నూతన విద్యుత్ చట్టానికి వ్యతిరేకంగా గ్రామగ్రామాన నిరసనలు
విద్యుత్ ఉద్యమ అమరవీరుడు సత్తెనపల్లి రామకృష్ణ 26వ వర్ధంతి
సెమినార్‌లో వక్తలు
నవతెలంగాణ – ముషీరాబాద్
విద్యుత్ రంగం ప్రయివేటుపరం కాకుండా కాపాడుకునేందుకు ప్రజలు ఐక్యంగా పోరాడాలని, కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న నూతన విద్యుత్ చట్టానికి వ్యతిరేకంగా గ్రామగ్రామాన నిరసనలు చేపట్టాలని వక్తలు పిలుపునిచ్చారు. విద్యుత్ ఉద్యమ అమరుడు సత్తెనపల్లి రామకృష్ణ 26వ వర్ధంతి సందర్భంగా తెలంగాణ రజక వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో మంగళవారం హైదరాబాద్ ముషీరాబాద్ జమిస్తాన్ పూర్‌లోని వృత్తిదారుల సంఘం రాష్ట్ర కార్యాలయంలో సెమినార్ నిర్వహించారు. రాష్ట్ర నాయకుడు చెన్నారం మల్లేష్ అధ్యక్షతన జరిగిన సెమినార్‌లో సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్.సుధాభాస్కర్ ప్రసంగించారు. 26 ఏండ్లు గడిచినా విద్యుత్ ఉద్యమ పోరాట ఘట్టాలను ప్రజలు మర్చిపోలేదన్నారు. ఆ పోరాట ఫలితంగానే విద్యుత్ ధరలు పెంచేందుకు పాలకులు వెనుకడుగు వేస్తున్నారని తెలిపారు. విద్యుత్ సంస్థలను ప్రయివేటు పరం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నా లను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. స్మార్ట్ మీటర్ల పేరుతో రైతులు, పేదలను ఇబ్బందులకు గురిచేసే విధా నాలను వ్యతిరేకించాలన్నారు. రాష్ట్రంలో డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్ ఉత్పత్తి జరగక ఇతర రాష్ట్రాల నుంచి విద్యుత్ కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. చేతివృత్తిదారుల సమన్వయ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ఎం.వి. రమణ మాట్లాడుతూ.. వృత్తిదారుల దీక్షా దినంగా రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహించి విద్యుత్ ఉద్యమ అమరులకు నివాళులు అర్పించ నున్నట్టు తెలిపారు. చేతివృత్తిదారుల ఆధునిక పని పద్ధతులు విద్యుత్‌పైనే ఆధారపడి ఉన్నాయని, విద్యుత్ రాయితీలు ఉద్యమాల ఫలితంగానే లభించాయని అన్నారు.
ఉచిత విద్యుత్ సౌకర్యాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఫైళ్ల ఆశయ్య మాట్లాడుతూ.. రజక, క్షౌర వృత్తిదారులకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తున్నప్పటికీ పాత బకాయిల బిల్లులు చెల్లించకుండా జాప్యం చేస్తోందని విమర్శిం చారు. ఉచిత విద్యుత్ పాత బకాయిలను వెంటనే చెల్లించాలని, కొత్త కనెక్షన్లకు మరో అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ఉచిత విద్యుత్ పరిమితిని 250 యూనిట్ల నుంచి 1,000 యూనిట్ల వరకు పెంచి డ్రైక్లీనింగ్ కేంద్రాలు, ధోబీఘాట్లు, వాషింగ్ ప్లాంట్లు, సెలూన్ షాపులు, ఇతర వృత్తిదారులకు వర్తింపజేయాలని కోరారు.
ఈ సెమినార్‌లో ఏడీఈ తుర్కయంజాల్ శ్రీనివాస్, సీఐటీయూ సీనియర్ నాయకులు రాజారావు, గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉడుత రవీందర్, క్షౌరవృత్తిదారుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చెన్నారం మల్లేష్, రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు కేశరాజు యాదగిరి, గ్రేటర్ హైదరాబాద్ సెంట్రల్ సిటీ నాయకులు లంక సోమయ్య, గోపి, రాజేష్ పాల్గొన్నారు.
విద్యుత్ రంగాన్ని రక్షించుకోవాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



