నవతెలంగాణ – హైదరాబాద్: బీహార్ లోని పూర్ణియా జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. కన్న కొడుకు కళ్ల ముందే భర్తను నరికి చంపిందో భార్య.. నోరు తెరిస్తే నీకూ ఇదే గతి పడుతుందని బెదిరించడంతో పన్నెండేళ్ల ఆ బాలుడు భయంతో వణికి పోయాడు. ప్రియుడితో కలిసి ఉండేందుకే భర్తను చంపేసినట్లు నిందితురాలు పోలీసులకు వెల్లడించింది. వివరాల్లోకి వెళితే.. పూర్ణియా జిల్లాకు చెందిన బాలో దాస్ (45), ఉషా దేవి దంపతులకు ముగ్గురు పిల్లలు. కుటుంబ పోషణ కోసం బాలో దాస్ పంజాబ్ లో కూలీ పనులు చేసేవాడు. పిల్లలతో కలిసి ఉషా దేవి సొంతూళ్లో ఉండేది. ఈ క్రమంలో ఉషా దేవికి గ్రామంలోనే ఓ యువకుడితో వివాహేతర సంబంధం ఏర్పడింది.
ప్రియుడితో లేచిపోవాలని నిర్ణయించుకున్న ఉషా దేవి..
భర్తకు తెలియకుండా తమ ఇంటి జాగాను వేరే వారికి అమ్మేసింది. ఆ సొమ్ముతో ప్రియుడితో కలిసి పరారయ్యేందుకు సిద్ధమైంది. భూమి అమ్మిన విషయం తెలిసిన వెంటనే బాలో దాస్ సొంతూరుకు చేరుకున్నాడు. దీంతో ఉషా దేవి ప్లాన్ విఫలమైంది. భూమి అమ్మకంపై భర్త నిలదీయడం, ప్రియుడిని కలుసుకునే వీలులేకపోవడంతో ఉషా దేవి దారుణమైన నిర్ణయం తీసుకుంది. ఆదివారం రాత్రి ఇంట్లో నిద్రిస్తున్న భర్తను గడ్డి కోసే కత్తితో నరికింది.
రక్తం చింది తండ్రి పక్కనే పడుకున్న కొడుకు ముఖంపై పడింది. కళ్లు తెరిచి చూసిన పన్నెండేళ్ల బాలుడికి కత్తితో తండ్రిని నరుకుతున్న తల్లి కనిపించింది. భయంతో కేకలు వేసేందుకు నోరు తెరిచిన కొడుకును ఉషా దేవి బెదిరించింది. నోరు మూసుకోకుంటే నీ తండ్రిలాగే నిన్నూ చంపేస్తానని హెచ్చరించింది. దీంతో వణికిపోయిన బాలుడు తెల్లారే వరకూ అలాగే ఉండిపోయాడు. ఆ తర్వాత బంధువుల ఇంటికి వెళ్లి జరిగిన ఘోరాన్ని వారికి వివరించాడు. విషయం తెలిసి బంధువులతోపాటు చుట్టుపక్కల వారు బాలో దాస్ ఇంటికి చేరుకున్నారు. గ్రామస్థుల సమాచారంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఉషా దేవిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించారు. ప్రియుడితో కలిసి పారిపోయేందుకే భర్తను హత్య చేసినట్లు ఉషా దేవి అంగీకరించిందని పోలీసులు వివరించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.