Tuesday, July 15, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంరాష్ట్రవ్యాప్త పోరాటానికి వికలాంగులు సన్నద్ధం

రాష్ట్రవ్యాప్త పోరాటానికి వికలాంగులు సన్నద్ధం

- Advertisement -

– 17న కలెక్టరేట్లు, 23న సెర్ఫ్‌ కార్యాలయం ముట్టడి
– ప్రభుత్వం వికలాంగులకిచ్చిన వాగ్దానాలు అమలు చేయాలి
– పెన్షన్‌ రూ. ఆరు వేలకు పెంచాలి : ఎన్‌పీఆర్‌డీ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

‘ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌ పార్టీ వికలాంగుల పింఛన్‌ను రూ. ఆరు వేలకు పెంచుతామనీ, ఇతర సమస్యలు పరిష్కరిస్తామంటూ ఇచ్చిన వాగ్దానాలను విస్మరిస్తున్నది. అధికారంలోకొచ్చి 18నెలలు కావస్తున్నప్పటికీ మాట నిలబెట్టుకోవటంలో విఫలమయింది. దీంతో వికలాంగుల సమస్యలు ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందంగా తయారయ్యాయి. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే స్పందించాలి. లేదంటే ఉద్యమం తప్పదు’ అంటూ వక్తలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ‘స్థానిక సంస్థల్లో వికలాంగులకు ప్రాతినిధ్యం కల్పిస్తూ అసెంబ్లీలో చట్టం చేయాలి. వికలాంగుల కార్పొరేషన్‌ను బలోపేతం చేయాలి.’ అనే అంశంపై కె వెంకట్‌ అధ్యక్షతన రౌండ్‌ టేబుల్‌ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సంఘం కోశాధికారి ఆర్‌ వెంకటేశ్‌ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. వారి సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 17న కలెక్టర్‌ కార్యాలయాలతో పాటు ,23న సెర్ఫ్‌ కమిషనర్‌ కార్యాలయాన్ని ముట్టడించాలని నిర్ణయించారు.


సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు టి జ్యోతి మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరు గ్యారెంటీల అమలుతో ప్రజాపాలన పారదర్శకంగా సాగుతున్నదని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారు కదా!.. వాటిల్లో వికలాంగుల పింఛన్‌ అంశం లేదా? అని ప్రశ్నించారు. ఎన్‌పీఆర్‌డీ ప్రవేశపెట్టిన తీర్మానంలో న్యాయమైన డిమాండ్లు ఉన్నాయన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలైనా వీరి సమస్యలు పరిష్కరించటానికి మనుసు రాలేదా? అని ప్రశ్నించారు. పక్క రాష్ట్రంలో అమలు జరుగుతున్నప్పుడు.. ఇక్కడ అమలు చేయకపోవటం విడ్డూరంగా ఉందని అన్నారు. వారి సమస్యలను ఎప్పుడు అమలు చేస్తారో చెప్పాలని నిలదీశారు. పెరుగుతున్న ధరలతో పోల్చినప్పుడు రూ. నాలుగు వేలతో బతకడం సాధ్యమా? అవి కూడా నెలనెలా రావటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కండరాల క్షీణతకు సంబంధించిన వారి గురించి ప్రభుత్వం ఆలోచించాలని సూచించారు. మంచానికే పరిమితమవుతున్నారనీ, వారి దుస్థితి దయనీయంగా ఉందని చెప్పారు. తమిళనాడు, రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో స్థానిక సంస్థల్లో వికలాంగులకు నామినేటెడ్‌ పదవులు కల్పిస్తూ అసెంబ్లీలో చట్టాలు చేశారని గుర్తు చేశారు. తెలంగాణ పంచాయతీరాజ్‌ చట్టం 2018, తెలంగాణ మున్సిపాలిటీ చట్టం 2019లకు సవరణలు చేసి ప్రతి స్థానిక సంస్థల్లో ఇద్దరు వికలాంగులను నామినేటెడ్‌ చేయడానికి అసెంబ్లీలో చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్‌పీఆర్‌డీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.అడివయ్య మాట్లాడుతూ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పింఛన్‌ను పెంచి, 2024 డిసెంబర్‌ నుంచి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.


కాంగ్రెస్‌ పార్టీ ప్రారంభించిన ప్రజాపాలనలో చేయూత పింఛన్ల కోసం 24.85 లక్షల మంది దరఖాస్తులు చేసుకుంటే హెచ్‌ఐవీ బాధితులకు మాత్రమే మంజూరు చేసి చేతులు దులుపుకున్నారని తెలిపారు. మిగతా వాళ్లకు పింఛన్లు ఎందుకు పెంచడం లేదో చెప్పాలని నిలదీశారు. వాగ్దానాన్ని అమలు చేయకుండా వికలాంగులను మోసం చేయాలని చూస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. పింఛన్‌ రూ. ఆరు వేలకు పెంచి, 2024 జనవరి నుంచి అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. తీవ్ర వైకల్యం కలిగిన వికలాంగులకు రూ. 20వేల ప్రత్యేక అలవెన్స్‌ మంజూరు చేయాలని కోరారు. వికలాంగుల కో ఆపరేటివ్‌ కార్పొరేషన్‌లో రాష్ట్ర విభజన జరిగిన తర్వాత సుమారు 130మంది ఉద్యోగులు ఉన్నారనీ, గడిచిన 11 ఏండ్లలో ఆ సంఖ్య 40కి పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. దీన్ని బట్టే వికలాంగుల పట్ల ప్రభుత్వ చిత్తశుద్ధి అర్థమవుతుందని చెప్పారు. కార్పొరేషన్‌ ద్వారా ప్రభుత్వం అందిస్తున్న అన్ని రకాల సహాయ పరికరాలు ఉత్పత్తి చేయడానికి అవకాశం ఉందనీ, కానీ ప్రభుత్వానికి కార్పొరేషన్‌ను బలోపేతం చేయాలనే ఆలోచన లేకపోవడం వల్ల అది నిర్వీర్యమయ్యే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.
కార్పొరేషన్‌ను బలోపేతం చేయాలని డిమాండ్‌ చేశారు. ఎన్‌పీడీవో రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాస్‌ మాట్లాడుతూ స్థానిక సంస్థల్లో వికలాంగులకు రిజర్వేషన్ల ద్వారా ప్రాతినిధ్యం కల్పిస్తే..ఒక్క పైసా ఖర్చు కాదని చెప్పారు. చట్టాలను అమలు చేయటంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. టీడీపీ రాష్ట్ర నాయకులు సాయిబాబ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో క్యాడర్‌ స్ట్రెంత్‌ ప్రకారం వికలాంగుల ఉద్యోగాలను గుర్తించి, వాటి భర్తీ కోసం ప్రత్యేక నోటిఫికేషన్‌ విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. హిమోఫిలియా సొసైటీ అధ్యక్షులు రామారావు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం జరిగే పోరాటంలో భాగస్వాములు కావాలన్నారు. కార్యక్రమంలో మేడ్చల్‌ జిల్లా అధ్యక్షులు చంద్రమోహన్‌, కార్యదర్శి కె నాగలక్ష్మి, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు భుజంగారెడ్డి, కార్యదర్శి జెర్కొని రాజు, హైదరాబాద్‌ సౌత్‌ జిల్లా గౌరవాధ్యక్షురాలు పి శశికళ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -