– భవనంపై నుంచి దూకడంతో తీవ్ర గాయాలు
నవతెలంగాణ-చౌటుప్పల్‌రూరల్
గురుకుల పాఠశాల భవనంపై నుంచి కిందకు దూకి విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన సోమవారం ఉదయం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం తూప్రాన్‌పేట గ్రామంలోని మహాత్మాజ్యోతిరావు పూలే బీసీ వెల్ఫేర్ బాలికల హాస్టల్(అంబర్‌పేట)లో జరిగింది. సర్కిల్ ఇన్‌స్పెక్టర్ మన్మధకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. జోగులాంబ గద్వాల జిల్లా మక్తల్ మండలం విఠలాపురం గ్రామానికి చెందిన వి.సంధ్య(10) తూప్రాన్‌పేటలోని మహాత్మాజ్యోతిరావు పూలే బీసీ గురుకుల బాలికల పాఠశాలలో ఐదో తరగతి చదువుతోంది.కొత్త విద్యార్థినులకు పాఠశాలలో హోమ్ సిక్ హాలిడేస్ ఇవ్వడంతో తల్లిదండ్రులు సంధ్యను స్వగ్రామానికి తీసుకెళ్లారు. ఆదివారం మధ్యాహ్నం తిరిగి హాస్టల్‌కు సంధ్యను ఆమె తల్లి తీసుకొచ్చి వదిలిపెట్టారు. రాత్రి స్టడీ అవర్ తర్వాత విద్యార్థినులు వారి వారి గదుల్లోకి వెళ్లి పడుకున్నారు. ఆ తర్వాత సంధ్య పాఠశాల భవనంపై నుంచి కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంది. సోమవారం తెల్లవారుజామున వాచ్‌మెన్ చూడటంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. మృతదేహాన్ని చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
గురుకులంలో విద్యార్థిని ఆత్మహత్య
- Advertisement -
- Advertisement -