Tuesday, July 15, 2025
E-PAPER
Homeకరీంనగర్ప్రమాదకరంగా పోతన కాలనీ జంక్షన్..

ప్రమాదకరంగా పోతన కాలనీ జంక్షన్..

- Advertisement -

ప్రమాదంలో మృతి చెందిన అండర్ మేనేజర్ (ఫైల్)
రోడ్డు ప్రమాదాలకు కారణాలెన్నో…?
8వ కాలనీలో ఆందోళన కల్గిస్తున్న వరుస రోడ్డు ప్రమాదాలు
మైనర్లు వాహనాలు నడపడం,మద్యం సేవించి,అధిక వేగంతోనే ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తింపు
ప్రమాదాలకు గురవుతున్న వారిలో సింగరేణి కార్మికులే అధికం
ట్రాఫిక్ నియమాల ఉల్లంఘనతోనే అధిక ప్రమాదాలు…..
నవతెలంగాణ – యైటింక్లైన్ కాలనీ: 8వ కాలనీలో ఈ మద్య కాలంలో జరుగుతున్న వరుస రోడ్డు ప్రమాదాలు ప్రజలను ఒకింత ఆందోళన కల్గిస్తున్నాయి. ఈ ప్రమాదాల్లో కొందరు చనిపోతుంటే మరి కొంతమంది క్షత గాత్రులుగా మిగులుతున్నారు. మద్యం మత్తులోనో, అధిక వేగంతోనో, అవగాహన లేని మైనర్లు వాహనాలు నడపడం వల్లనో వెరసి రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. దీంతో సక్రమంగా తమ పనులకు వెళ్తున్న ఎంతో మందికి గాయాలు, మరి కొంత మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ట్రాఫిక్ నియమాలను పాటించాలని ప్రభుత్వాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నా, పోలీసు వారు  సమీక్షలు నిర్వహిస్తున్నా ప్రమాదాలకు మాత్రం అడ్డుకట్ట పడడంలేదు. ఇటీవలి కాలంలో 8వ కాలనీలో జరిగిన రోడ్డు ప్రమాదాలు ఇందుకు నిదర్శనం.

అధిక వేగం, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన

8వ కాలనీ నుండి గోదావరిఖని కి వెళ్ళే దారి,పోతన కాలనీ నుండి పెద్దపల్లి కి వెళ్ళే కోల్ కారిడార్ రోడ్డు వెంట అతివేగంగా వాహనాలు నడపడం, మద్యం సేవించి,ఫోన్ లో మాట్లాడుతూ  డ్రైవింగ్ చేయడం వల్ల కార్మికులు,కార్మికేతరులు ప్రమాదాలకు గురవుతున్నారు.

 ప్రమాదకరమైన రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్..

సింగరేణి సంస్థ ఇటీవల నూతనంగా నిర్మించిన 8వ కాలనీ పోతన కాలనీ రోడ్ లోనే ఎక్కువగా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.కృష్ణ వేణి టాలెంట్ స్కూల్ మూల మలుపు వద్ద,పోతన కాలనీ జంక్షన్ వద్ద,అబ్దుల్ కలాం స్టేడియం వద్ద సూచిక బోర్డులు లేకపోవడం,వేగ నియంత్రికలు అందుబాటులో లేకపోవడం  వంటి లోపాలు,విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న కార్మికులు అధిక వేగంతో వాహనాలు నడపడం వంటివి ఘోర ప్రమాదాలకు కారణమవుతున్నాయి .

 వాయు కాలుష్యం, పొగమంచు..

పొగమంచు కారణంగా విజిబిలిటీ తగ్గడం వల్ల కూడా ప్రమాదాలు పెరిగిపోతున్నాయి. సింగరేణి ఓసీపి.1,ఓసీపి.3 లలో బొగ్గు వెలికితీతకై నిర్వహించే బ్లాస్టింగ్ లతో తీవ్రమైన పొగ, దుమ్ము,ధూళీ రోడ్డు మీదకు వచ్చి దారి కనపడక కార్మికులు ప్రమాధాలకు గురవుతున్నారు. అలాగే ఆర్జీ.2 లో రోడ్ల మరమ్మతులను కూడా సింగరేణి సంస్థ సకాలంలో నిర్వహించకపోవడం గతుకులు పడ్డ రోడ్లపై ప్రయాణించడం వల్ల కూడా ప్రమాదాలు జరుగుతున్నాయి.

