Wednesday, September 9, 2026
E-PAPER
Homeజాతీయంబియ్యం ఎగుమతులకు
 పరస్పరం సహకరించుకుందాం

బియ్యం ఎగుమతులకు
 పరస్పరం సహకరించుకుందాం

- Advertisement -

ఫిలిప్పీన్స్‌ వ్యవసాయశాఖ కార్యదర్శితో మంత్రి ఉత్తమ్‌ వాణిజ్య విస్తరణపై చర్చ
నవతెలంగాణ – న్యూఢిల్లీ బ్యూరో

ఫిలిప్పీన్స్‌కు తెలంగాణ నుంచి బియ్యం ఎగుమతులను పెంచడంతోపాటు ఇరు ప్రాంతాల మధ్య వాణిజ్య సంబంధాలను విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నామని రాష్ట్ర నీటిపారుదల, ఆహార, పౌర సరఫరాల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌కుమార్ రెడ్డి తెలిపారు. మంగళవారం నాడిక్క‌డ‌ ఫిలిప్పీన్స్‌ వ్యవసాయశాఖ కార్యదర్శి, ఆ దేశ క్యాబినెట్‌ సభ్యుడు ఫ్రాన్సిస్కో పి. టు లారెల్‌ జూనియర్‌తో ఆయన సమావేశమయ్యారు.
భారత్–ఫిలిప్పీన్స్ సంబంధాలు, ఆహార భద్రత, వ్యవసాయ సహకారం, తెలంగాణ నుంచి ఫిలిప్పీన్స్‌కు ప్రత్యక్ష వాణిజ్యాన్ని పెంచే అవకాశాలపై కూడా ఇరువురు విస్తృతంగా చర్చించారు. సంబంధిత ప్రభుత్వ సంస్థలు, గుర్తింపు పొందిన దిగుమతిదారులు, ఎగుమతిదారులు, రైస్ మిల్లర్ల భాగస్వామ్యంతో ఈ ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లే విధానంపై చర్చించారు. ఫిలిప్పీన్స్‌కు దిగుమతి చేసుకునే బియ్యం అవసరం గణనీయంగా ఉండటం, అంతర్జాతీయంగా బియ్యం సరఫరా చేసే దేశాల సంఖ్యను విస్తరించేందుకు ఆ దేశం ప్రయత్నిస్తుండటం నేపథ్యంలో ఈ చర్చలకు ప్రత్యేక ప్రాధాన్యం ఏర్పడిందన్నారు. తెలంగాణలో భారీగా నాణ్యమైన బియ్యం ఉత్పత్తి అవుతోందని, ఆధునిక రైస్‌ మిల్లింగ్‌ వ్యవస్థ, పెద్ద మొత్తంలో సరఫరా చేయగల సామర్థ్యం రాష్ట్రానికి ఉందని వివరించారు.

తెలంగాణ నుంచి పెద్ద మొత్తంలో బియ్యం దిగుమతి చేసుకునే అవకాశాలను పరిశీలిస్తామని లారెల్‌ సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. బియ్యం రకాలు, ధరలు, నాణ్యతా ప్రమాణాలు, కొనుగోలు, రవాణా, ధ్రువీకరణతో పాటు శానిటరీ, ఫైటోశానిటరీ నిబంధనలపై ఇరువురు చర్చించారు. ప్రభుత్వ సంస్థలు, దిగుమతిదారులు, ఎగుమతిదారులు, రైస్‌ మిల్లర్ల సమన్వయంతో వాణిజ్య అవకాశాలను ముందుకు తీసుకెళ్లాలని నిర్ణయించారు.
తెలంగాణ నుంచి మాంస ఉత్పత్తులు, నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేయడంపైనా లారెల్‌ ఆసక్తి వ్యక్తం చేశారు. విత్తనోత్పత్తి, ఆహార శుద్ధి, వ్యవసాయ అనుబంధ రంగాల్లో తెలంగాణకు ఉన్న సామర్థ్యాన్ని మంత్రి వివరించారు. అంతర్జాతీయ మార్కెట్లలో తెలంగాణ వ్యవసాయ ఉత్పత్తులకు అవకాశాలు కల్పించడం ద్వారా రైతులు, రైస్‌ మిల్లర్లు, విత్తన కంపెనీలు, ఆహార పరిశ్రమలకు ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. భారత్‌-ఫిలిప్పీన్స్‌ వ్యవసాయ సహకారం, ఆహార వాణిజ్య విస్తరణపై కూడా చర్చించారు.
డిసెంబర్‌లో హైదరాబాద్‌లో నిర్వహించనున్న ‘తెలంగాణ రైజింగ్‌ సమ్మిట్‌’కు హాజరు కావాల్సిందిగా లారెల్‌ను ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి ఆహ్వానించారు. వ్యవసాయం, బియ్యం, విత్తనాలు, ఆహార ఉత్పత్తుల రంగాల్లో సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని ఇరువురు నిర్ణయించారు. ‘తెలంగాణ రైతులు, వ్యవసాయ పరిశ్రమలకు స్థిరమైన, లాభదాయకమైన అంతర్జాతీయ మార్కెట్లను సృష్టించడమే మా లక్ష్యం. ఫిలిప్పీన్స్‌కు బియ్యం, విత్తనాలు, ఇతర వ్యవసాయ ఉత్పత్తులను దీర్ఘకాలం పాటు విశ్వసనీయంగా సరఫరా చేయగల ఉత్పత్తి సామర్థ్యం, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక నైపుణ్యం తెలంగాణకు ఉంది’ అన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -