– అల్బనీస్‌పై ఆంక్షలను ఖండించిన మానవ హక్కుల గ్రూపులు, నిపుణులు
న్యూయార్క్ : మానవహక్కులపై ఐక్యరాజ్య సమితి ప్రత్యేక ప్రతినిధి ఫ్రాన్సెస్కా అల్బనీస్‌పై అమెరికా ఆంక్షలు విధించడాన్ని మానవ హక్కుల గ్రూపులు, ఐక్యరాజ్య సమితి అధికారులు తీవ్రంగా ఖండించారు. ఇలా ఐక్యరాజ్య సమితి నిపుణులను అమెరికా లక్ష్యంగా చేసుకోవడం వల్ల అంతర్జాతీయ జవాబుదారీ యంత్రాంగాలకు ముప్పు ఏర్పడుతుంద ని వారు హెచ్చరించారు. అమెరికా, ఇజ్రాయిల్‌లపై అల్బనీస్ రాజకీయ, ఆర్థిక యుద్ధ ప్రచారం జరుపుతున్నారని ఆరోపిస్తూ బుధవారం అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ఈ ఆంక్షలను ప్రకటించారు. గాజాలో ఇజ్రాయిల్ సెటిల్‌మెంట్లతో, మిలటరీ ఆపరేషన్లతో 60కిపైగా కంపెనీలు లాభాలార్జిస్తున్నాయని అందులో అమెరికా కేంద్రంగా పనిచ్సేఏ లాక్‌హీడ్ మార్టిన్, మైక్రోసాఫ్ట్, కేటర్‌పిల్లర్ తదితరాలు వున్నాయని అల్బనీస్ పేర్కొన్నారు. ఈ మేరకు ఆమె ఒక నివేదికను వెలువరించారు.
అది జరిగిన కొద్ది వారాలకే అమెరికా ఆంక్షలు విధించింది. తక్షణమే ఈ మారణకాండపై అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు విచారణ జరపాలని ఆ నివేదిక పిలుపిచ్చింది. తక్షణమే ఆంక్షలను ఎత్తివేయాలని ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల హై కమిషనర్ వోల్కర్ టుర్క్ డిమాండ్ చేశారు. ఐక్యరాజ్య సమితి సభ్య దేశాల మధ్య తీవ్రమైన విభేదాలు, భిన్నాభిప్రాయాలు వున్నప్పటికీ చర్చలు, సంప్రదింపుల ప్రక్రియను అనుసరించాలని ఆయన కోరారు. శిక్షాత్మక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడానికి బదులుగా అర్ధవంతమైన చర్చలపై దృష్టి సారించాలని ఆయన కోరారు. ఐక్యరాజ్య సమితిలో స్విట్జర్లాండ్ ప్రతినిధి, ప్రస్తుతం మానవ హక్కుల మండలి అధ్యక్షుడైన జుర్గ్‌లాబర్ మాట్లాడుతూ, అల్బనీస్‌పై ఆంక్షలు పట్ల ఆందోళన వ్యక్తం చేశారు.
బెదిరింపులు లేదా ప్రతీకార చర్యలకు దూరంగా వుండాలని సభ్య దేశాలను కోరారు. ఇటువంటి చర్యలు ప్రమాదకరమైన ప్రమాణాలను నెలకొల్పుతాయని ఐక్యరాజ్య సమితి నిపుణులు హెచ్చరించారు. రష్యా మానవ హక్కుల ప్రతినిధి మరియానా కజరొవా మాట్లాడుతూ అమెరికా తీసుకున్న చర్యతో ఇతర దేశాలు కూడా ఇలాగే వ్యవహరించడానికి వెసులుబాటు కల్పించినట్లవు తుందని అన్నారు. మొత్తంగా ఐక్యరాజ్య సమితి వ్యవస్థపైనే దాడి అని వ్యాఖ్యానించారు. మానవ హక్కుల పర్యవేక్షక సంస్థ హెచ్‌ఆర్‌డబ్ల్యు కూడాఇదే రీతిలో ఆందోళనలు వ్యక్తం చేసింది. సంస్థల నిబంధనలను, ప్రమాణాలను అమెరికా ధ్వంసం చేస్తోందని హెచ్‌ఆర్‌డబ్ల్యు ఇంటర్నేషనల్ జస్టిస్ డైరెక్టర్ లిజ్ ఎవిన్సన్ విమర్శించారు. ఇజ్రాయిల్ యుద్ధ నేరాలపై ఐసీసీ ప్రాసిక్యూషన్లకు అడ్డం కొట్టేందుకే ఈ ఆంక్షలని హెచ్‌ఆర్‌డబ్ల్యు మాజీ హెడ్ కెన్నెత్ రాథ్ విమర్శించారు.