Tuesday, July 15, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంస్వాతంత్య్ర పోరాటంలో మైనారిటీల పాత్ర మరువలేనిది

స్వాతంత్య్ర పోరాటంలో మైనారిటీల పాత్ర మరువలేనిది

- Advertisement -

దేశం కోసం ఉద్యోగాలు, ఆస్తులు త్యాగం
ఆవాజ్‌ రాష్ట్ర మూడో మహాసభలో ఎండి.అబ్బాస్‌
నవతెలంగాణ – జోగులాంబ గద్వాల

దేశ స్వాతంత్య్ర పోరాటంలో, తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో మైనార్టీలు నిర్వహించిన పాత్ర మరువలేనిదని, వారి త్యాగాలు వెలకట్టలేనివని ఆవాజ్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి అబ్బాస్‌ అన్నారు. ఆవాజ్‌ రాష్ట్ర మూడో మహాసభ సందర్భంగా జిల్లా కేంద్రంలోని స్థానిక ప్యారడైజ్‌ ఫంక్షన్‌ హాల్లో సోమవారం ”భారత స్వాతంత్య్ర ఉద్యమం మైనారిటీల పాత్ర” అనే అంశంపై నిర్వహించిన సెమినార్‌లో ఆయన ప్రసంగించారు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో సరిహద్దు గాంధీగా పేరుపొందిన అబ్దుల్‌ గఫార్‌ఖాన్‌, టిప్పు సుల్తాన్‌తోపాటు ఆబాది బానోబేగం, హాజరా బేగం వంటి మహిళలు కూడా నాటి స్వాతంత్య్ర సమరయోధుల పిలుపునందుకుని ఉద్యమంలో పాల్గొన్నారని తెలిపారు.
తమ ఉద్యోగాలకు రాజీనామాలు చేసి.. ఆస్తులను సమాజానికి దానం చేసి స్వాతంత్య్ర పోరాటంలో పాలుపంచుకున్నారని వివరించారు. మైనారిటీలు బ్రిటీష్‌ వారికి వ్యతిరేకంగా, సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాలు చేశారని గుర్తు చేశారు. ఈస్ట్‌ ఇండియా కంపెనీ దేశ ప్రజలపై విధించిన అధిక పన్నులు, దోపిడీ పీడనకు వ్యతిరేకంగా కులాలు మతాలు ప్రాంతాలకు అతీతంగా ప్రజలను సంఘటితపరిచారని తెలిపారు. ఆంగ్లేయులను భరతభూమి నుంచి పూర్తిగా తరిమికొడితేగానీ దోపిడీ పీడన నుంచి విముక్తి లేదంటూ.. రాజ్య క్షేమం, ప్రజల సౌభాగ్యాన్ని ఆకాంక్షిస్తూ సామ్రాజ్యవాదంపై సమర శంఖం పూరించి చివరి వరకు నిలబడిన పోరాటయోధులని కొనియాడారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో నిజాం నవాబుకు వ్యతిరేకంగా షోయబుల్లాఖాన్‌ షేక్‌ బందగి వంటి వీరులు పోరాడి ప్రాణం కోల్పోయారని గుర్తుచేశారు. పెట్టుబడిదారి విధానాలకు వ్యతిరేకంగా.. స్వాతంత్య్ర ఉద్యమ స్ఫూర్తితో ప్రజలను, కార్మికులను ఐక్యం చేసి సహజ వనరుల రక్షణ, రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడుదామన్నారు.
ఈ సభలో స్వాతంత్య్ర సమరయోధుల ఎగ్జిబిషన్‌ను రిటైర్డ్‌ ప్రిన్సిపాల్‌ జలిల్‌, రాష్ట్ర ఉపాధ్యక్షులు అతికూర్‌ రెహమాన్‌, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఏ.వెంకటస్వామి సీపీఐ జిల్లా కార్యదర్శి బి.ఆంజనేయులు, పాలమూరు అధ్యయన వేదిక ఇక్బాల్‌ పాషా, కురువ పల్లయ్య, రెడ్‌క్రాస్‌ సొసైటీ ఉపాధ్యక్షులు తహెర్‌, నాయకులు రంగు మదిలేటి, ఆంజనేయులు, స్వేరోస్‌ సునందం, వీవీ నరసింహ, ఉప్పేర్‌ నరసింహ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -