15.47 శాతం, కూడా పెండింగ్‌లోనే ఉంది.

ఒక్కో ఉద్యోగి ఎంత నష్టపోతున్నాడు?
2023 జూలై నాటికి ఉన్న 33.67 శాతం డీఏను మూలవేతనంలో కలిపితే అంతమేరకు మూలవేతనం పెరుగుతుంది. దానిపై డీఏ, హెచ్‌ఆర్‌ఏ, ఇతర అలవెన్సులు లభిస్తాయి. అంటే ఈ మొత్తానికే ఉద్యోగి 38 నెలలుగా నష్టపోతున్నాడు.వేతన సవరణలో ఫిట్‌మెంట్‌ కూడా ఇస్తారు. ద్రవ్యోల్బణం, వాస్తవ ధరల పెరుగుదల మధ్య వ్యత్యాసాన్ని కొంత భర్తీ చేయడమే దీని ఉద్దేశం. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్‌ ప్రభుత్వం 2014 జూన్‌ నుంచి 43 శాతం, 2020 ఏప్రిల్‌ నుంచి 30 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చింది. ఇప్పుడు తమది ఉద్యోగ అనుకూల ప్రభుత్వమని చెబుతున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం కనీసం ఆ స్థాయిలోనైనా ఫిట్‌మెంట్‌ ఇవ్వాలి. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే పీఆర్‌సీ అమలు చేస్తామన్న హామీని కూడా గుర్తు చేసుకోవాలి. ఇది కేవలం ఉద్యోగుల జీతాలకు సంబంధించిన అంశం మాత్రమే కాదు. రాష్ట్రంలో లక్షలాది కుటుంబాల జీవన ప్రమాణంతో ముడిపడిన విషయం. జీతాలు, డీఏలు సకాలంలో అందకపోతే ఉద్యోగుల కొనుగోలు శక్తి తగ్గుతుంది. దాని ప్రభావం మార్కెట్‌పై, చిన్న వ్యాపారాలపై కూడా పడుతుంది. కాబట్టి ఉద్యోగుల సమస్యలను ఆర్థిక భారం కోణంలో మాత్రమే కాకుండా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో భాగంగా చూడాల్సిన అవసరం ఉంది.

మూడు డీఏలు ఆరయ్యాయేంటి?
కాంగ్రెస్‌ ప్రభుత్వం 2023 డిసెంబర్‌లో అధికారంలోకి వచ్చే సమయానికి గత ప్రభుత్వం మూడు డీఏలను బకాయి పెట్టింది. అధికారంలోకి వచ్చిన 15 రోజుల్లోనే వాటిని చెల్లిస్తామని ఎన్నికల మ్యానిఫెస్టోలో హామీ ఇచ్చారు. భవిష్యత్తులో డీఏలు పెండింగ్‌లో లేకుండా చూస్తామని కూడా చెప్పారు. కానీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు దాటింది. గత ప్రభుత్వం బకాయి పెట్టిన మూడు డీఏలను చెల్లించడంతోనే సరిపెట్టి, తమ కాలంలో చెల్లించాల్సిన ఆరు డీఏలను పెండింగ్‌లో ఉంచడంపై ప్రభుత్వం ఆలోచించాలి. ఉద్యోగులు తమ కుటుంబ సభ్యులని ప్రభుత్వం చెబుతోంది. అన్ని అలవెన్సులు, బకాయిలు చెల్లిస్తున్నామని అంటోంది. ఉద్యోగ సంఘాలతో చర్చల్లో అన్నీ చేస్తామని హామీ ఇస్తోంది. కానీ 15 రోజుల్లో చెల్లిస్తామన్న మూడు డీఏలు ఆరయ్యాయి. ఆరు నెలల్లో అమలు చేస్తామన్న వేతన సవరణకు 33 నెలలు గడిచినా నివేదికను కూడా తెప్పించుకోలేదు. 2026 జూన్‌ 2 నాటికి నివేదిక తెప్పించి అమలు చేస్తామన్న హామీకి కూడా కాలం చెల్లింది. డీఏలు చెల్లించండి, వేతన సవరణ అమలు చేయండి, సీపీఎస్‌ రద్దు చేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధ రించండి, ఎన్నికల హామీలను అమలు చేయండి అంటూ ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. తమ హక్కుల కోసం అడుగుతున్న సంఘాలు ఉనికి కోసమే ప్రభుత్వాన్ని బెదిరిస్తున్నాయని చెప్పడం ఉద్యోగులను ప్రజల దృష్టిలో చులకన చేయడమే. గత ప్రభుత్వ వైఖరికి, ప్రస్తుత ప్రభుత్వ వైఖరికి తేడా ఏమిటో ముఖ్యమంత్రి చెప్పాలి.

గతంలో ఒకటో తేదీన జీతాలివ్వలేదా?
ఉమ్మడి రాష్ట్రంలో ఏ ప్రభుత్వం కూడా రెగ్యులర్‌ ఉద్యోగుల జీతాల చెల్లింపులో ఇంతటి జాప్యం చేయలేదని చెప్పవచ్చు. తెలంగాణ ఏర్పడిన తర్వాత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో కరోనా కాలం నుంచి జీతాల చెల్లింపులో జాప్యం జరిగింది. అయితే రాష్ట్ర కేంద్రం, హైదరాబాద్‌ జిల్లాలో పనిచేసే ఉద్యోగులకు ఒకటో తేదీన, మిగిలిన వారికి పదో తేదీలోపు జీతాలు చెల్లించేవారు. జీతాలు, ఇతర బిల్లులు సక్రమంగా చెల్లించకపోవడం వల్లే ఉద్యోగుల్లో అసంతృప్తి పెరిగింది. ఇప్పుడు కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల్లో కొందరికి ఇటీవలే ఒకటో తేదీన వేతనాలు చెల్లిస్తున్నారని చెబుతున్నారు. గురు కులాలు, మోడల్‌ స్కూళ్ల ఉద్యోగులు, ఉపాధ్యాయులకు కూడా ఒకటో తేదీన జీతాలు అందడం లేదన్న విమర్శలు ఉన్నాయి. పెండింగ్‌ బిల్లుల భారం కూడా ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి కంటే పెరిగిందన్న ఆరోపణలు ఉన్నాయి. అంటే మీ కాలంలో చెల్లించాల్సిన బిల్లులు కూడా పూర్తిగా చెల్లించనట్లే కదా? కేసీఆర్‌ పాలనలో ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పట్టించుకోకపోవడం వల్లే ప్రజలు పాలనలో మార్పును కోరుకున్నారు. ఇప్పుడు అదే బాటలో ప్రభుత్వం నడిస్తే మళ్లీ ప్రజల విశ్వాసం ఎలా పొందగలదు?

ఉనికి కోసమే ఉద్యోగ సంఘాలు బెదిరిస్తున్నాయా?
ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నుంచి ఆశించిన మార్పు కనిపించడం లేదు. కాంగ్రెస్‌ ఎన్నికల మ్యానిఫెస్టో, ఉద్యోగ సంఘాలతో చేసిన చర్చలు, ఇచ్చిన హామీలను ప్రభుత్వం మరోసారి సమీక్షించాలి. అరవై నెలల ప్రభుత్వ పదవీకాలంలో ఇప్పటికే 33 నెలలు గడిచిపోయాయి. ఐదేండ్ల పీఆర్‌సీ కాలంలో 38 నెలలు పూర్త య్యాయి. డీఏను సకాలంలో చెల్లించకపోవడం ఉద్యోగుల కొనుగోలు శక్తిని, జీవన ప్రమాణాన్ని దెబ్బతీస్తుంది. జీపీఎఫ్‌, టీఎస్‌జీఎల్‌ఐ వంటి మొత్తాలు ఉద్యోగులు తమ సొంతంగా దాచుకున్నవే. కాబట్టి వాటిని ప్రభుత్వం తన దయగా చూప కూడదు. ప్రభుత్వం నిజంగా ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా భావిస్తే వారి సమస్యలపై ఇకనైనా స్పష్టమైన కార్యాచరణ ప్రకటించాలి. ఏ డీఏ ఎప్పుడు చెల్లిస్తారు, వేతన సవరణ ఎప్పుడు అమలు చేస్తారు, పీఆర్‌సీపై నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారనే అంశాలపై కాలపట్టిక ఇవ్వాలి. హామీలపై స్పష్టత లేకపోవడమే ఉద్యోగుల్లో అసంతృప్తికి ప్రధాన కారణంగా మారుతోంది.

మాటలు కాదు,ఆచరణ కావాలి
ప్రభుత్వం ఉద్యోగులను కుటుంబ సభ్యులుగా భావిస్తే వారి సమస్యలను అదే బాధ్యతతో పరిష్కరించాలి. పెండింగ్‌లో ఉన్న ఆరు డీఏలను చెల్లించి, వేతన సవరణకు స్పష్టమైన కాలపట్టిక ప్రకటించాలి. పీఆర్‌సీని అమలు చేసి, ఎన్నికల హామీలను నెరవేర్చాలి. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జేఏసీతో ముఖ్యమంత్రి స్వయంగా చర్చలు జరిపి ఉద్యోగుల్లోని అను మానాలను తొలగించాలి. ఒకటో తేదీన జీతం ఇవ్వడం విజయమే కావచ్చు. కానీ ఉద్యోగులకు రావాల్సిన డీఏలు, వేతన సవరణ, అలవెన్సులు, బకాయిలను సకాలంలో అందించడమే నిజమైన ఉద్యోగ అనుకూల పాలనకు నిదర్శనం. మాటల్లో ఉద్యోగులు కుటుంబ సభ్యులు కావడం కాదు, వారి హక్కులను గౌరవించి అమలు చేయడమే ఆ మాటలకు నిజమైన అర్థం.

జి.వి. నాగమల్లేశ్వరరావు, 9490300669

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -