– రాయల్టీ, డీఎంఎఫ్, పర్మిట్ ఫీజుల భారం
– అంతర్జాతీయ మార్కెట్ మందగమనం
– దేశీయంగా నిర్మాణ రంగం క్షీణత
– మార్కెట్టు లేని పరిస్థితుల్లో ప్రభుత్వ ముడుపుల భారం
– గతంలోనే ఆదివారాల్లో ‘ప్రొడక్షన్ హాలిడే’లు ప్రకటించిన ఫ్యాక్టరీలు
– జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలి : సీఐటీయూ డిమాండ్
నవతెలంగాణ – కరీంనగర్ ప్రాంతీయ ప్రతినిధి
రాష్ట్రంలో గ్రానైట్ పరిశ్రమ ఒక శక్తివంతమైన పరిశ్రమగా, వేలాది కార్మికులకు జీవనాధారంగా నిలుస్తోంది. అయితే, మూడేండ్లుగా అంతర్జాతీయ మార్కెట్ మందగమనం, దేశీయంగా నిర్మాణరంగం, మార్కెట్ క్షీణత, ఖనిజ రాయల్టీల పెంపు, ఉత్పత్తికి మించిన వ్యయం, ప్రభుత్వ ముడుపుల భారంతో ఈ రంగం తీవ్ర సంక్షోభంలోకి జారుకుంది. జులై 8, 2025న వచ్చిన జీవో నెం.14 ద్వారా సీనరేజస్ చార్జీలను మరో 20 శాతం పెంచడంతో ఈ పరిశ్రమలో గడ్డు పరిస్థితులు ఎదురవ్వనున్నాయి. ఒకప్పుడు వైభవంగా సాగిన కరీంనగర్ గ్రానైట్ పరిశ్రమ వ్యాపారం ఇప్పుడు జీవించేందుకు పోరాటం చేస్తోంది. ఇప్పటికే ఆదివారాల్లో ప్రొడక్షన్ హాలిడేలు, క్లోజ్ అవుతున్న ఫ్యాక్టరీలను చూస్తుంటే ఇదంతా పరిశ్రమ కుదేలవుతున్నదనే దానికి సంకేతంగా కనిపిస్తోంది. గ్రానైట్‌పై మరోసారి పెనుభారం మోపిన ప్రభుత్వం నిర్ణయాన్ని ఉపసంహరించాలంటూ యాజమాన్యాల పోరాటానికి కార్మిక సంఘాలు కూడా మద్దతుగా నిలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.కరీంనగర్ జిల్లాలోని బావుపేట, కాజీపూర్, కమాన్‌పూర్. ఓద్యారం, అచంపల్లి గ్రామాల్లో సుమారు 350కిపైగా కటింగ్ అండ్ పాలిషింగ్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇన్నాళ్లుగా పోటాపోటీగా ప్రొడక్షన్ తీసి విక్రయించే వారు. గ్రానైట్‌లో పరిశ్రమ వృద్ధిని పరిగణలోకి తీసుకొని దశాబ్ధ కాలంలో దాదాపు రెండు వందల వరకు కొత్తగా కంపెనీలు వచ్చాయి. అయినా మొత్తం కంపెనీలు తీసిన ప్రొడక్షన్ సేల్స్ చేసుకుంటూ వచ్చారు. ప్రతి ఏడాది ఒకటి రెండు సార్లు స్లాగ్ సీజన్ వచ్చినా.. ఆ తదుపరి మళ్లీ మార్కెట్ పుంజుకోవడం.. తిరిగి ప్రొడక్షన్‌ను విక్రయించుకొని ఫ్యాక్టరీలను నడిపేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితులు కనిపించడం లేదు. ఒకవైపు కంపెనీలు పెరగడం, బయట నిర్మాణ రంగం కుదేలు కావడం, కటింగ్ గ్రానైట్ సేల్స్ దారుణంగా పడిపోయాయి. కొన్ని ఫ్యాక్టరీల్లో మూడు నాలుగు నెలులుగా ఒక్క ఫీట్ గ్రానైట్ కూడా అమ్మలేదని పలువురు యజమానులు అవేదన వ్యక్తం చేస్తున్నారు.
పన్ను పెంపులతో ఆర్థిక భారాలు
తెలంగాణ రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ జులై 8న విడుదల చేసిన జీవో నెంబరు 14 ప్రకారం… బ్లాక్ గ్రానైట్, కలర్ గ్రానైట్ మైనింగ్‌పై సీనరేజస్ చార్జీలను 20 శాతం పెంచింది. దీని ప్రకారం కలర్ గ్రానైట్ గ్యాంగ్సా రేటు రూ.1128/ రూ.2990 నుంచి రూ.1354/రూ.3588కి పెరిగింది. బ్లాక్ గ్రానైట్ గ్యాంగ్సా రేటు రూ.1361/3900 నుంచి రూ.1633/4680కి పెరిగింది. ఈ పెంపు వల్ల ఒక్క మీటర్ క్యూబ్ గ్రానైట్‌పై రూ.1435 అదనపు భారం పడుతుంది. ఇదే కాకుండా, 2022లోనే ప్రభుత్వం విడుదల చేసిన జీవో నెం.18, 21 ద్వారా 30 శాతం రాయల్టీ పెంచిన నేపథ్యంలో, అప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తంగా 88 శాతం భారంగా మారడంతో పరిశ్రమను కుదిపే స్తోంది. మొత్తంగా రాయల్టీపై అదనంగా 40 శాతం వసూలు చేస్తున్న పర్మిట్ ఫీజు పరిశ్రమపై అధిక భారం మోపుతోంది. ఇది పొరుగు రాష్ట్రాల్లో అమల్లో లేకపోవడంతో తెలంగాణ పరిశ్రమ పోటీ పడలేకపోతోంది. మరోవైపు ప్రస్తుతం అమలులో ఉన్న 20 శాతం డీఎంఎఫ్ చార్జీలను ఆంధ్రప్రదేశ్, ఒడిశా, కర్నాటకలో 10 శాతానికి పరిమితం చేయడమూ ఇక్కడి పరిశ్రమకు మార్కెట్ భారంగా మారింది.
