రామ జన్మభూమి పేరుతో దోపిడీ
పేద, మధ్యతరగతి కుటుంబాలను పట్టించుకోని ప్రధాని మోడీ
ధరల రూపంలో ప్రజలపై భారాలు..కేంద్రంపై మొదలైన తిరుగుబాటు
బీజేపీని గద్దెదించడమే ఎర్రజెండా లక్ష్యం
10 నుంచి జరిగే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను
జయప్రదం చేయండి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ
నవతెలంగాణ-యాచారం
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను కార్పొరేట్ శక్తులకు కట్టబెడుతూ పేద ప్రజలపై భారాలు మోపుతోందని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ విమర్శించారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా యాచారం మండలకేంద్రంలో సీపీఐ(ఎం) జిల్లా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్క్ షాప్లో ఆయన మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రామ జన్మభూమి పేరుతో కోట్ల రూపాయలను దోచుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మతం పేరుతో రాజకీయాలు చేస్తూ, దేశ ప్రజల అనైక్యతకు పాల్పడుతుందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలను పెంచుతూ, పేదల నడ్డి విరుస్తోందని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోడీ అనుసరిస్తున్న విధానాలపై దేశంలో యువత తిరుగుబాటు మొదలుపెట్టిందని, పిల్లల నుంచి యువత వరకూ మోడీని ప్రశ్నించేతత్వం ప్రారంభమైందన్నారు. ప్రధాని మోడీ, అమిత్ షా ఆటలు ఇక సాగే పరిస్థితే కనబడటం లేదన్నారు. దేశంలో వ్యవసాయ రంగం, విద్యారంగం, సంక్షేమ రంగాలను పట్టించుకోకుండా మోడీ నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. రాబోయే రోజులన్నీ పోరాటాల కాలమేనని, ప్రజా సమస్యలపై పోరాటాలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకిచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ అమలు చేయడం లేదని జాన్వెస్లీ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజల సమస్యలను గాలికి వదిలేశారని తెలిపారు. అసెంబ్లీ సమావేశాల పేరుతో అటు కాంగ్రెస్, ఇటు బీఆర్ఎస్.. వ్యక్తిగత దూషణలు చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాబోయే రోజుల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని స్పష్టం చేశారు. ఈ నెల 10 నుంచి 16వ తేదీ వరకూ నిర్వహించే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలను గ్రామగ్రామాన నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ పోరాటం ద్వారా లక్షలాది ఎకరాల భూమిని ఎర్రజెండా పేదలకు పంచిందని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ప్రభాకర్, నవతెలంగాణ జీఎం వెంకటేష్, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి బోడ సామేల్, జిల్లా కమిటీ సభ్యులు కందుకూరి జగన్, సీపీఐ(ఎం) మండల కార్యదర్శులు ఆలంపల్లి నరసింహ, రావుల జంగయ్య, రాములు, జిల్లా కమిటీ సభ్యులు పి. అంజయ్య, వివిధ మండలాల పార్టీ బాధ్యులు, తదితరులు పాల్గొన్నారు.



