– బోనం, పట్టు వస్త్రాలు అందజేత
– పాల్గొన్న మంత్రి పొన్నం, కలెక్టర్ హరిచందన
నవతెలంగాణ- సిటీబ్యూరో
సికింద్రాబాద్ శ్రీఉజ్జయిని మహంకాళి అమ్మవారికి శుక్రవారం రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ దంపతులు బోనం, పట్టువస్త్రాలు సమర్పించారు. వారి వెంట రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, కలెక్టర్ హరిచందన దాసరి ఉన్నారు. అంతకు ముందు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో వారికి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. ఈనెల 13న ఉజ్జయిని మహంకాళి బోనాలు, 14న రంగం ఉండటంతో లక్షలాది మంది జనం వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఎక్కడా ఇబ్బందులు కలగకుండా నిరంతరం పర్యవేక్షిస్తూ.. పటిష్ట చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రద్దీ దృష్ట్యా ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేపట్టిందన్నారు. ఈ సందర్భంగా ఏర్పాట్లపై సందర్శకులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. నిరంతర విద్యుత్, తాగునీటి వసతిపై ప్రత్యేక దృష్టి సారించాలని, లైన్‌లో ఉన్న వారికి ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా పోలీసులు నిరంతరం పర్యవేక్షణ చేపట్టాలని సూచించారు. వచ్చిన వారందరికీ అమ్మవారి దర్శనం కల్పించాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో దేవాదాయశాఖ కమిషనర్ ఎస్.వెంకట్రావు, డీసీపీ రష్మీ పరిమల్, జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు, డిప్యూటీ మేయర్ మోతే శ్రీలతరెడ్డి, ఆలయ చైర్మెన్ సురిటి రామేశ్వర్, ఈవో మనోహర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
శ్రీ ఉజ్జయిని మహంకాళిని దర్శించుకున్న గవర్నర్ దంపతులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES