– లేనిపక్షంలో 7న సమ్మెకు సిద్ధం
– సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం,
– ఆర్టీసీ యాజమాన్యం చొరవ చూపాలి : టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ రౌండ్‌టేబుల్ సమావేశంలో వక్తలు
– సమ్మె పోస్టర్ ఆవిష్కరణ
– ఆర్టీసీ కళ్యాణ మండపం నుంచి బస్‌భవన్ వరకు కార్మికుల కవాతు
నవతెలంగాణ-సిటీబ్యూరో
ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి యాజమాన్యం, ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని, లేనిపక్షంలో మే 7వ తేదీ నుంచి సమ్మె తప్పదని వక్తలు తేల్చి చెప్పారు. ఆర్టీసీ పరిరక్షణ, ప్రభుత్వ హామీలు, ఆర్టీసీలో సమ్మె అంశాలపై జాతీయ కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం మంగళవారం హైదరాబాద్ హిమాయత్‌నగర్‌లోని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యాలయంలో టీజీఎస్‌ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో జరిగింది. దీనికి జేఏసీ చైర్మెన్, ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి ఈదురు వెంకన్న అధ్యక్షత వహించారు. ఏఐటీయూసీ రాష్ట్ర డిప్యూటీ జనరల్ సెక్రెటరీ ఎం.నరసింహా మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోతే.. గత ప్రభుత్వానికి పట్టిన గతే పడుతుందని హెచ్చరించారు. సమ్మె జరగొద్దని తాము కోరుకుంటున్నామని, సమ్మెపై జేఏసీ జనవరి 27న ఇచ్చిన నోటీసుపై యాజమాన్యం నుంచిగానీ, ప్రభుత్వం నుంచిగానీ ఎలాంటి స్పందనా లేకపోవడం వల్లే సమ్మె అనివార్యంగా భావిస్తున్నామని చెప్పారు. సమ్మె నోటీసుపై జేఏసీతో చర్చలు జరపకుండా కార్మికులను రెచ్చగొడుతున్నారని, అందుకు యాజమాన్యం, ప్రభుత్వమే మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందని అన్నారు. సమ్మె నోటీసు ఇచ్చిన తరువాత సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీఎంతో పాటు మంత్రుల దృష్టికి తమ సమస్యలను తీసుకెళ్లామని, అక్కడి నుంచి ఎలాంటి స్పందనా రాలేదని తెలిపారు. తమ చివరి అస్త్రంగా సమ్మెకు దిగాల్సిన గత్యంతరం ఏర్పడిందన్నారు.
సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పద్మశ్రీ మాట్లాడుతూ.. ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగుల విషయంలో ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, వెంటనే ఆర్టీసీ కార్మిక సంఘాలను పిలిచి మాట్లాడాల ని కోరారు. ఆర్టీసీ సమ్మెకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. ఐఎఫ్‌టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు అనురాధ మాట్లాడుతూ.. ఆర్థిక భారంతో సంబంధం లేని డిమాండ్లకు సంబంధించిన అంశాలను క్లియర్ చేయాలని ప్రభుత్వానికి సూచించారు. ప్రభుత్వం బేషజాలకు పోవద్దన్నారు. ఆర్టీసీ సంఘాలను బేషరతుగా చర్చలకు పిలవాలని, సమ్మె జరగకుండా సమస్యల పరిష్కారానికి పూనుకోవాలని కోరారు. ఐఎఫ్‌టీయూ జాతీయ సభ్యులు విజరు మాట్లాడుతూ.. కాంగ్రెస్ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆర్టీసీ కార్మికులకు ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని, ఆర్టీసీ ఉద్యోగులను వెంటనే ప్రభుత్వంలో విలీనం చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు నాగేశ్వరరావు మాట్లాడుతూ.. సమ్మెకు తమ మద్దతు ఉంటుందన్నారు. జేఏసీ చైర్మెన్, కో-చైర్మెన్, వైస్ చైర్మెన్ వెంకన్న, హనుమంతు ముదిరాజ్, థామస్‌రెడ్డి మాట్లాడుతూ.. ఆర్టీసీలో కార్మికులు, ఉద్యోగుల పరిస్థితి దయనీయంగా ఉందన్నారు. యాజమాన్యం చిత్రహింసలకు గురి చేస్తున్నదని, 8 గంటల పనిదినాలను పాటించకుండా 16 గంటలు అమలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్రీత్ ఎనలైజర్ టెస్ట్‌లో సాంకేతిక లోపాలున్న పరికరాన్ని ఉపయోగిస్తూ డ్రైవర్ల తప్పిదం లేకపోయినా ఉద్యోగం నుంచి యాజమాన్యం తొలగిస్తోందని తెలిపారు. పదేండ్లలో 16 వేల మంది ఉద్యోగ విరమణ చేసినా కొత్త నియామకాలు చేపట్టలేదన్నారు. 1200 బస్సులను తగ్గించారన్నారు. వీటి స్థానంలో ప్రయివేట్ ఎలక్ట్రికల్ బస్సులను తీసుకొచ్చారని తెలిపారు. ప్రయివేట్ బస్సులు కాకుండా.. ఆర్టీసీ సంస్థనే ఎలక్ట్రికల్ బస్సులు కొనేలా సబ్సిడీ అందజేయాలని డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయడానికి గత ప్రభుత్వం గెజిట్ జారీ చేసి రెండేండ్లు కావస్తున్నా అపాయింటెడ్ డేట్ ప్రకటించడానికి ఎందుకు జాప్యం జరుగుతుందో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్ చేశారు. యూనియన్ల పునరుద్ధరణ విషయంలోనూ ఆర్టీసీ యాజమాన్యం నిర్లక్ష్య ధోరణి వ్యవహరిస్తోందన్నారు.
ఎన్ని ఇబ్బందులు ఎదురైనా గత ప్రభుత్వం హయాంలో 53 రోజులు సమ్మె చేశామని, అదే సంకల్పంతో ఈసారీ సమ్మెకు దిగుతున్నట్టు చెప్పారు. ఈ సమావేశంలో ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు ఎస్.బాబు, జేఏసీ కన్వీనర్ ఎండీ.మౌలానా, కో-కన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేష్, బి.యాదగిరి, ఐఎఫ్‌టీయూ నాయకులు రమేష్, టీఎయంయూ నాయకులు బి.యాదయ్య, ఎన్.కమలాకర్ గౌడ్, ఎం.హెచ్ అలీ, టీజేఎంయూ నాయకులు డీవీకే. రావు, వి.బాబు, ఎండీ.రహీముద్దీన్, బి.శ్రీనివాస్, ఎం.వెంకటేష్, వెంకట్ గౌడ్, కె.రాంరెడ్డి, స్వాములయ్య తదితరులు ప్రసగించారు.
ఆర్టీసీ కార్మికుల డిమాండ్లుపరిష్కరించాల్సిందే..
- Advertisement -
RELATED ARTICLES