వాతావరణ సంక్షోభాన్ని విస్మరించిన మోడీ సర్కారు కొత్త లేబర్ కోడ్లు
ఎండలు, వరదలు
పెరుగుతున్నా కార్మికుల రక్షణకు స్పష్టమైన హామీ కరువు
అసంఘటిత రంగం, మహిళా కార్మికుల భవిష్యత్తుపై నిపుణుల ఆందోళన : కేంద్రం తీరుపై కార్మిక సంఘాల ఆగ్రహం
దేశం ఏటా మరింత వేడెక్కుతోంది. తీవ్రమైన ఎండలు, వరదలు, తుపాన్లు, కరువులు తరచుగా ప్రజల జీవితాలను అతలాకుతలం చేస్తున్నాయి. వాతావరణ సంక్షోభం ఇప్పటికే కోట్లాది మంది కార్మికుల ఆరోగ్యం, ఉపాధి, ఆదాయాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. కానీ ఈ వాస్తవాన్ని మోడీ ప్రభుత్వం తన కొత్త కార్మిక చట్టాల్లో దాదాపు పూర్తిగా విస్మరించింది. దేశంలో అమల్లోకి వచ్చిన నాలుగు కొత్త లేబర్ కోడ్లలో ఒక్కసారి కూడా వాతావరణ మార్పు అనే అంశాన్ని స్పష్టంగా ప్రస్తావించకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది.
న్యూఢిల్లీ : మోడీ ప్రభుత్వం పాత 29 కేంద్ర కార్మిక చట్టాలను రద్దు చేసి వాటి స్థానంలో నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. వేతనాల కోడ్-2019, పారిశ్రామిక సంబంధాల కోడ్-2020, సామాజిక భద్రతా కోడ్-2020, వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్-2020లను అమల్లోకి తీసుకొచ్చింది. ప్రభుత్వం పాత చట్టాలు సంక్లిష్టంగా మారాయనీ, వ్యాపార సంస్థలపై నిబంధనల భారం పెరిగిందని చెప్తోంది. కొత్త కోడ్లతో వ్యవస్థను సరళీకరించామని ప్రచారం చేస్తున్నది. అయితే ఈ సరళీకరణ అసలు ఎవరి ప్రయోజనం కోసం అన్న ప్రశ్న తలెత్తుతోంది. గత 11 సంవత్సరాలు ప్రపంచ చరిత్రలోనే అత్యంత వేడిగా నమోదయ్యాయి. భారత్‌లో కూడా తీవ్రమైన ఎండలు, వరదలు, తుపాన్లు పెరుగుతున్నాయి. ఇటువంటి పరిస్థితు ల్లో కార్మికుల పని గంటలు, పని ప్రదేశాల్లో ఉష్ణోగ్రతలు, విశ్రాంతి, తాగునీరు, ఆరోగ్య రక్షణ, వేతన భద్రత వంటి అంశాలకు ప్రత్యేక చట్టబద్ధమైన రక్షణ అవసరమని నిపుణులు చెప్తున్నా రు. కానీ కొత్త కార్మిక కోడ్లు వాతావ రణ మార్పును ప్రత్యేక ప్రమాదంగా గుర్తిం చలేదు. దీంతో వేడి కారణంగా పని చేయలేని కార్మికుడికి వేతన నష్టం, ఆరోగ్య సమస్యలు, ఉపాధి కోల్పోవడం వంటి అంశాలపై స్పష్ట మైన రక్షణ లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
మహిళలపై రెట్టింపు భారం
వాతావరణ సంక్షోభం ప్రభావం అందరిపై ఒకేలా ఉండదు. ముఖ్యంగా మహిళా కార్మికులు ఆర్థిక, సామాజిక, ఆరోగ్యపరమైన అనేక అసమానతలను ఒకేసారి ఎదుర్కొంటున్నారు. పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే-2025 ప్రకారం దేశంలో పురుషుల కార్మిక భాగస్వామ్య రేటు 59.1 శాతం ఉండగా, మహిళలది 30.7 శాతం మాత్రమే. మహిళలు ఉద్యోగ రంగానికి దూరంగా ఉండటానికి ప్రధాన కారణాల్లో పిల్లల సంరక్షణ, ఇంటి పనులు ఉన్నాయి. ఉపాధి రంగానికి దూరంగా ఉన్న మహిళల్లో 44.4 శాతం మంది గృహ, సంరక్షణ బాధ్యతల కారణంగానే పని చేయలేకపోతున్నారు. పురుషుల్లో ఇది కేవలం 0.5 శాతం. బయట పనిచేసే మహిళ కూడా ఇంటి బాధ్యతల నుంచి విముక్తి పొందడం లేదు. వేడి ప్రభావం మహిళలపై మరింత తీవ్రంగా ఉంటుందని అధ్యయనాలు చెప్తున్నాయి. 2024లో జరిగిన ఒక అధ్యయనం ప్రకారం.. ఒకే రకమైన వేడి పరిస్థితుల్లో పనిచేసే పురుషులతో పోలిస్తే అసంఘ టిత రంగంలోని మహిళా కార్మికులకు వేడి సంబంధిత అనారోగ్యాల ప్రమాదం మూడు రెట్లు ఎక్కువగా ఉంది. మూత్రపిండాల పనితీరు తగ్గే ప్రమాదం కూడా 2.7 రెట్లు అధికంగా ఉందని వెల్లడైంది. అయితే ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు కొత్త కార్మిక చట్టాల్లో ప్రత్యేక రక్షణలు లేకపోవడమే ప్రధాన సమస్యగా మారింది.
తక్కువ వేతనాలు..
దేశంలోని మహిళా కార్మికులు ఎక్కువగా వ్యవసాయం, గృహ సేవలు, చిన్న పరిశ్రమలు, ఇంటి ఆధారిత ఉత్పత్తి వంటి తక్కువ వేతనాలు, తక్కువ భద్రత ఉన్న రంగాల్లో పనిచేస్తున్నారు. వాతావరణ ప్రభావానికి నేరుగా గురయ్యే రంగాల్లోనే మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉంది. నిటి ఆయోగ్ నివేదిక ప్రకారం మహిళల్లో 79 శాతం మంది వ్యవసాయం, చెల్లింపు గృహ సేవలు, తయారీ, విద్య, ఆరోగ్య రంగాల్లో కేంద్రీకృతమై ఉన్నారు. వీటిలో వ్యవసాయం, గృహ సేవలు తక్కువ ఆదాయాలు, అధిక అస్థిరత కలిగిన రంగాలుగా ఉన్నాయి. పీఎలఎఫఎస్-2025 ప్రకారం రెగ్యులర్ వేతన, జీత ఉద్యోగాల్లో పురుషుల నెలసరి సగటు ఆదాయం రూ.24,217గా ఉండగా, మహిళలకు కేవలం రూ.18,353 మాత్రమే లభిస్తోం ది. అంటే మహిళల ఆదాయం 24 శాతం తక్కువ. రోజువారీ కూలీ విషయంలో పురుషులకు రూ.489 వేతనం లభిస్తుండగా, మహిళలకు రూ. 324 మాత్రమే. అంటే మహిళా కూలీల వేతనం 34 శాతం తక్కువ. ఇప్పటికే తక్కువ వేతనం పొందుతున్న మహిళల కు ఎండలు, అనారోగ్యం, పని నష్టం అదనపు భారంగా మారుతున్నాయి.
ఓఎస్‌హెచ్ కోడ్‌లోనూ మినహాయింపులు
కొత్త వృత్తిపరమైన భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్‌లో కొంతవరకు వేడి, ఉష్ణోగ్రత, వెంటిలేషన్ వంటి అంశాలను ప్రస్తావించారు. కానీ దీనివల్ల ఎక్కువ మంది కార్మికులకు నిజంగా రక్షణ లభిస్తుందా అన్న ప్రశ్న ఉంది. అనేక నిబంధనలు నిర్దిష్ట సంఖ్యలో కార్మికులు ఉన్న సంస్థలకు మాత్రమే వర్తిస్తాయి. విద్యుత్‌తో పనిచేసే ఫ్యాక్టరీలో కనీసం 20 మంది, విద్యుత్ లేకుండా పనిచేసే ఫ్యాక్టరీలో 40 మంది కార్మికులు ఉంటేనే కొన్ని నిబంధనలు వర్తిస్తాయి. గతంలో ఈ పరిమితులు 10, 20గా ఉండేవి. దీంతో చిన్న పరిశ్రమల్లో పనిచేసే లక్షలాది మంది కార్మికులు చట్టబద్ధమైన భద్రతా పరిధి బయటకు వెళ్లే ప్రమాదం ఉందని కార్మిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
90 శాతం కార్మికులకు ఎవరి రక్షణ?
భారత కార్మిక మార్కెట్లో సుమారు 90 శాతం మంది కార్మికులు అసంఘటిత రంగంలో ఉన్నారని నిపుణులు చెప్తున్నారు. వ్యవసాయ కూలీలు, నిర్మాణ కార్మికులు, వీధి వ్యాపారులు, గృహ కార్మికులు, గిగ్ వర్కర్లు, చిన్న యూనిట్ల కార్మికులు, ఇంటి ఆధారిత మహిళా కార్మికులు ఇందులో భాగమే. వీరిలో చాలామందికి ఎండలో పని ఆపితే వేతనం ఉండదు. అనారోగ్యం వస్తే జీతం లేదు. పని గంటలు తగ్గిస్తే ఆదాయం తగ్గుతుంది. వరద, తుపాను, కరువు వస్తే ఉపాధి పోతుంది. ఇటువంటి వారికి కొత్త కార్మిక కోడ్లు స్పష్టమైన ఆదాయ రక్షణ కల్పించడం లేదు.
పేరుకే సామాజిక భద్రత
సామాజిక భద్రతా కోడ్ ద్వారా అసంఘటిత రంగ కార్మికులకు కూడా సంక్షేమ పథకాలు అందిస్తామని ప్రభుత్వం చెప్తోంది. కానీ నిపుణులు దీనిపై అనేక సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఈపీఎఫ్ సాధారణంగా 20 మంది లేదా అంతకంటే ఎక్కువ కార్మికులు ఉన్న సంస్థలకు వర్తిస్తుంది. ఈఎసఐసీ 10 మందికి పైగా ఉద్యోగులు ఉన్న సంస్థలకు వర్తిస్తుంది. అసంఘటిత రంగంలోని కార్మికులకు ఈపీఎఫ్, ఈఎసఐ, గ్రాట్యుటీ, ఉద్యోగ భద్రత వంటి సంస్థాగత రక్షణలు పూర్తిస్థాయిలో లభించవు. ఒక రెగ్యులర్ ఉద్యోగంలో ఉన్న మహిళకు 26 వారాల చెల్లింపు ప్రసూతి సెలవు, ఉద్యోగ రక్షణ వంటి హక్కులు ఉంటాయి. కానీ అసంఘటిత రంగ మహిళకు ఇవి సాధారణంగా అందవు. ఆయుష్మాన్ భారత్, జీవన బీమా, రేషన్ వంటి అనేక ప్రభుత్వ పథకాలు ఉన్నాయని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ.. అర్హత లేకపోవడం, సమాచారం అందకపోవడం, రిజిస్ట్రేషన్ సమస్యలు, డిజిటల్ అడ్డంకుల కారణంగా అనేక మంది కార్మికులు వాటికి దూరంగానే ఉన్నారు. ముఖ్యంగా వాతావరణ విపత్తుల సమయంలో పని కోల్పోయిన అసంఘటిత కార్మికులకు ఆదాయ భద్రత కల్పించే స్పష్టమైన వ్యవస్థ లేదు.
ఉద్యోగ భద్రతపై ఆందోళన
పారిశ్రామిక సంబంధాల కోడ్‌లో ఫిక్స్డ్ టర్మ్ ఉద్యోగాలను అధికారిక ఉద్యోగ విధానంగా గుర్తించారు. నిర్ణీత కాలానికి కార్మికులను నియమించుకునే ఈ విధానం ఉద్యోగ భద్రతను మరింత బలహీన పరుస్తుం దన్న ఆందోళనలు ఉన్నాయి. ముఖ్యంగా మహిళా కార్మికులు చెడు పని పరిస్థితులు, అధిక ఉత్పత్తి లక్ష్యాలు, తీవ్ర వేడి వంటి అంశా లపై ప్రశ్నిస్తే తమ కాంట్రాక్ట్ పొడిగిం చరేమో నన్న భయంతో మౌనంగా ఉండే పరిస్థితి రావచ్చని కార్మిక సంఘాలు చెప్తున్నా యి. సమ్మెకు 14 రోజుల ముందే నోటీ సు ఇవ్వా లనే నిబంధన కూడా కార్మికుల సమిష్టి పోరాట శక్తిని తగ్గిస్తుందన్న విమర్శలు ఉన్నాయి.
కేంద్రం మౌనం
కార్మిక అంశం ఉమ్మడి జాబితాలో ఉన్నందున రాష్ట్రాలు కేంద్ర నిబంధనల కంటే అదనపు రక్షణలు కల్పించవచ్చు. దేశంలోని భిన్నమైన వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా ప్రతి రాష్ట్రం కార్మిక రక్షణ నిబంధనలు రూపొందించాల్సిన అవసరం ఉందని నిపుణులు చెప్తున్నారు. అయితే చాలా రాష్ట్రాల్లో పని ప్రదేశాలకు సాధారణ ఉష్ణోగ్రత ప్రమాణాలు లేవు. కొన్ని ప్రాంతాల్లో ప్రత్యేక పనులకు మాత్రమే ఉష్ణోగ్రత పరిమితులు ఉన్నాయి. కానీ సాధారణ కార్మికుల కోసం స్పష్టమైన ఉష్ణోగ్రత ప్రమాణాలు, వేడిగాలుల సమయంలో పని గంటల మార్పు వంటి నిబంధనలు లేవు. దేశంలోని అనేక నగరాలు, జిల్లాల్లో హీట్ యాక్షన్ ప్లాన్లు అమలవు తున్నాయి. కానీ ఇవి ఎక్కువగా మార్గదర్శకాల స్థాయిలోనే ఉన్నాయి. చట్టబద్ధమైన కార్మిక హక్కులుగా మారకపోవడం గమనార్హం.
