Wednesday, April 30, 2025
Homeరాష్ట్రీయంవిద్యుత్‌ చార్జీలు పెంచం

విద్యుత్‌ చార్జీలు పెంచం

– విద్యుత్‌ మరణాలకు త్వరలో పరిహారం పెంపు : ఈఆర్సీ చైర్మెన్‌ జస్టిస్‌ నాగార్జున్‌ వెల్లడి
– వార్షిక టారిఫ్‌ ఉత్తర్వులు జారీ
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో విద్యుత్‌ చార్జీ లను ఈ ఏడాది పెంచబోమని తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి (ఈఆర్సీ) చైర్మెన్‌ జస్టిస్‌ దేవరాజు నాగార్జున్‌ ప్రకటిం చారు. మంగళవారం హైదరా బాద్‌లోని ఈఆర్సీ కార్యాలయం లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన 2025-26 వార్షిక విద్యుత్‌ టారిఫ్‌ను ప్రకటించారు. ఉత్తర, దక్షిణ తెలంగాణ విద్యుత్‌ పంపిణీ సంస్థలు, సిరిసిల్లా కో ఆపరేటివ్‌ ఎలక్ట్రికల్‌ సప్లై సొసైటీ(సెస్‌)లు ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.65,849.74 కోట్ల ఆదాయ అవసరాలుంటాయని ప్రతిపాదించ గా, తాము శాస్త్రీయ పద్ధతిలో లెక్కించి రూ.58,628.09 కోట్లకు తగ్గించి ఆమోదించామన్నారు. ప్రస్తుత విద్యుత్‌ చార్జీలతో రూ.45,710.05 కోట్ల ఆదాయం మాత్రమే రానుండడంతో రూ.13,499.41 కోట్ల ఆదాయ లోటును ఎదుర్కోనున్నాయని తెలిపారు. రూ.13,499.41 కోట్ల విద్యుత్‌ సబ్సిడీలు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో ఈ ఏడాది విద్యుత్‌ చార్జీలను పెంచబోమని తెలిపారు. గతేడాదితో పోల్చితే విద్యుత్‌ సబ్సిడీ రూ.1999.89 కోట్లకు (17.4 శాతం) పెరిగిందన్నారు. రాష్ట్రంలో గత మార్చి 28న రికార్డు స్థాయిలో 17,162 మెగావాట్ల గరిష్ట విద్యుత్‌ డిమాండ్‌ ఏర్పడిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 26,145 మెగావాట్ల విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలు చేసుకుందనీ, అందులో 20,845 మెగావాట్ల సరఫరా సామర్థ్యాన్ని కలిగి ఉందన్నారు. 2033-34 నాటికి రాష్ట్రంలో విద్యుత్‌ కొరత ఏర్పడనుండడంతోనే సౌర విద్యుత్‌ కొనుగోలు ఒప్పందాలకు అనుమతించామని ఆయన వివరించారు. ట్రాన్స్‌ఫార్మర్లకు సకాలంలో మరమ్మతులు చేయకపోవడంతో విద్యుద్ఘాతంతో రైతులు, యువకులు మరణిస్తున్నారనే ఫిర్యాదులు అందాయని అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.5లక్షల పరిహారం ఇస్తుండగా, ఆ పరిహారం పెంపుపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
నష్టాల్లో డిస్కంలు
రాష్ట్రంలోని డిస్కంలు తీవ్ర నష్టాల్లో ఉన్నాయని జస్టిస్‌ నాగార్జున్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ మేరకు డిస్కంల ఆదాయ లోటును ఈఆర్సీ తగ్గించి చూపుతోందని అనడంలో వాస్తవం లేదని తెలిపారు. ఎంత ఆదాయ లోటుందో ఆ మేరకు సబ్సిడీ ఇచ్చేందుకు ప్రభుత్వం అంగీకరించిందని వివరించారు. ఈఆర్సీ ఆమోదించిన ఆదాయ లోటు అంచనాలతో పోల్చితే వాస్తవ ఆదాయ లోటు అధికంగా ఉండడంతో డిస్కంలు నష్టాలను మూటగట్టుకుంటున్నాయని అభిప్రాయపడ్డారు. డిస్కంల నష్టాలను పూడ్చుకునేందుకు విద్యుత్‌ చార్జీలు పెంచడమే పరిష్కారమని పేర్కొన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో విద్యుత్‌ చార్జీలు పెంచి ప్రజలపై భారం వేయలేమని చెప్పారు. ఆర్థిక పునర్వ్యవస్థీకరణ కోసం కేంద్రం తెచ్చిన ఆర్డీఎస్‌ఎస్‌ పథకంలో చేరిన తర్వాత వ్యవసాయ ఫీడర్లకు మీటర్లు పెడతామంటూ డిస్కంలు హామీ ఇచ్చాయని అన్నారు.. డిస్కంల డిస్ట్రిబ్యూషన్‌ బిజినెస్‌కి సంబంధించి రూ.685.78 కోట్లు, ట్రాన్స్‌కోకి చెందిన ట్రాన్స్‌మిషన్‌ బిజినెస్‌కి సంబంధించి రూ.1608 కోట్లను ట్రూడౌన్‌ చేశామని వివరించారు. డిస్కంల విలింగ్‌ చార్జీలు, డిస్ట్రిబ్యూషన్‌ బిజినెస్‌, ట్రాన్స్‌కో తదితర ఎనిమిది పిటిషన్లను పరిష్కరిస్తూ ఆ మేరకు వేర్వేరు ఉత్తర్వులను జారీ చేశామని పేర్కొన్నారు. యాదాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రంలోని 800 మెగావాట్ల రెండో యూనిట్‌ అందుబాటులోకి రాగా, మొదటి యూనిట్‌ ఆగస్టు, 3వ యూనిట్‌ నవంబర్‌, 4వ యూనిట్‌ అక్టోబర్‌, 5వ యూనిట్‌ వచ్చే ఏడాది జూన్‌లో అందుబాటులో వస్తాయని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img