Saturday, July 12, 2025
E-PAPER
HomeNewsభౌతిక దాడులు చేస్తే ఊరుకోం

భౌతిక దాడులు చేస్తే ఊరుకోం

- Advertisement -

– సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య
– బసవతారకనగర్‌ గుడిసెవాసుల ధర్నా శిబిరాన్ని సందర్శన
నవతెలంగాణ-మియాపూర్‌

భౌతిక దాడులు చేస్తే ఊరుకునేది లేదని సీపీఐ(ఎం) రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పగడాల యాదయ్య అన్నారు. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గచ్చిబౌలి డివిజన్‌ బసవతారకనగర్‌ గుడిసెవాసుల ధర్నా శిబిరాన్ని సీపీఐ(ఎం) నాయకులు శుక్రవారం సందర్శించి వారికి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శేరిలింగంపల్లిలోని గోపనపల్లి రెవెన్యూ పరిధిలోగల సర్వే నెంబర్‌ 36లో 460 ఎకరాలు, 37లో 424 ఎకరాలు కలిపి మొత్తం 884 ఎకరాల పోరంబోకు భూమి ఉందని, ఈ భూమిలోని ఐదారెకరాల్లో 40ఏండ్ల నుంచి పేదలు గుడిసెలు వేసుకొని జీవిస్తున్నారని అన్నారు. వీరిని దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న వారిగా గుర్తించి ఆ గుడిసెలకు ఇంటి నెంబర్లు, విద్యుత్‌ కనెక్షన్లు, వాటర్‌ కనెక్షన్లను జీహెచ్‌ఎంసీ వాళ్లే పర్మిషన్లు ఇచ్చారని తెలిపారు. అలాగే, రేషన్‌కార్డులు, ఓటర్‌ లిస్టులు, ఆధార్‌కార్డులను కూడా ప్రభుత్వం ఇచ్చిందన్నారు. అయితే ఆ భూమిపై పెట్టుబడుదారులు, కార్పొరేట్లు, రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు కుమ్మకై రికార్డులను తారుమారు చేసి ప్రయివేటు భూమిగా రికార్డులు సృష్టించారన్నారు. తప్పుడు రికార్డులు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోకుండా, పేదలపై దాడి చేసేందుకు ప్రయివేటు సైన్యాన్ని దించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై పోలీస్‌ కమిషనర్‌ ప్రత్యేకంగా దర్యాప్తు జరిపి దాడులు చేసిన వారిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అలాగే, ఇక్కడ నివసిస్తున్న పేదలకు పట్టా సర్టిఫికెట్లు ఇచ్చి ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి.సామెల్‌, డి.జగదీశ్‌, జిల్లా కమిటీ సభ్యులు సి.శోభన్‌, మండల కార్యదర్శి రామకృష్ణ, నాయకులు కె.కృష్ణ, రజాక్‌ పాషా, సీపీఐ నాయకులు చందు యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి : బీఆర్‌ఎస్‌ నాయకులు
గతంలో ప్రతిపక్ష నాయకుని హోదాలో సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని మాజీ స్పీకర్‌ మధుసూధ నాచారి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ అన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలిలోని గోపన్‌పల్లి బసవతారక నగర్‌ వాసులను బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు, మాజీ స్పీకర్‌ మధుసూదనాచారి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌ పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రియల్‌ మాఫియా పెద్దలు ప్రభుత్వ భూమిని ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే బసవతారక నగర్‌ కాలనీ వాసులను ఖాళీ చేయించడానికి గుండాలను పంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బసవతారక నగర్‌ కాలనీని సందర్శించి వారికి 60 గజాల స్థలం ఇస్తామని హామీనిచ్చారని, ఆ హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి.. బసవతారక నగర్‌ పక్కనే ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. లేకపోతే బీఆర్‌ఎస్‌ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనా కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -