Saturday, July 12, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంఆస్పత్రుల్లో కల్తీ కల్లు బాధితులు

ఆస్పత్రుల్లో కల్తీ కల్లు బాధితులు

- Advertisement -

– నిమ్స్‌లో 34.. గాంధీలో 19 మందికి చికిత్స
– 11 మందికి డయాలసిస్‌.. మరో ఇద్దరు వెయిటింగ్‌
– కోలుకున్న 11 మంది.. అబ్జర్వేషన్‌లో 12 మంది
– కల్తీ కల్లు ఘటనపై కొనసాగుతున్న ‘ఎక్సైజ్‌’ విచారణ
నవతెలంగాణ-సిటీబ్యూరో

హైదరాబాద్‌లోని కూకట్‌పల్లి కల్తీ కల్లు ఘటన బాధితులకు ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతోంది. పంజాగుట్ట నిమ్స్‌ ఆస్పత్రిలో 34 మంది, సికింద్రాబాద్‌ గాంధీలో 19 మంది చికిత్స పొందుతున్నారు. నిమ్స్‌లో చేరిన వారిలో 11 మందికి డయాలసిస్‌ అందిస్తుండగా.. మరో ఇద్దరికి డయాలసిస్‌ అవసరం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. 11 మంది పూర్తిగా కోలుకున్నారు. 12 మంది వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. నిపుణులైన మల్టీస్పెషాల్టీ వైద్య బృందం నిశితంగా పర్యవేక్షిస్తోంది.
బాలానగర్‌ ఎస్సైజ్‌ ఎస్‌హెచ్‌ఓపై సస్పెన్షన్‌
కూకట్‌పల్లి కల్తీ కల్లు వ్యవహారంపై ఎక్సైజ్‌ శాఖ చర్యలు చేపట్టింది. బాలానగర్‌ ఎక్సైజ్‌ ఎస్‌హెచ్‌ఓ వేణుకుమార్‌పై సస్పెన్షన్‌ వేటు పడింది. డీటీఎఫ్‌ నర్సిరెడ్డి, ఏఈఎస్‌ మాధవయ్య, ఎస్‌ఈ ఫయాజ్‌, ఏఈఎస్‌ జీవణ్‌కిరణ్‌ పాత్రపై దర్యాప్తు కొనసాగుతోంది. కాగా, కూకట్‌పల్లిలోని పలు కల్లు దుకాణాల నుంచి అధికారులు నమూనాలు సేకరించారు. వాటిని ల్యాబ్‌లో పరీక్షించగా.. కాంపౌండ్‌లో సేకరించిన కల్లులో కెమికల్స్‌ ఉన్నట్టు గుర్తించారు. రసాయనాలు కలిపిన కల్లు తాగడం వల్లే కూకట్‌పల్లి ప్రాంతంలోని పలువురు అస్వస్థతకు గురైనట్టు ఎక్సైజ్‌ అధికారులు గుర్తించారు.
బాధితుల ఆరోగ్య పరిస్థితిపై మంత్రి ఆరా
నిమ్స్‌, గాంధీ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న బాధితుల ఆరోగ్య పరిస్థితిపై మంత్రి దామోదర రాజనర్సింహ ఆరా తీశారు. నిమ్స్‌, గాంధీ డాక్టర్లు, ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో ఫోన్‌లో మాట్లాడారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లు మంత్రికి వివరించారు. ప్రస్తుతం నిమ్స్‌లో 34 మంది, గాంధీలో 19 మంది చికిత్స పొందుతున్నారని అధికారులు మంత్రికి తెలిపారు. నిమ్స్‌లో ఉన్న 35 మందిలో ఐదుగురిని శుక్రవారం డిశ్చార్జ్‌ చేస్తున్నామని డైరెక్టర్‌ బీరప్ప వెల్లడించారు. మిగిలిన 30 మందికి చికిత్స కొనసాగిస్తు న్నామని వివరించారు. గాంధీలో ఉన్న 18 మందిలో నలుగురు డయాలసిస్‌పై ఉన్నారని డాక్టర్లు తెలిపారు. మిగిలిన 14 మంది పేషెంట్ల పరిస్థితి నిలకడగా ఉందని వివరించారు. వారందరికీ మెరుగైన వైద్యం అందించాలని అధికారులకు, డాక్టర్లకు మంత్రి సూచించారు. పూర్తిగా కోలుకునే వరకూ ఆస్పత్రుల్లోనే ఉంచాలని, ఆ తర్వాతే డిశ్చార్జ్‌ చేయాలని ఆదేశించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -