– ప్రమోట్ చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి : డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్
నవతెలంగాణ-సిటీబ్యూరో
బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్న సెలబ్రెటీలు, ఇన్‌ఫ్లుయేన్సర్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య(డీవైఎఫ్‌ఐ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆనగంటి వెంకటేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్ గోల్కొండ చౌరస్తాలోని సీఐటీయూ కార్యాలయంలో నిర్వహించిన డీవైఎఫ్‌ఐ హైదరాబాద్ జిల్లా స్థాయి శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సెలబ్రిటీలు, ఇన్‌ఫ్లుయేన్సర్స్ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడంతో వాటికి ఆకర్షితులవుతున్న యువత డబ్బులు పొగొట్టుకొని అప్పులతో మానసికంగా కుంగిపోయి అనేకమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆన్‌లైన్ బెట్టింగ్స్‌లో మొదట లాభాలను చూపించి తర్వాత మొత్తం డబ్బులను కాజేస్తున్నాయన్నారు. అప్పులు చేసి మరీ ఆన్‌లైన్‌లో బెట్టింగ్స్ ఆడుతూ మోసపోతున్నారని, చివరకు ప్రాణాలనూ బలి తీసుకుంటున్నారని తెలిపారు. అనేక కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, బెట్టింగ్ యాప్స్‌లో డబ్బుల కోసం దురాలవాట్లకు పాల్పడి.. సొంత తల్లితండ్రుపైనే దాడులు చేస్తున్నారన్నారు.ఇలాంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బెట్టింగ్ యాప్స్‌ను పూర్తిగా నిషేందించాలని, యాప్స్‌ను ప్రమోట్ చేస్తున్నవారు ఎంతటివారైనా వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో డీవైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి జావేద్, జిల్లా ఉపాధ్యక్షులు దేవేందర్, రాజయ్య, రవి, పావని, భానుకిరణ్, నాయకులు శ్రీను, కార్తీక్, జావీద్ సతీశ్, జగదీష్, విజయలక్ష్మి, నాగరాజు, శివ తదితరులు పాల్గొన్నారు.
బెట్టింగ్ యాప్స్‌ను పూర్తిగా నిషేధించాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES