వీరనారి ఐలమ్మ.. ఈ పేరు లేకుండా సాయిధ పోరాట చరిత్రను ఊహించలేం. ఎంతోమందిలో స్ఫూర్తి నింపి, చైతన్యాన్ని రగిలించిన ధీశాలి ఆమె. రైతులు, కూలీలను ఏకం చేసి ఉద్యమానికి ఊపిరిలూదింది. భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటానికి స్ఫూర్తినిచ్చింది. నిజాం నవాబుకూ, ఆయన తొత్తులైన భూస్వాములకూ వ్యతిరేకంగా జరిగిన తెలంగాణ సాయుధ పోరాటంలో తన ఇల్లునే కార్యాలయంగా మార్చింది. స్త్రీ జాతికి ఆదర్శనీయం. ఆమె జీవితం మహిళా లోకానికి మార్గదర్శకం. ఆమె పోరాట స్ఫూర్తి, దేశ్‌ముఖ్‌ను ఎదిరించిన వైనం మహిళా శక్తికి స్పూర్తిదాయకం.
చిట్యాల ఐలమ్మ 1895లో ఉమ్మడి వరంగల్ జిల్లా, రాయపర్తి మండలం, పాలకుర్తి నియోజకవర్గంలోని కిష్టాపురం గ్రామంలో సాధారణ రజక కుంటుంబంలో పుట్టింది. తల్లి ఓరుగంటి మల్లమ్మ, తండ్రి సాయిలు. వీరిలో ఐలమ్మ నాలుగో సంతానం. తల్లిదండ్రులది ఉమ్మడి వరంగల్ జిల్లా రాయపర్తి మండలం కిష్టాపురం. 11వ ఏట పాలకుర్తికి చెందిన చిట్యాల నర్సయ్యతో ఐలమ్మకు పెండ్లి జరిగింది. ఆమెకు ఐదుగురు కొడుకులు, ఒక కూతురు. దొర ఇంట ఊడిగం చేయడం, ఊరిజనం బట్టలు ఉతకడం ఆమె రోజు వారి పని. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబం కావడంతో కులవృత్తే వారికి జీవనాధారం. కుటుంబం గడవడం కష్టమైన సందర్భంలో ఎదిగి వచ్చిన కొడుకులతో కలిసి వ్యవసాయం చేయాలనుకుంది. మల్లంపల్లి భూస్వామి కొండలరావుకు 40 ఎకరాల భూమి ఉండగా అందులో కొంత భూమిని ఐలమ్మ కౌలుకు తీసుకుంది. ఇలా కులవృత్తి చేసుకుంటూ, వ్యవసాయం చేస్తూ జీవిస్తున్న తరుణంలో పాలకుర్తిలో ఆంధ్రమహాసభ ఏర్పడింది. నల్ల నరసింహులు, ఆరుట్ల రామచంద్రారెడ్డి తదితర నాయకులు పాలకుర్తి కేంద్రంగా 1945లో ఆంధ్ర మహాసభను ఏర్పరిచారు. ఐలమ్మతోపాటు మరికొంత మంది యువకులు ఆ మహాసభలో చేరారు. ఆనాడు ఐలమ్మ ఇల్లే సంఘానికి కేంద్రంగా మారింది. సంఘ నాయకులకు రక్షణ కల్పించడం, భోజన వసతి కల్పించడం ఐలమ్మ పని.
ఎడారిలో ఒయాసిస్సులా
ఆరోజుల్లో రజాకార్ ఉపసేనాని విస్నూరు దేశ్‌ముఖ్ రాపాక రామచంద్రారెడ్డి ఆయన కుమారుడు జగన్ మోహన్ రెడ్డి (బాబుదొర)లు 60 గ్రామాలలో ఆడిందే ఆట, పాడిందే పాట. ప్రజలను హింసించడం, చంపటం, వెట్టిచాకిరీ చేయించుకోవడం వంటి ఎన్నో అకృత్యాలకు ఒడిగట్టారు. ఖాసీం రజ్వీ నాయకత్వాన ఉన్న రజాకార సేనలను పోషిస్తూ విస్నూరులో పోలీసు ఠాణాను ఏర్పాటు చేసుకున్నారు. అటువంటి పరిస్థితుల్లో ప్రజలకు ఆంధ్రమహాసభ ఎడారిలో ఒయాసిస్సూలా కన్పించింది. ఆంధ్ర మహాసభను ప్రజలు ఆదరించడం మొదలుపెట్టారు. దాంతో విస్నూరు దేశ్‌ముఖ్ ఆంధ్ర మహాసభను అంతం చేయాలని పంతం పట్టాడు.
గుండాలను పంపించి
1945 ఫిబ్రవరిలో పాలకుర్తి జాతర వచ్చింది. ఈ జాతర సందర్భంగా సంఘం ప్రచారం చేపట్టాలని ఆంధ్రమహాసభ పాలకుర్తి దళం ఆర్గనైజర్ చకిలం యాదగిరిరావు అనుకున్నారు. బహిరంగ సభ ఏర్పాటుకు సంఘం కార్యకర్తలతో చర్చించి కేంద్ర కమిటీకి తెలుపడంతో బహిరంగ సభకు ఆరుట్ల రామచంద్రారెడ్డి నిజాం ప్రభుత్వం నుంచి అనుమతి పొందారు. బహిరంగ సభను పాలకుర్తిలో ఏర్పాటు చేశారు. బహిరంగసభ జయప్రదమైతే తన పరువు పోతుందని భయపడిన దేశ్‌ముఖ్ రామచంద్రారెడ్డి సభను భగ్నం చేసి ఆరుట్ల రామచంద్రారెడ్డిని చంపాలని 60 మంది గూండాలను పాలకుర్తికి పంపాడు. రామచంద్రారెడ్డిని చంపేందుకు ఆ గూండాలు విశ్వ ప్రయత్నం చేశారు. దీంతో బహిరంగ సభకు పోలీసు రక్షణ అడిగితే దేశ్‌ముఖ్‌తో కుమ్మక్కైన పోలీస్ అధికారి బందోబస్తుకు నిరాకరించారు. దీంతో ఆరుట్ల రామచంద్రారెడ్డి బహిరంగ సభ రద్దు చేసుకున్నారు. సభ రద్దు విషయాన్ని సంఘం కార్యకర్తలకు తెలిపేందుకు ఆరుట్ల వాలంటీర్ల రక్షణలో ఓ ఇంటిలో ఉండగా రాత్రి 9 గంటల సమయంలో వనమా వెంకన్న నాయకత్వంలో గూండాలు ఆరుట్లపై దాడికి ప్రయత్నించారు. దీన్ని పసిగట్టిన సంఘం కార్యకర్తలు గూండాలపై ఎదురుదాడికి దిగగా వెంకన్న తలపగిలింది. దీంతో గుండాలు పారిపోయారు. ఈ దాడితో సంఘం కార్యకర్తలైన ఐలమ్మ కుటుంబంతో పాటు, నాయకులపై విస్నూరు పోలీసులు కేసులు నమోదు చేశారు. ఇందులో 10 మందిని పోలీసులు అరెస్టు చేసి విస్నూరు పోలిసుస్టేషన్‌కు తరలించారు. కొందరు నాయకులు పాలకుర్తి ప్రాంతంలోని కొండాపురంలో గల గిరిజన ఇండ్లల్లో తలదాచు కున్నారు.
స్ఫూర్తి రగిలించి
సంఘానికి అండగా ఉన్న ఐలమ్మ కుటుంబాన్ని పాలకుర్తిలో లేకుండా చేసేందుకు దేశ్‌ముఖ్ వ్యూహం పన్నాడు. దేశ్‌ముఖ్‌లటగుండాలను ఐల్లమ్మ కుటుంబంపైకి ఉసి గొల్పిండు. ఐలమ్మ కుంటుంబాన్ని పొలం దున్నేందుకు నాగళ్లను పంపమనగా అందుకు ఆమె తిరస్కరించింది. దీంతో రెచ్చిపోయిన దొరలు పాలకుర్తిలో సంఘం లేకుండా చేస్తామని, సంఘం కార్యకర్తల ఇండ్లు దున్ని విత్తనాలు వేస్తామని, గ్రామాన్ని తగులబెడ్తానని ప్రతిజ్ఞ చేశారు. దీంతో ఆగ్రహంతో సంఘం కార్యకర్తలు దేశ్‌ముఖ్ ఇంటిని గునపాలతో తవ్వి నేల మట్టం చేశారు. దీనిలో ఐలమ్మ పాత్ర కీలకం. నేలమట్టమైన ఇంటి స్థలాన్ని దున్ని మొక్కజొన్న విత్తనాలు వేశారు. నాలుగు నెలల తర్వాత మొక్కజొన్న కంకులను గ్రామస్తులందరూ మూకుమ్మడిగా మంటల్లో కాల్చుకు తిని దేశ్‌ముఖ్‌కు తగిన గుణపాఠం నేర్పారు. ‘బాంచెన్ నీ కాల్మొక్తా’ అన్న జనంతో బందూక్ చేతబట్టించింది. దీంతో ఐలమ్మ కుటుంబంపై మరింత పగ పెంచుకున్న దేశ్‌ముఖ్ అదను కోసం వేచి చూశాడు.
భూమి కోసం..
ఐలమ్మ పంట కోతకు వచ్చిన సమయంలో దేశ్‌ముఖ్ ఏజెంట్ రంగంలోకి దిగాడు. పొలం కోసుకురమ్మంటూ గూండాలను పురమాయించాడు. ఇది తెలుసుకున్న ఐలమ్మ ఆంధ్రమహాసభ కేంద్ర కమిటీకి తెలిపింది. దీంతో సంఘం నాయకులు భీమిరెడ్డి నరసింహారెడ్డి మరో 15 మందిని వెంటబెట్టుకుని వెళ్లి పొలం వద్ద మాటు వేశారు. ఇంతలో దేశ్‌ముఖ్ గూండాలు పంట కోసుకునేందుకు వచ్చారు. కొంగు నడుముకు చుట్టి, కొడవలి చేత బట్టి ‘ఈ భూమినాది.. పండించిన పంట నాది.. తీసుకెళ్లడానికి దొరెవ్వడు.. నా ప్రాణం పోయాకే ఈ పంట, భూమి మీరు దక్కించుకోగలరు’ అంటూ ఐలమ్మ దొరకు సవాలు విసిరింది. వారి అరాచకాలపై ఎదురు తిరిగి ఎర్రజెండా చేత పట్టింది. సంఘం నాయకులు వారితో పోరాడుతూనే పంటను కోసి కట్టలు కట్టి ఐలమ్మ ఇంటికి చేర్చారు. ఆమె ఉద్యమ ఫలితంగా కమ్యూనిస్టుల నాయకత్వంలో 90 ఎకరాల దొర భూమిని కూడా ప్రజలకు పంచారు. దొర ఇంటిపై దాడి చేసి ధాన్యాన్ని ప్రజలకు పంచి పెట్టారు. దీంతో దొర కోపంతో వారిపై కేసులు పెట్టాడు. పోలీసులు సంఘం నాయకులను, ఐలమ్మ కుటుంబీకులను అరెస్టు చేసి చిత్రహింసలకు గురిచేశారు. ఆమె ఒక్కగానొక్క కూతురిపై లైంగిక దాడి చేసినా, భర్తను, కొడుకులను హింసించి చంపినా ఐలమ్మ చలించకుండా మొక్కవోని ధైర్యంతో సంఘం వెంట నడిచింది. ఆ పోరాటయోధురాలు 1985 సెప్టెంబర్ 10న తుదిశ్వాస విడిచింది.


