– చట్టబద్ధత కల్పించే బాధ్యత కేంద్రానిదే
– రిజర్వేషన్లపై కోర్టుకెళ్లే వారిని సామాజికంగా బహిష్కరించండి
– బీసీ సంఘాల నాయకులతో ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ఆమోదించిన 42శాతం బీసీ రిజర్వేషన్లపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్ల అమలుపై ఆర్డినెన్స్ తెచ్చినందుకు హర్షం వ్యక్తం చేస్తూ బీసీ నేతలు శనివారం హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్లను 9వ షెడ్యూల్‌లో చేర్చి చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేశారు. రిజర్వేషన్ల అమలుపై కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజరు, ఎంపీలు లక్ష్మణ్, ఆర్ క్రిష్ణయ్య చిత్తశుద్ధి నిరూపించుకోవాలని సూచించారు. ”రిజర్వేషన్ల కోసం ఇంకా ఏం చేయాలన్నా సీఎంగా నేను సిద్ధం. అర్ధరాత్రి కూడా మంత్రి వర్గ సమావేశం ఏర్పాటు చేస్తా. రిజర్వేషన్ల విషయంలో నన్ను ప్రశ్నించే నైతిక హక్కు ప్రతిపక్షాలకు లేదు. నెల రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లు ఖరారు చేయాలని హైకోర్టు ప్రభుత్వానికి డెడ్‌లైన్ విధించింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం కోసమే ఇంత కాలం స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా వేశాం. యాభై శాతానికి మించి రిజర్వేషన్లు పెంచొద్దని గత కేసీఆర్ ప్రభుత్వం పంచాయతీరాజ్ చట్టం చేసింది. దాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ తెచ్చాం. బీసీల రిజర్వేషన్ల అమలు కోసం నిబద్ధతతో పని చేస్తున్నాం” అని రేవంత్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ దళితులు, వెనకబడిన వర్గాలకు ఎల్లప్పుడూ అండగా ఉందని గుర్తు చేశారు. తెలంగాణ ఆకాంక్ష సోనియా గాంధీతోó, కులగణన రాహుల్ గాంధీ పట్టుదలతోనే సాధ్యమైందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ ఒత్తిడికి లొంగే కేంద్రం 2026లో జరిగే జనగణనలో కులగణన చేయాలని నిర్ణయించిందని అన్నారు. రిజర్వేషన్లపై ఎవరైనా కోర్టుకు వెళ్తే వారిని సామాజిక బహిష్కరణ చేస్తామని ప్రకటించాలని సీఎం రేవంత్ ఈ సందర్భంగా బీసీ సంఘాల నాయకులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్‌గౌడ్, మంత్రి కొండా సురేఖ, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
బీసీ రిజర్వేషన్లపై బీజేపీకి చిత్తశుద్ధి లేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES