– 2022లో అన్ని రాష్ట్రాల పత్రికలకు రూ.244.13 కోట్లు
– ఎన్నికల లబ్ది కోసం బీఆర్‌ఎస్ ప్రజాధనాన్ని వాడుకోవడం తప్పు
– దీనిపై సమగ్ర విచారణ చేయించండి
– గవర్నర్‌కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
దక్షిణ తెలంగాణను సస్యశ్యామలంగా మార్చే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పలు కారణాలతో నేటికీ పెండింగ్‌లో ఉందనీ, అలాంటి దానిపై గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎన్నికల లబ్ది కోసం రూ.22.13 కోట్ల ప్రజాధనాన్ని యాడ్ల రూపంలో పత్రికలకు ఇవ్వడాన్ని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ అధ్యక్షులు ఎం.పద్మనాభరెడ్డి తప్పుబట్టారు. దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని గవర్నర్ జిష్ణుదేవ్ వర్మకు ఆయన శుక్రవారం లేఖ రాశారు. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు నార్లపూర్‌లో ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున పత్రికల్లో బీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చిందని తెలిపారు. 13 తెలుగు, 7 ఇంగ్లీషు, 3 హిందీ, 6 ఉర్దూ, 2 మరాఠి పత్రికలతో పాటు 296 చిన్న పత్రికలు, 322 మ్యాగజైన్లకు రూ.22.13 కోట్లను కేసీఆర్ ప్రభుత్వం యాడ్ల రూపంలో ఇచ్చిందని తెలిపారు. ఇది ఎన్నికల్లో లబ్ది పొందడానికి ఇచ్చినట్టుగా ఉందని విమర్శించారు. 2022లో బీఆర్‌ఎస్‌ను కేసీఆర్ జాతీయ పార్టీగా ప్రకటించారనీ, ఆయా రాష్ట్రాల్లో గుర్తింపు కోసం తెలంగాణలో జరుగుతున్న సంక్షేమ పథకాల పేరుతో దేశంలోని అన్ని పత్రికలకు అప్పటి ప్రభుత్వం యాడ్లు ఇచ్చిందని గుర్తుచేశారు. ఒక్క 2022 సంవత్సరంలోనే 244.17 కోట్ల ప్రజాధనాన్ని కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు చేసిందని వివరించారు. తెలుగే కాకుండా ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ, మలయాళం, తమిళం, మరాఠి, ఒరియా, గుజరాతి, బెంగాలి, పంజాబీ ఒక్కటేమిటి దేశంలోని అన్ని చిన్న , చితకా పత్రికలలో కూడ ప్రకటనల్విడం సమర్థనీయం కాదని పేర్కొన్నారు. దీనిపై విచారణ జరిపి ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.
‘పాలమూరు-రంగారెడ్డి’కి రూ. 22.13 కోట్ల యాడ్స్ ఏంటి?
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES