రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌జాజు
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలో కూరగాయలు, పండ్లతోటలు, తృణధాన్యాలు, ప్రత్యామ్నాయ పంటల సాగును మరింత విస్తరించేందుకు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు అధికారులను ఆదేశించారు. మంగళవారం హైదరాబాద్‌లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో సీఎస్ సంజయ్ జాజు అధ్యక్షతన కూరగాయలు, పండ్లతోటలు, ప్రత్యామ్నాయ పంటల సాగు ప్రోత్సాహంపై సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో వ్యవసాయ శాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్, ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ అల్తాస్ జానయ్య, పీవీ నర్సింహారావు తెలంగాణ వెటర్నరీ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎం. జ్ఞాన ప్రకాష్, ఉద్వానవన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ డాక్టర్ దండా రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎస్ సంజయ్ జాజు మాట్లాడుతూ, రైతులకు అధిక ఆదాయం అందించే కూరగాయల సాగును మరింత ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కూరగాయలు, పండ్లతోటలు, తృణధాన్యాలు, ప్రత్యామ్నాయ పంటల సాగుకు అనుకూలమైన ప్రాంతాలను గుర్తించి, సాగు విస్తీర్ణాన్ని పెంచేలా సమన్వయంతో చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులకు అవసరమైన సాంకేతిక సహకారం, ఆర్థిక వనరులు, మార్కెటింగ్ సదుపాయాలను అందించేందుకు నాబార్డ్‌తో పాటు అన్ని సంబంధిత సంస్థలు, ఏజెన్సీల సహాయ సహకారాలను సమర్థవంతంగా వినియోగించుకోవాలని అధికారులను ఆదేశించారు. ఎల్ నినో ప్రభావం నేపథ్యంలో నీటి వనరుల సమర్థ వినియోగానికి ప్రాధాన్యత ఇవ్వాలని, కూరగాయలు, పండ్లతోటలు, ప్రత్యామ్నాయ పంటల్లో డ్రిప్ ఇరిగేషన్‌ను మరింత విస్తృతంగా ప్రోత్సహించాలని సీఎస్ సూచించారు. వ్యవసాయ, ఉద్యానవన శాఖలతో పాటు వ్యవసాయ, వెటర్నరీ విశ్వవిద్యాలయాలు సమన్వయంతో పనిచేసి రైతులకు మెరుగైన సాంకేతిక మార్గదర్శకత్వం అందించాలని ఆయన పేర్కొన్నారు.
కూరగాయల సాగుపై ప్లాన్ రూపొందించండి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



