– మంత్రులు కోమటిరెడ్డి, దామోదర, జూపల్లి
– మాడ్గుల మండలంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
– 220మందికి కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు పంపిణీ
నవతెలంగాణ-మాడ్గుల
తెలంగాణను అన్ని రంగాల్లో ఆదర్శంగా తీర్చిదిద్దుతామని మంత్రులు దామోదర్ రాజనర్సింహ, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలంలో కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి ఆధ్వర్యంలో మంత్రులు పాల్గొని పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో రూ.12.70 కోట్లతో నిర్మించబోయే 30 పడకల ఆస్పత్రి భవనానికి, కోనాపూర్ నుంచి మాడ్గుల వరకు, మాడ్గుల నుంచి దేవరకొండ రోడ్డు వరకు రూ.70 కోట్ల వ్యయంతో నిర్మించే బీటీ (డబుల్ లైన్) రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రులకు పూర్ణకుంభంతో పలువురు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలోని అంబేద్కర్, జ్యోతిరావు పూలే, చాకలి ఐలమ్మ, మాజీ కేంద్రమంత్రి జైపాల్‌రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ.. రంగారెడ్డి జిల్లా అభివృద్ధిలో భాగంగా మాడ్గుల వద్ద కోనాపూర్ నుంచి దేవరకొండ వరకు డబుల్ లైన్ రోడ్ పనులకు, మాడ్గుల మండల కేంద్రంలో 30 పడకల ఆస్పత్రి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్టు తెలిపారు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తూ రాష్ట్రాన్ని అన్ని విధాల అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తున్నట్టు చెప్పారు. ఇండ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేస్తున్నట్టు తెలిపారు. బీసీ కులగణన చేపట్టి 42 శాతం రిజర్వేషన్లను అమలుచేసేందుకు ప్రయత్నిన్నామన్నారు. అనంత రం మాడ్గుల మండలంలోని 220 మంది లబ్దిదా రులకు కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ చెక్కులు మంత్రులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పొల్యూషన్ బోర్డు చైర్మెన్ బాలాజీ సింగ్, జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వేంకటేశ్వర రావు, ఇబ్రహీంపట్నం ఆర్డీఓ అనంత్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ అధికారులు, సంబంధిత అధికారులు, మాజీ ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.