మండలి చైర్మెన్ గుత్తా ప్రకటన తీర్మానాన్ని ప్రతిపాదించిన మంత్రి శ్రీధర్ బాబు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యల వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధుసూదన్, ఎన్.నవీన్‌కుమార్‌రెడ్డిపై మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి సస్పెన్షన్ వేటు వేశారు. మంగళవారం సాయంత్రం వారిద్దరిని సస్పెండ్ చేయాలని శాసనమండలిలో రాష్ట్ర శాసనసభా వ్యవహారాల మంత్రి శ్రీధర్‌బాబు తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై చైర్మెన్ మూజువాణి పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. అనంతరం ప్రస్తుత సెషన్ మొత్తానికి ఇద్దరు ఎమ్మెల్సీలను సస్పెండ్ చేసినట్టు ప్రకటించారు. మండలిని బుధవారం ఉదయం 10 గంటలకు వాయిదా వేశారు. సభ సాయంత్రం తిరిగి ప్రారంభం కాగానే, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను అడ్డుకుని, మహిళా సభ్యులను అడ్డగించిన పోలీసుల తీరుపై ఆ పార్టీ శాసనమండలి పక్షనేత మధుసూదనాచారి ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని చైర్మెన్ తిరస్కరించారు. వారిద్దరిపై శాసనమండలి సభా హక్కులు, సభా విధానాలు, క్రమశిక్షణకు సంబంధించిన నిబంధనలకు అనుగుణంగా శాసనమండలి చైర్మెన్ తదుపరి చర్యలు తీసుకోవాలని కోరుతూ శాసనసభ తీర్మానించిందని చైర్మెన్ తెలిపారు.
చైర్మెన్ ప్రతిపాదన
అంతకుముందు మంగళవారం ఉదయం 10 గంటలకు సభ ప్రారంభం కాగానే స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన బీఆర్ఎస్ సభ్యులు తాతా మధుసూదన్, ఎన్.నవీన్ రెడ్డిలపై చర్యలు తీసుకోవాలని మండలి చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రతిపాదించారు. దీంతో బీఆర్ఎస్ మండలి పక్షనేత మధుసూదనాచారితో పాటు పలువురు సభ్యులు గుత్తా నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సభలో ఆందోళన చేపట్టారు.
స్పీకర్ ను కులం పేరుతో దూషణ.. దేశ చరిత్రలో తొలిసారి : మహేశ్ కుమార్ గౌడ్
బీఆర్ఎస్ సభ్యుల ఆందోళన మధ్యే కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ తన ప్రసంగాన్ని కొనసాగించారు. స్పీకర్ ను కులం పేరుతో దూషించడం దేశ చరిత్రలో మొదటిసారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి ఫ్యూడల్ భావజాలాన్ని పుణికి పుచ్చుకుందని ఆరోపించారు. దళిత స్పీకర్ పై అనుచితంగా వ్యాఖ్యలు చేసిన వారిని ఇంకెంత మాత్రం ఉపేక్షించవద్దని కోరారు. అలా ఉపేక్షిస్తే ప్రజలు క్షమించరని ఈ సందర్భంగా కాంగ్రెస్ ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ తెలిపారు. వెంటనే వారిద్దరిని సస్పెండ్ చేయాలని ఆయన కోరారు. శాసనసభలో భట్టి విక్రమార్కకు ప్రతిపక్ష హోదా దక్కకుండా ఎమ్మెల్యేల కొనుగోలు చేయడం, ఉప ముఖ్యమంత్రి రాజయ్యను మంత్రివర్గం నుంచి బహిష్కరించడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు. సభ్య సమాజం తల వంచుకునేలా వ్యవహరించిన ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్సీలను వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ సభ్యులు పోడియం వద్దకు దూసుకెళ్లి నిరసన వ్యక్తం చేయడంతో సభను చైర్మెన్ వాయిదా వేశారు. తిరిగి సభ ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని మంత్రులు జూపల్లి కృష్ణారావు, సీతక్క, వాకిటి శ్రీహరి డిమాండ్ చేశారు. తాతా మధు యావత్ దళిత సమాజాన్ని కించపరిచే విధంగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వారిద్దరి సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు. ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధులు చట్టసభల గౌరవం, ప్రతిష్ట పెరిగేలా హుందాగా ప్రవర్తించాలని సూచిం చారు. సభ్యులందరూ సభా నియమాలు, సంప్రదాయాలు పాటించాలని విజ్ఞప్తి చేశారు. బీఆర్ఎస్ సభ్యులు మహిళా పోలీసుల పట్ల అనుచితంగా ప్రవర్తించారనీ, వారిపై మహిళా కమిషన్ కు ఫిర్యాదు చేయనున్నట్టు తెలిపారు. మహిళా ఎమ్మెల్యేలపై పోలీసులు అనుచితంగా ప్రవర్తిస్తే వారిపైన చర్యలు తీసుకుంటామని వారు ప్రకటించారు.
చైర్మెన్ ఛాంబర్ ముందు బైఠాయింపు
ఇద్దరు సభ్యుల సస్పెన్షన్ అనంతరం బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఛాంబర్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం అప్రజా స్వామికంగా, అన్యాయంగా వ్యవహరిస్తున్నదని విమర్శించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు పిరికి ప్రభుత్వం నశించాలి, సీఎం రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, రూల్స్‌కు విరుద్దంగా చేసిన ఎమ్మెల్సీల సస్పెన్షన్‌ను ఎత్తివేయాలి అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వ నిరంకుశ వైఖరి, అప్రజా స్వామిక వైఖరి, చట్ట వ్యతిరేక వైఖరి, సభా వ్యతిరేక వైఖరి నశించాలి.. మహిళా ద్రోహి ప్రభుత్వం, దుర్యోధన, దుశ్శాసన, ధృతరాష్ట్ర ప్రభుత్వం నశించాలంటూ భీష్మించుకు కూర్చున్నారు. సభలో చర్చించకుండా ఏకపక్షంగా చైర్మెన్ నిర్ణయం తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పిరికితనానికి పరాకాష్ట : మధుసూదనాచారి
సభ జరిగిన తీరు పిరికితనానికి పరాకాష్ట అని బీఆర్ఎస్ శాసనసమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి విమర్శించారు. మంగళవారం సాయంత్రం అసెంబ్లీ మీడియా పాయింట్ లో ఆయన మాట్లాడారు. రెండు రోజులుగా సభ జరుగుతున్న తీరు చీకటి అధ్యాయమని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తామని, జవాబు చెప్పలేక ప్రభుత్వం పారిపోయిందన్నారు. ఆరు గంటలు వాయిదా వేసి మూడు నిమిషాల్లో సభను ముగించారని తెలిపారు. కౌన్సిల్ లో కాంగ్రెస్ పార్టీకి ఏడు మంది సభ్యులే ఉన్నారనీ, అందుకే ఆగమేఘాల మీద పారిపోయిందని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ మాట్లాడుతూ, తమ పార్టీ ఇద్దరు సభ్యులను ఏ రూల్ ప్రకారం సస్పెండ్ చేశారని ప్రశ్నిస్తే తమను బయటికి గెంటేశారని తెలిపారు. సభ బయట జరిగిన వాటిపై చర్యలు తీసుకునే అధికారం చైర్మెన్ కు ఉండదన్నారు. భౌతికదాడులు చేయడం పరిపాటిగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం ప్రతి ఒక్కరిని అణచివేస్తున్నదని దుయ్యబట్టారు. కాంగ్రెస్ ప్రభుత్వ దమనకాండను కొనసాగనివ్వబోమనీ, ప్రతిఘటిస్తామని ఆయన హెచ్చరించారు.
అడ్డుకున్న మార్షల్స్
సస్పెన్షన్ అనంతరం తాతా మధుసూదన్, ఎన్.నవీన్ కుమార్ రెడ్డిలు అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడేందుకు ప్రయత్నించగా మార్షల్స్ వారిని అడ్డుకున్నారు. అక్కడి నుంచి మాట్లాడకుండా వెళ్లాలని కోరినప్పటికీ వినకపోవడంతో బలవంతంగా అక్కడ్నుంచి తరలించారు.
ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



