Monday, July 14, 2025
E-PAPER
Homeదర్వాజమానవ సంబంధ వారధి నల్ల గేటూ నంది వర్థనం చెట్టు

మానవ సంబంధ వారధి నల్ల గేటూ నంది వర్థనం చెట్టు

- Advertisement -

వచన కవిత్వం ప్రత్యేకమైనది. 90వ దశకం నుంచి అభివ్యక్తి, వస్తు, రూప పరిణామాల్లో ప్రత్యేకత సంతరించుకుంది. ఈ నేపథ్యంలో తెలుగు సాహిత్యంలో శిఖామణి ప్రత్యేకమైన శైలి, రూపం, సారం కలిగివున్న కవి. కవిత్వం చదివే వర్తమాన పాఠకులు, రాయాలనుకునే కవులకు మానవ సంబంధ వారధిగా నిలిచిన కవిగా నాకు ప్రత్యేకంగా కనిపించిన విలక్షణ కవి శిఖామణి.
2005 ఈ కవి రూపొందించిన నల్లగేటూ – నందివర్థనం చెట్టులో ప్రత్యక్ష అనుభవం, అనుభూతి నాకుంది. చాలామంది కవుల్ని ఈ దశాబ్దంలో చదివినప్పటికీ ప్రతి కవి తనదైన భావనా ప్రపంచంలోకి పాఠకుడ్ని తీసుకెళతాడు. అలా శిఖామణి రాసిన ‘నల్లగేటూ నందివర్థనం చెట్టు’ ఒక పాఠకుడిగా నన్ను ఆకట్టుకుంది. కొత్తగా కవిత్వం రాసే కవులకు ఈ తరానికి చెందిన పాఠకుల్ని తన కవితాభివ్యక్తిలో శిఖామణి ఆకర్షింపజేశారు. 48 కవితలలో ప్రచురించిన ఈ కవితా సంపుటిలో మనకు తెలిసిన, మనమెరిగిన మనుషులు, వస్తువులు, అతిసాధారణమైన అంశాలపై అద్భుతమైన అభివ్యక్తితో రాసిన కవితలు అనేకం వున్నాయి. కవిత్వమంటే ఇలా వుంటుందా? ఇంత సరళంగా, స్పష్టంగా చదివే పాఠకుడ్ని సరికొత్త మానసికాదరణలోకి తీసుకుపోయి, ఆలోచింపజేస్తుందనే వాస్తవాన్ని ఈ సంపుటి చదివినప్పుడు ఎవరికైనా కలిగే అనుభూతి.
ఒక సాహిత్య విద్యార్థిగా, అధ్యాపకుడిగా ఈ కవితా సంపుటి నన్ను ప్రభావితం చేసింది. బోధకుడిగా నవతరం విద్యార్థుల్ని, కవిత్వ రచనవైపు మళ్లించే క్రమంలో నల్లగేటూ నందివర్థనం చెట్టును తరగతి గదిలో ఆవిష్కరించినప్పుడు విద్యార్థులు స్పందించిన తీరు ఆశ్చర్యానికి గురిచేసింది. కవిత్వం ఎలా రాస్తారు? వస్తువు, రూపం, భాష, అభివ్యక్తి గురించి విద్యార్థులకు విపులంగా బోధించే క్రమంలో ‘అంజలి, చానాళ్లకి వెళ్లాను పాల్వంచకి, మాటల మంచి గంధపు చెట్టు, గొడుగులోడు, నల్లగేటూ నందివర్థనం చెట్టు’ లాంటి కవితలు ఈనాటి డిగ్రీ చదువుతున్న విద్యార్థుల్ని ఆకట్టుకోవడంలో అతిశయోక్తి లేదు. ప్రముఖ భాషా శాస్త్రవేత్త చేరా ఈ కవితా సంపుటికి ముందుమాట రాస్తూ ‘శిఖామణి కవిత్వం రాస్తాడనే కన్నా శ్వాసిస్తాడనటం సబబుగా వుంటుంది. ఏ దృశ్యం కంటపడినా, ఏ జ్ఞాపకం మదిలో మెదిలినా అతి అలవోకగా కవిత్వం అవుతుంది’ అన్నమాట అక్షర సత్యం. పాఠకుడిగా నేను ‘నల్లగేటూ నందివర్థనం చెట్టు, చానాళ్లకి వెళ్లాను పాల్వంచకి’… ఈ రెండు కవితలలో ప్రత్యక్ష అనుభాదానుభూతి వుంది. శిఖామణి ఖైరతాబాద్‌లో వున్న రోజుల్లో నల్లగేటూ నందివర్థనం చెట్టున్న ఇంట్లో వున్నారు. ఇక పాల్వంచ మీద రాసిన కవితలో ప్రముఖ ఆర్టిస్ట్‌ అక్బర్‌ మిత్రుడు కృష్ణ పాల్వంచ మార్కెట్‌ వీధిలో సైన్‌ బోర్డులు రాస్తూ జీవించేవాడు. అతడిని నేను ప్రత్యక్షంగా ఎరుగుదును. తను చనిపోయాడనే వార్త విన్నాక రాసిన ఈ కవిత మనల్ని కంట తడి పెట్టిస్తుంది. కవిత్వం కరుణ రసాత్మకమైనది. అంతిమ వాస్తవాన్ని తెలిపే ప్రక్రియ. ఆ కోణంలో ఈ సంపుటిలో కవితలన్నీ వున్నాయి. గత దశాబ్దకాలంగా తెలుగు అధ్యాపకుడిగా విద్యార్థులకు కవిత్వ రచన గురించే బోధించి క్రమంలో ఈ కవితా సంపుటిలోని పలు కవితల్ని ఉదాహరించినప్పుడు విద్యార్థులు స్పందించిన తీరు అనిర్వచనీయమైనది. ఖమ్మం ఎస్‌.ఆర్‌.బి.జి.ఎన్‌.ఆర్‌.లో ఈ సంపుటిలోని అనేక కవితలు వారు కవిత్వం రాయడానికి ప్రేరణగా నిలిచాయి. ‘మిత్రుడు లేని ఊరికి వెళ్లడమంటే అమ్మ లేని ఇంటి గడపలో తొలిసారి అడుగు పెట్టినట్టుంది’ అన్న వాక్యం చాలా మంది విద్యార్థుల్ని కవితా రచనవైపుకి మళ్లించింది.
కవిత్వం మనిషిని చేస్తుంది అనడానికి ఈ సంపుటి ఒక నిదర్శనం. నమూనాగా నిలుస్తుంది… స్ఫూర్తివంతంగా నిలిచిన సంపుటి. అటు కవులకు, ఇటు ఇప్పుడిప్పుడే రాస్తున్న వర్ధమాన విద్యార్థి కవులకు.. నాకు మరీ!
‘కవి అక్షరానికి/ రక్త మాంసాలు కొంత ఇవ్వాలి/
తన ప్రాణ వాయువును మరికొంత ఊదాలి/
అప్పుడే… పొద్దు గుంకగానే/ గూట్లో దీపం ముట్టించినట్టు’
అక్షరం వెలుగుతుంది… ఇది అక్షర సత్యం.
– ఎం.వి.రమణ, 9989000265

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -