పోలీసులపై చర్యలే లేవు
తుతు మంత్రంగా విచారణ జరుపుతున్న ఎన్‌హెచ్‌ఆర్‌సీ
బాధితులకు పరిహారాలూ అంతంతే
సుప్రీంకోర్టు తప్పు పట్టినా మారని తీరు
లక్నో : జీషన్ హైదర్ ఉత్తర ప్రదేశ్‌కు చెందిన రైతు. అతనికి 2021 సెప్టెంబర్ ఐదో తేదీ అర్ధరాత్రి ఓ ఫోన్ వచ్చింది. విచారణ నిమిత్తం తనను పోలీసులు పిలుస్తున్నారని ఆయన భార్యకు చెప్పి బయటికి పోయారు. ఓ అరగంట తర్వాత ఆయన ఫోన్ పనిచేయలేదు. తెల్లారేసరికి ఆయన విగతజీవిగా మారారు. దీనిపై అధికారులు ఏం చెప్పారంటే… గ్రామంలో ఆవుల అక్రమ రవాణాదారులపై ఎన్‌కౌంటర్ జరిగిందట. పోలీసులు కాల్పులు జరపగా ఓ బులెట్ జీషన్ హైదర్ తొడలోకి దూసుకుపోయిందట. తీవ్ర రక్తస్రావంతో ఆయన చనిపో యారట. ఇలా ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ నేతృత్వంలోని బీజేపీ పాలనలో బూటకపు ఎన్‌కౌంటర్ల సంఖ్య నానాటికీ పెరిగి పోతోంది. ఒక్క మాటలో చెప్పాలంటే ఆ రాష్ట్రం ‘ఎన్‌కౌంటర్ రాజ్’ని తలపిస్తోంది. యూపీలో 236 ఎన్‌కౌంటర్ కేసులపై జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదులు అందగా ఒక్క దానిపై కూడా సమగ్ర విచారణ జరిగిన పాపాన పోలేదు.
14 నెలలు విచారణ జరిపి…
జీషన్ వద్ద రెండు లైసెన్స్ పొందిన తుపాకులు ఉన్నాయి. కానీ ఆయనకు ఏ విధమైన నేర చరిత్ర లేదు. జీషన్ చనిపోయిన రోజు ఆయనతో పాటు మరో ఐదుగురిపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు. హత్య, హత్యాయత్నం, అల్లర్లు వంటి అభియోగాలతో పాటు ఆయుధ చట్టంలోని వివిధ సెక్షన్లను వారిపై మోపారు. జీషన్ భార్య జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్ ఆర్‌సీ)ని ఆశ్రయించారు. ఈ కేసు సుమారు 14 నెలల పాటు ఎన్‌హెచ్‌ఆర్‌సీ పరిశీలనలోనే ఉండిపోయింది. చివరికి కమిషన్ పోలీసుల వాదననే సమర్ధించింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్లకు సంబంధించిన కేసుల విషయంలో ఎన్‌హెచ్ ఆర్‌సీ విచారణలు తీరు తుతు మంత్రంగా సాగుతున్నాయని చెప్పడానికి ఇదో ఉదాహరణ మాత్రమే. కమిషన్ ప్రధానంగా పోలీసు కథనాలపై ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్లు తయారు చేసిన నివేదికల పైనే ఆధారపడుతోంది. తనకు తానుగా స్వతంత్ర విచారణలు చేపట్టడం లేదు.
ఇది మరో కట్టుకథ
మరో కేసును పరిశీలిద్దాం. 2017 డిసెంబర్ 30న నూర్ మహమ్మద్ అనే వ్యక్తి తన భార్యతో మాట్లాడుతూ పోలీసులు తన సోదరిని నిర్బంధించారని, తాను మీరట్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లాల్సి ఉన్నదని చెప్పారు. బంధువుల వద్ద కుటుంబాన్ని వదిలేసి తన మోటారు సైకిలుపై బయలుదేరాడు. అదే అతని చివరి ప్రయాణం అయింది. తన భర్త పోలీస్ ఎన్‌కౌంటర్‌లో చనిపోయాడన్న విషయం ఆ మరునాటి ఉదయం నూర్ మహమ్మద్ భార్య షహానాకు తెలిసింది. నూర్ ఓ హిస్టరీ-షీటర్ అని, మోటారు సైకిలుపై వెళుతూ పోలీసులపై కాల్పులు జరిపాడని అధికారులు ఆమెకు తెలిపారు. ఈ ఘటనపై సుమారు ఏడాది పాటు పరిశీలన జరిపిన ఎన్‌హెచ్‌ఆర్‌సీ అది ‘సహజం’గా జరిగిన ఎన్‌కౌంటరేనని తేల్చింది. ఈ కేసు విషయంలో కమిషన్ విచారణ తీరును మానవ హక్కుల సంఘాలు తప్పుపట్టాయి.
నోయిడాలో జరిగిన బూటకపు ఎన్‌కౌంటర్‌లో ఓ వ్యక్తి మరణించాడని ఎన్‌హెచ్‌ఆర్‌సీ నిర్ధారించినప్పటికీ బాధ్యులైన పోలీసులపై చర్యలకు సిఫారసు చేయలేదు. ఎన్‌హెచ్‌ఆర్‌సీ పనితీరుకు సంబంధించి దిగ్భ్రాంతి కలిగించే గణాంకాలు వెలుగులోకి వస్తున్నాయి. వేధింపులకు సంబంధించి కమిషన్ 20,000 కేసులు నమోదు చేయగా, వీటిలో కేవలం 998 కేసు ల్లో మాత్రమే బాధితులకు పరిహారం ప్రకటించారు. వీటిలో 28 కేసులకు సంబంధించి క్రమశిక్షణ చర్యలకు సిఫారసు చేశారు.
బాధ్యులపై చర్యలు లేవు
2017-2024 మధ్యకాలంలో ఎన్‌హెచ్‌ఆర్‌సీ 236 ఎన్‌కౌంటర్ సంబంధిత కేసులను సమీక్షించింది. వీటిలో 161 కేసులు 157 పోలీస్ ఎన్‌కౌంటర్ హత్యలకు సంబంధించినవే. పైగా వీటిలో ఎక్కువగా రాష్ట్ర పోలీసులు నివేదించినవే. ఈ కేసుల్లో ఏ ఒక్క దానిలోనూ ఎన్‌హెచ్‌ఆర్‌సీ పోలీసులను దోషులుగా నిర్ధారించకపోవడం గమ నార్హం. కమిషన్ దర్యాప్తు బృందాలు కేవలం 10 కేసుల విషయంలోనే సంఘటనా స్థలాల్లో విచారణలు జరిపాయి. వీటిలో సైతం పోలీసు కథ నాలనే సమర్థించాయి. 34 కేసులను రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ పరిశీలిస్తోందని చెప్పి వాటిలో జోక్యం చేసుకునేందుకు ఎన్‌హెచ్‌ఆర్‌సీ నిరాకరించింది. ‘బూటకపు ఎన్‌కౌంటర్ల’కు చెందిన 69 మంది బాధితులు 75 ఫిర్యాదులు అందజేయగా వాటిలో కేవలం రెండింటికి మాత్రమే పరిహారాన్ని సిఫారసు చేసింది. ఈ కేసుల విషయంలో సైతం పోలీసులపై ఎలాంటి చర్యలు సిఫారసు చేయలేదు.
దంతాలు లేని పులి
తనకు అందిన ఫిర్యాదులను ఎన్‌హెచ్‌ఆర్‌సీ సరైన విచారణ జరపకుండానే పరిష్కరిస్తోంది. అంతేకాక వాటిని సంబంధిత అధికారులకు పంపుతూ చేతులు దులుపుకుంటోంది. ఈ విధంగా అధికారులకు పంపుతూ ముగిస్తున్న కేసుల సంఖ్య 2010-11లో 36 శాతం ఉంటే 2019-20 నాటికి 74 శాతానికి చేరాయి. 2015-16లో ఇది గరిష్టంగా 90 శాతంగా నమోదైంది. మణిపూర్‌లో జరిగిన ఎన్‌కౌంటర్ కేసులను యాంత్రికంగా మూసేసినందుకు సుప్రీంకోర్టు 2017లో ఎన్‌హెచ్‌ఆర్‌సీని తీవ్రంగా విమర్శిస్తూ కమిషన్‌ను ‘దంతాలు లేని పులి’గా అభివర్ణించింది. అయినప్పటికీ కమిషన్ తీరు మారడం లేదు. ఏటా లక్షలాది ఫిర్యాదులు వస్తున్నప్పటికీ వాటిలో చాలా వరకూ ప్రాథమిక దశలోనే తిరస్కరణకు గురవుతున్నాయి. జీషన్ కేసును ఎన్‌హెచ్‌ఆర్‌సీ మూసివేసిన రెండు రోజుల తర్వాత… అంటే 2023 జనవరి 22న ఓ ఆసక్తికరమైన పరిణామం చోటుచేసుకుంది. జీషన్ మృతితో సంబంధమున్న 12 మంది పోలీసు సిబ్బందిపై కేసులు నమోదు చేయాలంటూ సహరాన్‌పూర్‌లోని చీఫ్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. కేసును మూసివేశామంటూ పోలీసులు సమర్పించిన నివేదికను ఈ ఏడాది మార్చిలో కోర్టు తిరస్కరించింది. కేసును పునర్విచారించాలంటూ పోలీసులను ఆదేశించింది.