ఆయన కూతురు, అల్లుడుపైనా..
కేరళం పోలీసులను కోరిన ఈడీ
ప్రభుత్వానికి 25పేజీల నివేదిక
సమావేశమైన సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గం
తిరువనంతపురం : సీఎంఆర్ఎల్-ఎగ్జాలాజిక్ ముడుపుల కేసులో ప్రతిపక్ష నేత, సీపీఐ(ఎం) నేత పినరయి విజయన్, ఆయన కుమార్తె టి.వీణా, మాజీ మంత్రి, వీణా భర్త పి.ఎ.మహ్మద్ రియాజ్‌లపై విడిగా అవినీతి కేసు నమోదు చేయాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేరళం పోలీసులను కోరింది. కాగా రాష్ట్ర పోలీసులకు ఈడీ పంపిన సవివరణాత్మకమైన సమాచారాన్ని కేరళం ప్రభుత్వం పరిశీలిస్తోంది. మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఎ)లోని సెక్షన్ 66(2) కింద ఈడీ 25 పేజీల నివేదికను రాష్ట్ర పోలీసు చీఫ్ (ఎస్పీసీ) ఎ.చంద్రశేఖర్‌కు పంపింది. మనీ లాండరింగ్ ఆరోపణలపై తమ దర్యాప్తులో లభ్యమైన సాక్ష్యాధారాలను, ఇతర నిర్ధారణలను ఆ నివేదికతో జతపరిచింది. ఈడీ నుంచి లేఖ అందిందని, అందులోని సమాచారాన్ని పరిశీలించి, చట్టపరంగా తీసుకోవాల్సిన కార్యాచరణపై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని హోం మంత్రి రమేష్ చెన్నితాల మీడియాకు తెలిపారు. ఈడీ పంపిన సమాచారం ఆధారంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయడమా, విజిలెన్స్, అవినీతి నిరోధక బ్యూరోకు నివేదించడమా లేదా మరే ఇతర చట్టపరమైన కార్యాచరణ తీసుకోవడమా అనేది ఎస్పీసీ పరిశీలిస్తున్నారని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ అంశంపై ఎస్పీసీ చట్టపరమైన అభిప్రాయాన్ని కూడా కోరవచ్చునని ఆ వర్గాలు పేర్కొన్నాయి.
సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశం
ఇదిలావుండగా, రెండు రోజుల రాష్ట్ర కమిటీ సమావేశాలనంతరం తిరువనంతపురంలోని ఏకేజీ సెంటర్లో పార్టీ రాష్ట్ర కార్యదర్శివర్గ సమావేశాన్ని సీపీఐ(ఎం) ఏర్పాటు చేసింది. పార్టీ భవిష్యత్ కార్యాచరణను రూపొందించేందుకై ఈ నెల 13న కొజికోడ్‌లో విస్తృత రాష్ట్ర కమిటీ సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశాలు జరుగుతున్నాయి. ఇడి తాజా చర్య పట్ల పార్టీ వైఖరి ఎలా వుండాలనేదానిపై ఈ సమావేశంలో చర్చించనున్నట్టు తెలుస్తోంది.



