– బీజేపీకి అనుకూలంగా ఎన్నికల కమిషన్
– టారిఫ్‌ల పేరుతో అమెరికా ప్రపంచ పెత్తనం
– వ్యతిరేకిస్తేనే మనుగడ సాధ్యం : బి.వి.రాఘవులు
అమరావతి : బీహార్‌లో ఓటర్ల నమోదు పేరుతో ఎన్నికల కమిషన్ దొడ్డిదారిన పౌరసత్వ గుర్తింపు ప్రక్రియను చేపట్టిందని సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు విమర్శించారు విజయవాడ బాలోత్సవ భవన్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో సీపీఐ(ఎం) ఏపీ రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావుతో కలిసి ఆయన మాట్లాడుతూ ఎన్నికల కమిషన్ కేంద్రంలోని బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని అన్నారు. సుప్రీం కోర్టులో కేసు ఉండగానే ఇతర రాష్ట్రాలకు బీహార్ తరహా ఓటర్ల నమోదు ప్రక్రియ చేపట్టాలని లేఖలు పంపించిన విషయాన్ని ఆయన పేర్కొన్నారు. తక్షణం ఇటువంటి చర్యలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. బీహార్లో తాము చేపట్టిన ఎస్‌ఐఆర్‌లో నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ ప్రజలు ఉన్నట్టు తేలిందని ఎన్నికల కమిషన్ ప్రకటించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఓటర్ల నమోదు ప్రక్రియకు పరిమితం కాకుండా పౌరసత్వ గుర్తింపు చేపట్టినట్టు ప్రకటనలు చేయడం సరికాదని తెలిపారు. సుప్రీం కోర్టు సూచనలకు అనుగుణంగా ఒటర్ల నమోదు ప్రక్రియ చేపట్టాలని అన్నారు 28వ తేదీ నాటి విచారణ ఏమవుతుందో తేలకముందే బీహార్ తరహా ఎస్‌ఐఆర్ చేపట్టాలని అన్ని రాష్ట్రాలకు ఎన్నికల కమిషన్ సూచించడం బీజేపీ అనుకూల చర్య తప్ప మరొకటి కాదని చెప్పారు.. ఎన్నికల కమిషన్ హడావుడి రాజ్యాంగ వ్యవస్థలపై ప్రజలకు నమ్మకం లేకుండా చేసే విధంగా ఉందని పేర్కొన్నారు.
అమెరికాతో ఒప్పందం రైతాంగానికి నష్టం
మన దేశంపై ఒత్తిడి చేసి తనకు అనుగుణంగా మార్చుకునేందుకు అమెరికా ప్రయత్నిస్తోందని చెప్పారు. దీనిలో భాగంగానే సుంకాలకు సంబంధించి మరో దఫా చర్చలు జరుగుతున్నాయన్నారు. ప్రస్తుతం జన్యు పరమైన మార్పులు చేసిన విత్తనాలను దేశంలోకి అనుమతించడం లేదని, గోధుమలు, మొక్కజొన్నలు, సోయాను జీఎం పంటలతో సహా జీఎం విత్తనాలను దిగుమతి చేసుకోవాలని అమెరికా ఒత్తిడి చేస్తోందని చెప్పారు. కేంద్రం తలొగ్గినట్లు వార్తలు వస్తున్నాయని, అదే జరిగితే రైతాంగానికి మరణ శాసనం అవుతుందని పేర్కొన్నారు. డైరీ ఉత్పత్తుల దిగుమతి వల్ల ఎనిమిది కోట్ల మంది పాలఉత్పత్తి దారులు దెబ్బతింటారని చెప్పారు. స్టీలు, అటోమొబైల్, ఫార్మాకు ఆంక్షలు పెడుతున్నారని తెలిపారు. మల్టీ ప్రొడక్ట్ రిటైల్‌లోకి కార్పొరేట్ కంపెనీలు వస్తే దేశంలో వ్యాపారులు నష్టపోతారని పేర్కొన్నారు. డిజిటల్ డేటాను స్వేచ్చగా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తోందన్నారు. ఇటువంటి ప్రమాద కరమైన నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తెచ్చేదిశగా కార్యాచరణ చేపట్టాలని సీపీఐ(ఎం) నిర్ణయించిందని వివరించారు.
పవన్ యోగనిద్రలో ఉన్నారు
రాజ్యాంగం ప్రకారం అన్ని భాషలూ సమానమని బి.వి.రాఘవులు తెలిపారు. హిందీని అనుసంధాన భాషగా ప్రోత్సహించాలేగానీ బలవ ంతంగా రుద్దకూడదని పేర్కొన్నారు. పవన్ బీజేపీకి లొంగిపోయి ఎలా చెప్పాలో అర్థంగాక భాషలను చిన్నమ్మ, పెద్దమ్మగా వర్ణించారని పేర్కొన్నారు.