– ప్రమాదంలో న్యాయవ్యవస్థ
– డిసెంబర్ 25న ఖమ్మంలో శతాబ్ది ఉత్సవాలు : సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగంపై దాడి చేస్తున్నదని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి రాజా విమర్శించారు. రాజ్యాంగ వ్యవస్థలను, స్వతంత్ర ప్రతిపత్తిని నిర్వీర్యం చేస్తున్నదని అన్నారు. స్వతంత్రం గా పనిచేయాల్సిన న్యాయవ్యవస్థ కూడా ప్రమాదంలో పడిందన్నారు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజా, కార్మిక, రైతు వ్యతిరేక విధానాల పట్ల ప్రజల్లో చైతన్యాన్ని పెంపొందించాలనీ, పోరాటాలను నిర్మించాలని చెప్పారు. డిసెంబర్ 25న ఖమ్మంలో సీపీఐ శతాబ్ధి ఉత్సవాలను జయప్రదం చేయాలని ఆయన కోరారు. శుక్రవారం హైదరాబాద్‌లోని హిమాయత్‌నగర్ మఖ్ధూంభవన్‌లో సీపీఐ రాష్ట్ర సమితి సమావేశాన్ని నిర్వహించారు. ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దండి సురేష్ అధ్యక్షత వహించారు. ఇటీవల మరణించిన వారికి సంతాప సూచకంగా మౌనం పాటించారు. ఈ సందర్భంగా రాజా మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం భారత్‌ను కార్పొరేట్ నియంత్రణ, ఫాసిస్టు రాజ్యంవైపు నెడుతోందన్నారు.
లౌకిక, ప్రజాస్వామిక, సంక్షేమ దేశంలో రాజ్యాంగం, న్యాయం, స్వేచ్ఛ, సమానత్వాన్ని దెబ్బతిస్తోందని విమర్శించారు. పాకిస్తాన్, భారత్ యుద్ధం విషయంలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ప్రధాని మోడీ మౌనంగా ఎందుకున్నారని ప్రశ్నించారు. భారత్‌పై ట్రంప్ సుంకాలను పెంచడం వల్ల భారత ఆర్థిక రంగంపై ప్రభావం పడుతుందన్నారు. స్వతంత్రంగా వ్యవహరించాల్సిన ఎన్నికల కమిషన్ (ఈసీ) కూడా బీహార్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ పేరుతో ఓటర్లను తొలగించేందుకు ప్రయత్నిస్తోందన్నారు. ఆధార్, రేషన్‌కార్డును పరిగణనలోకి తీసుకోవాలంటూ సుప్రీంకోర్టు చెప్పిందని గుర్తు చేశారు. పంచాయతీ నుంచి పార్లమెంటు స్థాయి వరకు పార్టీని మరింత బలోపేతం చేయాల్సిన అవసరముందన్నారు. మోడీ ప్రభుత్వ నినాదం ‘కాంగ్రెస్ ముక్త్ భారత్’ ‘మావోయిస్ట్ ముక్త్ భారత్’, ఆ తర్వాత ‘కమ్యూనిస్టు ముక్త్ భారత్’ను చేపడుతుందని చెప్పారు. వామపక్షాలు, కమ్యూనిస్టుల ఐక్యతకు సీపీఐ కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జాతీయ కార్యదర్శులు అజీజ్‌పాషా, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు ప్రసంగించారు. సీపీఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ, జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్ రెడ్డి, పశ్యపద్మ తదితరులు హాజరయ్యారు.