మద్యం సేవించడం .. ప్రమాదాలకు గురవడం

చిన్న వైశాల్యంలో 8వ కాలనీ ప్రాంతం విస్తరించి ఉంటుంది. ఇక్కడే 3 వైన్స్ లు ఒక భార్ షాప్ ఉండడం నిత్యం కార్మికుల విధులు ముగించుకొని ఇంటికి వెళ్తున్న క్రమంలో మద్యం సేవించి ప్రమాదాలకు గురవ్తున్నారు. ఈ ప్రమాదాల్లో సింగరేణి కార్మికులే ఎక్కువ ఉండడం తీవ్ర ఆందోళన కల్గిస్తోంది. ఈ మద్య కాలంలో జరిగిన ప్రమాదాలే ఇందుకు నిదర్శనం.

జీడీకే టూ టౌన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదాలు

సం…    మరణించినవారు    గాయపడిన వారు

2022         07                           14
2023         05                           16
2024         08                           12
2025         02                           08

 ఇటీవల కాలంలో 8వ కాలనీలో చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదాలు….

1.జూన్  14న ఓసీపి.3 అండర్ మేనేజర్ కు అధిక వేగంతో వచ్చిన మరో బైక్ డీకొట్టడంతో హెల్మెట్ లేక తల పగిలి అక్కడికక్కడే మృతి
2.జనవరి 21న కోల్ కారిడార్ రోడ్డులో అల్లూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని అధిక వేగంతో వచ్చిన కారు డీ కొట్టడంతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆ వ్యక్తి మృతి
3.గత సంవత్సరం ఏప్రిల్ 28న వీకేపి మైన్ కు చెందిన ఓ సింగరేణి కార్మికుడు విద్యుత్ స్తంభానికి డీ కొని అక్కడికక్కడే మృతి
4.గత సంవత్సరం నవంబర్ 12 కోల్ కారిడార్ రోడ్డుపై ముత్తారం మండల కేంద్రానికి చెందిన ఓ వ్యక్తికి ప్రమాదం అక్కడికక్కడే మృతి
5.గత సంవత్సరం 11 ఇంక్లైన్ కు చెందిన సింగరేణి కార్మికునికి ఎదురుగా వస్తున్న ఓ ప్రైవేట్ వాహనం డ్రైవర్ మద్యం సేవించి డీ కొట్టడంతో అక్కడికక్కడే మృతి
6.కృష్ణవేణి టాలెంట్ పాఠశాల మూల మలుపు వద్ద కారు,బైక్ డీ ఓ వ్యక్తికి తీవ్ర గాయాలు
7.సీఈఆర్ క్లబ్ వద్ద రాంగ్ రూట్ లో వస్తున్న ఓ బైక్ అటుగా వెళ్తున్న ఇంకో బైక్ కి డీ తీవ్ర గాయాలు….
8.శ్రీపాద కాలనీ బోర్డ్ వద్ద కారు బైక్ కు డీ బైక్ పై వెళ్తున్న వ్యక్తికి తీవ్ర గాయాలు
9.పోతన కాలనీ చెరువు వద్ద మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తూ ఎలక్ట్రిక్ స్తంభాన్ని డీ కొనడంతో డ్రైవర్ ప్రాణాపాయ స్థితిలోకి
10.సంతోష్ నగర్ లో సింగరేణి కార్మికుడు విద్యుత్ స్తంభాన్ని డీ కొనడంతో అక్కడికక్కడే మృతి

పోలీస్ వారు తక్షణ చర్యలు చేపట్టాలి

జీడీకే టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిదిలో జరుగుతున్న ఎక్కువ ప్రమాదాల్లో హెల్మెట్ లేకుండా వాహనాలు నడపడం, మైనర్లు వాహనాలు నడపడం మూలానే ఎక్కువగా జరుగుతున్నాయి. టూ టౌన్ పోలీస్ వారు  పోతన కాలనీ చెరువు వద్ద వాహనాల తనిఖీ చేపడుతున్నారు. ఆ సమయాల్లో వాహనాల పత్రాలు సరిగ్గా లేనివారు, హెల్మెట్ లేకుండా, మద్యం సేవించి వాహనాలు నడిపే వారు పోలీస్ వారు వెళ్ళే వరకు వేచి ఉండడం తరవాత యదా విధిగా వెళ్తూ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంగిస్తూ ప్రమాదాలకు గురికావడం నిత్యం జరుగుతోంది. ఇలా కాకుండా పోలీస్ వారు కార్డెన్ సెర్చ్ నిర్వహించి పకడ్బందీగా వాహనాల తనిఖీ చేపట్టాలి. హెల్మెట్ లేకుండా, మద్యం సేవిస్తూ వాహనాలు నడిపే వారిపై కఠిన చర్యలు చేపట్టాలి. పిల్లలకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ నిర్వహించాలి. ప్రతీ కార్మికుడు హెల్మెట్ ధరించి విధులకు హాజరయ్యేలా యాజమాన్యంతో కలిసి పోలీస్ శాఖ వారు  అవగాహన సదస్సులు ఏర్పాటు చేయాలి. నిరంతర వాహన తనిఖీలు చేపడుతూ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తే  ప్రమాదాలను కొంతైనా నివారించగలం.

రోడ్ల విస్తరణ ను యాజమన్యం యుద్ద ప్రాతిపదికన చేపట్టాలి: కుంట ప్రవీణ్ కుమార్ (ఎస్సీఈయు(సీఐటీయు) ఆర్జీ.2 బ్రాంచ్ కార్యదర్శి)

గత కొంత కాలంగా ఆర్జీ.2 పరిదిలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో సింగరేణి కార్మికులే అధికంగా ఉంటున్నారు. రోడ్ల వ్యవస్థ సరిగ్గా లేదు. ఆర్జీ.2 పరిధిలో దాదాపుగా అన్ని రోడ్లు పూర్తిగా శిథిలం అయిపోయాయి. రోడ్ల మరమ్మతు పనులు వెంటనే చేపట్టాలని మా యూనియన్ ఆద్వర్యంలో గతంలోనే మెమొరాండం అందజేసాం. కానీ ఇప్పటి వరకు యాజమాన్యం స్పందించిన దాఖలాలు లేవు. యుద్ద  ప్రాతిపదికన రోడ్ల నిర్మాణం చేపట్టకపోతే జీఎం కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తాం.

రోడ్డు భద్రతా నియమాలను ప్రతీ పౌరుడు తప్పక పాటించాలి: 2.సీహెచ్ శ్రీనివాస్ (ఏసీపి ట్రాఫిక్ రామగుండం)

రోడ్డు భద్రతా నియమాలను ప్రతీ పౌరుడు తప్పక పాటించాలి. అప్పుడే ఈ ప్రమాదాలను నివారించగలం. ట్రాఫిక్ నియమాలు పాటించకపోవడం వల్ల దేశ వ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో దాదాపుగా 1,65,000 మంది మరణిస్తూ,4,75,000 మంది అంగవైకల్యం పొందుతున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ లు లేకుండా మైనర్  పిల్లలకు వాహనాలు ఇవ్వవద్దు. పిల్లలకు జరుగుతున్న ప్రమాదాల్లో ఎక్కువ సీసీ ఉన్న పవర్ బైక్సే అధికంగా ఉంటున్నాయి. వీటిని  పిల్లలకు ఇవ్వవద్దు.ఇలా నియమ నింబధనలు పాటించకపోతే ప్రభుత్వం నుండి వచ్చే బెనిఫిట్స్,ఇన్స్యురెన్స్ సంస్థల నుండి వచ్చే నష్ట పరిహారం కూడా రాదు. పిల్లల తల్లి దండ్రులలో మార్పు రావాలి అప్పుడే సమాజం మారుతుంది. 8వ కాలనీలో ప్రత్యేక డ్రైవ్ చేపట్టి నిబంధనలను అతిక్రమించిన వారి వాహనాలకు జరిమానాలు విదిస్తూ కేసులు నమోదు చేస్తాం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -