నవతెలంగాణ – హైదరాబాద్ : భద్రాచలం వద్ద గోదావరి నది మహోగ్ర రూపం దాల్చింది. ఎగువ ప్రాంతాల నుంచి భారీగా వరద నీరు పోటెత్తడంతో నీటిమట్టం వేగంగా పెరుగుతోంది. శనివారం ఉదయానికి భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 55.1 అడుగులకు చేరడంతో అధికారులు మూడో, చివరి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. గురువారం కేవలం 30 అడుగుల వద్ద ఉన్న నీటిమట్టం, కాళేశ్వరం నుంచి వస్తున్న వరద ప్రవాహంతో శుక్రవారం అర్ధరాత్రికి 53 అడుగులకు, శనివారం ఉదయానికి 55.1 అడుగుల ప్రమాదకర స్థాయికి చేరింది. పరిస్థితిని సమీక్షించిన జిల్లా కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజ్.. లోతట్టు ప్రాంతాల ప్రజలను తక్షణమే సురక్షిత ప్రాంతాలకు, పునరావాస కేంద్రాలకు తరలించాలని ఆదేశాలు జారీ చేశారు. వాగులు, వంకలు దాటే ప్రయత్నం చేయవద్దని ప్రజలకు సూచించారు.
వరద ఉద్ధృతి కారణంగా పర్ణశాల వద్ద స్నానఘట్టాలు పూర్తిగా జలమయమయ్యాయి. సీతవాగు ఉద్ధృతికి సీతమ్మ నార చీరలు, దేవతామూర్తి పీఠంతో పాటు ఇనుప వంతెన కూడా మునిగిపోయాయి. దుమ్ముగూడెం-భద్రాచలం మధ్య శుక్రవారం సాయంత్రం నుంచే రాకపోకలు నిలిచిపోయాయి. తురుబాక ఆర్ అండ్ బీ రహదారిపై నిర్మించిన వంతెన అప్రోచ్ రోడ్లు కోతకు గురై ప్రమాదకరంగా మారాయి.