కార్మిక చట్టాలు ఎవరి కోసం? :
కార్మిక సంఘాలు
వేడెక్కుతున్న భారత్‌కు వాతావరణ పరిస్థితులకు అనుగుణమైన కార్మిక చట్టాలు అవసరం. ముఖ్యంగా మహిళలు, అసంఘటిత రంగ కార్మికులకు పని గంటల మార్పు, విశ్రాంతి, తాగునీరు, ఆరోగ్య సంరక్షణ, వేతన నష్టం పరిహారం, విపత్తుల సమయంలో ఆదాయ భద్రత వంటి హక్కులను చట్టబద్ధం చేయాల్సిన అవసరం ఉంది. లేకపోతే కార్మిక సంస్కరణల పేరుతో కార్పొరేట్ సంస్థలకు వెసులుబాట్లు కల్పిస్తూ.. ఎండలో చెమటోడ్చే కోట్లాది మంది కార్మికులను మాత్రం రక్షణ లేకుండా వదిలేస్తున్నారనే విమర్శలు మరింత బలపడతాయి. వేడెక్కుతున్న దేశంలో కార్మికుడి ప్రాణం, ఆరోగ్యం, ఉపాధికి భద్రత కల్పించలేని కార్మిక చట్టాలు అసలు ఎవరి కోసం? అన్న ప్రశ్నకు మోడీ ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన సమయం ఆసన్నమైందని కార్మిక సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
కార్పొరేట్ సౌలభ్యం.. మరి కార్మికుడి సంగతేంటి?
మోడీ ప్రభుత్వం కొత్త కార్మిక కోడ్లను సంస్కరణలుగా ప్రచారం చేస్తున్నది. వ్యాపారాలకు అనుకూలమైన వాతావరణం, సులభమైన నిబంధనలు వంటి అంశాలను ప్రధానంగా చెప్తున్నది. కానీ వాతావరణ సంక్షోభం రోజురోజుకూ తీవ్రతరమవుతున్న సమయంలో కార్మికుడి ప్రాణ భద్రత, ఆరోగ్యం, ఆదాయం, ఉద్యోగ భద్రతకు కూడా అదే స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చారా? అన్న ప్రశ్నకు కొత్త కోడ్లలో స్పష్టమైన సమాధానం కనిపించడం లేదు. చిన్న సంస్థలపై నిబంధనల భారం తగ్గించే పేరుతో రక్షణ పరిధిని తగ్గించడం, తనిఖీ వ్యవస్థను పరిమితం చేయడం, అసంఘటిత రంగానికి పథకాల హామీ మాత్రమే ఇవ్వడం, వేడి కారణంగా ఆదాయం కోల్పోయిన కార్మికులకు ప్రత్యేక రక్షణ లేకపోవడం వంటి అంశాలు మోడీ ప్రభుత్వ కార్మిక విధానంపై తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతున్నాయి. కొత్త కార్మిక చట్టాల్లో వాతావరణ సంక్షోభానికి సరైన స్థానం లేకపోవడం మోడీ ప్రభుత్వ ప్రాధాన్యతలను ప్రశ్నించేలా చేస్తున్నది.
ఎండలో పని ఆపితే..
ఇంట్లో ఆకలి!
అసంఘటిత కార్మికులకు ఎదురవుతున్న అతిపెద్ద సమస్య ఇదే. ఆరోగ్యాన్ని కాపాడు కోవాలా? లేక కుటుంబానికి ఆహారం పెట్టడానికి ఎండలో పని చేయాలా? అనేది క్లిష్టంగా మారింది. నిర్మాణ కార్మికులు, వ్యవ సాయ కూలీలు, వీధి వ్యాపారులకు రోజువారీ లేదా వారపు వేతనాలే జీవనా ధారం. ఎండ తీవ్రత కారణంగా పని గంటలు తగ్గిస్తే నేరుగా ఆదాయం తగ్గుతుం ది. 2025లో నిర్వహించిన ఒక సర్వేలో ఏప్రిల్-జూన్ మధ్య తీవ్రమైన వేసవిలో 97 శాతం మహిళా కార్మికులు రూ.1,500 కంటే ఎక్కువ వేతన నష్టాన్ని ఎదుర్కొన్నట్టు వెల్లడైంది.