వందల కుటుంబాల భవిష్యత్ ప్రశ్నార్థకం!
కరీంనగర్ జిల్లాలో గ్రానైట్ పరిశ్రమ మీద ఆధారపడి వలస కార్మికులు, కూలీలు, ట్రాన్స్‌పోర్టర్లు, మెషినరీ టెక్నీషియన్లు, ముడి సరుకుల సరఫరాదారులు ఇలా వేలాది మంది జీవిస్తున్నారు. అయితే తాజా పెంపులు ఈ పరిశ్రమలో ఉపాధిని తీవ్రంగా ప్రభావితం చేస్తాయని యజమానులు వాపోతున్నారు. ఇప్పటికే రాయల్టీ, ట్రాన్స్‌పోర్ట్, జీఎస్టీ, పర్మిట్ ఫీజు కలిపి అమ్మకం ధరలో 65 శాతం వరకు వ్యయం అవుతోంది. చాలా యూనిట్లు మూతపడే అంచుల మీదున్నాయని వారు చెబుతున్నారు. పరిశ్రమలో భారం పెరగడం వల్ల యజమానులు పరిశ్రమలు మూసివేయడానికి, కార్మికులను తొలగించడానికి సిద్ధమవుతుండటంతో.. ఒక దశలో ఈ రంగం పూర్తిగా కుదేలయ్యే ప్రమాదం ఉందని పరిశ్రమ వర్గాలు హెచ్చరిస్తున్నాయి. అందుకే ప్రస్తుతం తీసుకొచ్చిన జీవో నెంబరు 14ను తక్షణం ఉపసంహరించాలని, జీవో నెంబరు 4 (2023) ద్వారా ఇచ్చిన రెండు సంవత్సరాల ఉపశమన గడువును మరింత పొడిగించాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. పర్మిట్ ఫీజును పూర్తిగా రద్దు చేసి రాయల్టీ / సీనరేజస్ చార్జీలు 40శాతం వరకు తగ్గించాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. ఆంధ్రా, ఒడిశా, కర్నాటకలో అమల్లో ఉన్నట్టుగానే డీఎంఎఫ్ చార్జీలు 30శాతం నుంచి 10శాతానికి తేల్చాలని డిమాండ్ చేస్తున్నాయి.
గ్రానైట్ పరిశ్రమను కాపాడండంటూ భారీ ర్యాలీ
రాష్ట్రంలో గ్రానైట్ పరిశ్రమ మళ్లీ సంక్షోభానికి గురవుతున్న నేపథ్యంలో కరీంనగర్ జిల్లా గ్రానైట్, ప్యాక్టరీ, క్వారీ ఓనర్ల సంఘం ప్రభుత్వానికి వినతిపత్రం అందజేసింది. శుక్రవారం నగరంలో కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ తీసి అక్కడ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో జిల్లాలో గ్రానైట్ పరిశ్రమ, క్వారీ ఓనర్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు జీ.సుధాకర్, అధ్యక్షులు ప్రణీత్‌రావు, తిరుపతిగౌడ్, వంశీకృష్ణ, కృష్ణ కాల్వ, అభిషేక్, జిత్యావ్యాస్ ,సురేష్‌రెడ్డి, మల్లారెడ్డి, సురేశ్, గ్రానైట్ క్వారీల ఓనర్లు, వేలాది మంది కార్మికులు పాల్గొన్నారు.
గ్రానైట్ క్వారీ యజమానుల ఆందోళనకు
సీఐటీయూ మద్దతు
ప్రభుత్వం పెంచిన సీనరేజస్ చార్జీలు ఉపసంహరించుకోవాలని గ్రానైట్ క్వారీ యజమానులు చేస్తున్న ఆందోళనకు సీఐటీయూ కరీంనగర్ జిల్లా కమిటీ మద్దతు తెలిపింది. జీవో నెంబర్ 14ను రద్దు చేయాలని సీఐటీయూ కరీంనగర్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గీట్ల ముకుంద రెడ్డి, ఎడ్ల రమేష్, కోశాధికారి జి.రాజేశం డిమాండ్ చేశారు. గ్రానైట్ క్వారీ యజమానులపైనా, అందులో పనిచేస్తున్న కార్మికుల ఉపాధిపై, అనుబంధంగా పనిచేస్తున్న గ్రానైట్ ఫ్యాక్టరీస్ కటింగ్, పాలిషింగ్ పరిశ్రమలపైనా, వలస కార్మికులపై తీవ్ర ప్రభావం చూపుతూ రాష్ట్ర ఖజానా నింపుకోవడమే లక్ష్యంగా పన్నులు పెంచడం సరికాదని తెలిపారు.
గ్రానైట్ ఇండిస్టీకి గడ్డు కాలం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES