Wednesday, September 9, 2026
E-PAPER
Homeప్రధాన వార్తలుటెన్షన్‌.. టెన్షన్‌

టెన్షన్‌.. టెన్షన్‌

- Advertisement -

ఎర్రవెల్లి టూ బోయిన్‌‌పల్లివరకు రాజకీయ కాక
కేసీఆర్‌ ఫామ్‌‌హౌస్‌ను ముట్టడించిన కాంగ్రెస్‌ నేతలు
అడ్డుకున్న పోలీసులు..
మాజీ సీఎం వ్యవసాయ క్షేత్రం చుట్టూ పహారా
కేసీఆర్‌‌కు రక్షణగా కదిలిన బీఆర్‌ఎస్‌ శ్రేణులు
రెండు పార్టీల పరస్పర నిరసనలతో ఉద్రిక్తత
బీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలను అరెస్టు చేసిన పోలీసులు
పోలీసుల అదుపులో కేటీఆర్‌, హరీశ్‌రావు,
తదితరులు..సాయంత్రానికి విడుదల
కేసీఆర్‌ ‌హత్యకు కుట్రలు : కేటీఆర్‌
పాలక, ప్రతిపక్షాలకు వేర్వేరు నిబంధనలా?: హరీశ్‌రావు

నవతెలంగాణ–మర్కుక్‌/కంటోన్మెంట్‌/జవహర్‌నగర్‌
అసెంబ్లీ సమావేశాల ప్రారంభం నేపథ్యంలో సోమవారం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బ్లాక్ టీషర్ట్స్‌తో మొదలెట్టిన నిరసన.. అటు ఇటు తిరిగి చివరకు మంగళ వారం కేసీఆర్ ఫామ్‌‌హోస్‌ను కాంగ్రెస్‌‌పార్టీ కార్యకర్తలు ముట్టడించే వరకు వెళ్లింది. ఇరుపార్టీల కార్యకర్తల ఆందోళనలతో ఎర్రవెల్లి రణక్షేత్రంగా మారింది. దళితుడైన స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ ‌పట్ల బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ తాతా మధు అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో మర్కుక్ మండలం ఎర్రవెల్లిలోని కేసీఆర్ వ్యవసాయ క్షేత్రాన్ని ముట్టడించారు. కేసీఆర్ తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఎర్రవెల్లికి తరలివచ్చారు. మర్కుక్ మండలం వరదరాజ్‌పూర్ గ్రామం వైపు నుంచి గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ కార్యకర్తలు పెద్దఎత్తున ఫామ్‌హౌస్ వైపు కదిలారు. పార్టీ జెండాలు పట్టుకుని, డప్పుల మోతల మధ్య కార్యకర్తలు నినాదాలు చేస్తూ ముందుకు సాగారు. ‘కేసీఆర్ డౌన్ డౌన్‌’ అంటూ ఎర్రవల్లి పరిసరాలు రాజకీయ నినాదాలతో మార్మోగాయి. కాగా వరదరాజపూర్ చౌరస్తాలో కాంగ్రెస్, బీఆర్‌ఎస్ శ్రేణులు పోటాపోటీగా రేవంత్‌రెడ్డి, కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేయడంతో తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.

భారీగా పోలీసుల మోహరింపు
కాంగ్రెస్ కార్యకర్తలు ఫామ్‌హౌస్ వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు భారీగా మోహరించారు. ఫామ్‌హౌస్ పరిసర ప్రాంతాల్లో ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి కాంగ్రెస్ శ్రేణులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. నిరసనకారులు ముందుకు వెళ్లకుండా పోలీసులు పలు ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించారు.

గజ్వేల్‌లో సైతం ఉద్రిక్తత
కాంగ్రెస్ పార్టీ దళిత నాయకులు, పార్టీ శ్రేణులు గజ్వేల్ నుంచి డప్పులతో ఫామ్‌ హౌస్‌ ‌వైపు పెద్దఎత్తున బయల్దేరారు. దాంతో పోలీసులు వారిని ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. అలాగే కేసీఆర్‌కు రక్షణగా వెళ్తున్న గజ్వేల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ నాయకులను సైతం పోలీసులు అడ్డుకున్నారు. దీంతో గజ్వేల్, ప్రజ్ఞాపూర్, శ్రీగిరిపల్లి, గణేష్‌పల్లి, అల్లిరాజ్ పేట్, సింగరాయపల్లి చౌరస్తా, గౌరారం, పాములపర్తిలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీల నాయకులు, కార్యకర్తలు నిరసనకు దిగారు. దీంతో పోలీసులు ఇరు పార్టీల శ్రేణులను చెదరగొట్టారు.

​ కేటీఆర్‌, హరీశ్‌‌రావు, ఎమ్మెల్యేల అడ్డగింత
ఎర్రవెల్లిలోని కేసీఆర్ ఫామ్‌హౌస్ వద్ద చోటుచేసుకున్న పరిణామాల నేపథ్యంలో కేటీఆర్, హరీశ్‌రావుతో పాటు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మంగళవారం అసెంబ్లీ నుంచి ఎర్రవెల్లికి బయల్దేరడం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. మాజీ సీఎం కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్తున్న వారిని హకీంపేట, బొల్లారం వద్ద పోలీసులు అరెస్టు చేశారు. కేటీఆర్‌, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, మర్రి రాజశేఖర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, పద్మారావుగౌడ్‌, కాలేరు వెంకటేశ్‌, గూడెం మహిపాల్‌రెడ్డి తదితరులను బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. హరీశ్‌రావు, ప్రశాంత్‌రెడ్డి, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, కల్వకుంట్ల సంజయ్‌, మాణిక్‌రెడ్డి, బండారి లక్ష్మారెడ్డి తదితరులను జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అరెస్టు విషయం తెలియడంతో బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పోలీసు స్టేషన్లకు తరలివచ్చారు.
హకీంపేట వద్ద బీఆర్‌ఎస్‌ నేతలు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. మల్కాజ్‌గిరి పోలీస్‌ కమిషనర్‌ బి.సుమతి పర్యవేక్షణలో పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. మాజీ ముఖ్యమంత్రి నివాసం వద్ద భద్రత, శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా అరెస్టు చేసినట్టు పోలీసు అధికారులు తెలిపారు.

​ఇచ్చిన హామీలపై సమాధానం చెప్పాలి : కేటీఆర్‌
ప్రజలకు ఇచ్చిన హామీల అమలుపై ప్రశ్నిస్తే ప్రభుత్వం సమాధానం చెప్పకుండా బీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులపై దాడులు, అరెస్టులకు పాల్పడుతోందని కేటీఆర్‌ ఆరోపించారు. బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో కేటీఆర్‌ మాట్లాడుతూ.. అసెంబ్లీ వద్ద ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి పట్ల పోలీసులు దురుసుగా వ్యవహరించిన తీరును ఖండించారు. నిరుద్యోగులకు రెండు లక్షల ఉద్యోగాలు, మహిళలకు రూ.2,500, ఆడపిల్లలకు స్కూటీలు వంటి హామీలు ఏమయ్యాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారని అన్నారు. హామీల అమలుపై అసెంబ్లీలో ప్రశ్నించాలని కేసీఆర్‌ తమకు సూచించారని తెలిపారు. సోమవారం అసెంబ్లీలోకి వెళ్లకుండా అడ్డుకున్నారని, మంగళవారం కేసీఆర్‌ను కలిసేందుకు ఎర్రవెల్లి వెళ్తుంటే అడ్డుకున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో ప్రజలే ప్రభుత్వానికి తగిన సమాధానం చెబుతారన్నారు.

​పాలక పక్షానికి.. ప్రతిపక్షానికి వేర్వేరు నిబంధనలా? : హరీశ్‌‌రావు
పాలక పక్షానికి, ప్రతిపక్షానికి వేర్వేరు నిబంధనలు ఉన్నాయా అని ‌హరీశ్‌‌రావు ప్రశ్నించారు. జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌లో మీడియాతో మాట్లాడిన ఆయన పోలీసుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్‌ నాయకులను ఎర్రవెల్లి వెళ్లకుండా అడ్డుకుంటూ, కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలను మాత్రం అనుమతిస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీ అధినేత కేసీఆర్‌ను కలిసే హక్కు తమకు ఉందని, ఎర్రవెల్లి వెళ్లకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో పోలీసులు స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. బీఆర్‌ఎస్‌ నేతల అరెస్టులతో ఆయా పోలీస్‌స్టేషన్ల వద్ద పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో చేరి నాయకులను వెంటనే విడుదల చేయాలని నినాదాలు చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -