రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన వెంటనే పెట్టుబడిదారీ వ్యవస్థ మనుగడే సంక్షోభంలో పడింది. దాని నుండి బయట పడడానికి అది ఒక ద్విముఖ వ్యూహాన్ని అనుసరించింది. మొదటిది: ”ఎర్ర” ప్రమాదం ముంచు కొస్తోందన్న భయాన్ని రెచ్చగొట్టింది. వాస్తవానికి అలా భయపెట్టడానికి ఎటువంటి ప్రాతిపదికా లేదు. దేశీయ కార్మికవర్గాన్ని భయోత్పాతానికి గురిచేసి వారు పెట్టుబడిదారీ వ్యవస్థకు తలొగ్గి నడుచుకునేలా చేయడమే దీని అసలు ఉద్దేశ్యం. ఇక రెండవది: పెట్టుబడిదారీ వ్యవస్థ బతికి బట్టకట్టాలంటే అందుకోసం తప్పనిసరిగా కొన్ని చర్యలను చేపట్ట వలసి వచ్చింది. ఆ చర్యల్లో నాలుగింటిని ఇక్కడ ప్రధానంగా పేర్కొనాలి. తమ ఆధీనంలో ఉన్న వలస దేశాలకు స్వ తంత్రం ఇచ్చినట్టు ప్రకటించడం, సార్వత్రిక ఓటు హక్కును అమలు చేసి ప్రజాస్వామ్య పరిపాలనను చేపట్టడం, భారీ స్థాయిలో ఉన్న నిరుద్యోగాన్ని కీన్స్ సూచించిన విధానం అమలు ద్వారా అదుపు చేయడం (కీన్షియన్ డిమాండ్ మేనేజ్ మెంట్ – ప్రభుత్వ వ్యయాన్ని భారీగా పెంచి ఉద్యోగావకాశాలు కల్పించడం, తద్వారా కొనుగోలు శక్తిని పెంచడం), ముఖ్యంగా పశ్చిమ యూరప్ దేశాల్లో సంక్షేమరాజ్య చర్యలను అమలు చేయడం-ఇవే ఆ నాలుగు చర్యలు. ఈ చర్యలు ఎంత ప్రాధాన్యత కలిగివున్నాయంటే, వాటి ఫలితంగా ప్రజల్లో పెట్టుబడిదారీ విధానపు స్వభావమే మారిపోయిందన్న అభిప్రాయం కలిగింది. అంతకు పూర్వ ఉండిన ”కొల్లగొట్టే” దోపిడీ వ్యవస్థ స్థానంలో ”ప్రజా సంక్షేమాన్ని పట్టించుకునే పెట్టుబడిదారీ విధానం” వచ్చిందన్న భావన ఏర్పడింది.
యుద్ధానంతరం దీర్ఘకాల వ్యవధిలో పెట్టుబడిదారీ వ్యవస్థ బలపడింది. ద్రవ్య పెట్టుబడి ప్రధాన శక్తి అయింది. దాని ఫలితంగా ద్రవ్య పెట్టుబడి ప్రపంచవ్యాప్త సంచారం మొదలైంది. దాని పర్యవసానంగా జాతి రాజ్యాల స్వయం నిర్ణయాధికారం కుదించుకుపోయి, అన్నిచోట్లా నయా ఉదారవాద విధానాల అమలు మొదలైంది. దాంతో యుద్ధానం తరం వెంటనే చేపట్టిన చర్యలన్నింటినీ తిరగదోడడం ప్రారంభించారు. ఇప్పుడు ఆ తిరగదోడే వేగం గతంలో ఎన్నడూ లేనంతగా పుంజుకుంది. సామ్రాజ్యవాద దేశాల దన్నుతో అత్యంత దారుణంగా పాలస్తీనా జాతిని సామూహికంగా అంతం చేయడానికి ఏమాత్రమూ వెరపు లేకుండా పూనుకోవడం వలసపాలనా కాలంలో జరిగిన దారుణాలకు ఏ మాత్రమూ తీసిపోదు. నయా ఫాసిస్టు శక్తుల విజృంభణతో బూర్జువా నియంతృత్వం ప్రజానీకానికి ఉన్న ప్రజాస్వామిక హక్కులను కాలరాస్తోంది. ప్రస్తుతం పెట్టుబడిదారీ వ్యవస్థ అంతర్జాతీయంగా ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభం నుంచి బైట పడడానికి ‘కీన్షియన్ డిమాండ్ మేనేజ్‌మెంట్’ వ్యూహం అమలు చేయగల పరిస్థితి లేదు. అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఆధిపత్యమే దీనికి కారణం. ఇప్పుడు పనిగట్టుకుని అన్ని చోట్లా సంక్షేమ విధానాల నన్నింటినీ తిరగదోడుతున్నారు. తద్వారా మిగిలే ఆర్థిక వనరులను నేరుగా పెట్టుబడిదారులకు బదలాయిస్తున్నారు. లేదా సైనిక వ్యయాన్ని పెంచడానికి ఉపయోగిస్తున్నారు.
డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన ”పెద్ద, అందమైన బిల్లు”ను అమెరికాలోని ఉభయ సభలూ ఆమోదించాయి. దాంతో అది ఇప్పుడు చట్టమై కూర్చుంది. ఆ చట్టం సంక్షేమం మీద భారీస్థాయిలో దాడిని తలపెట్టింది. ఆ చట్టం రానున్న పదేండ్ల కాలంలో 4.5 లక్షల కోట్ల డాలర్ల మేరకు పన్ను రాయితీలను ప్రతిపాదించింది. దాని వలన ప్రధానంగా లబ్ధి పొందేది సంపన్నులే. దానికి తోడు సైనిక వ్యయాన్ని 15వేల కోట్ల డాలర్ల మేరకు ప్రతీ ఏడూ పెంచుతారు. సరిహద్దుల కాపలా కోసం (వలసదారుల ప్రవేశాన్ని అడ్డుకోడానికి) 12,900 కోట్ల డాలర్ల వ్యయం చేస్తారు. ఈ అదనపు ఖర్చులను చేయడానికి వైద్య సహాయం బడ్జెట్‌లో 93వేల కోట్ల డాలర్లు, పర్యావరణహిత విద్యుత్తు బడ్జెట్‌లో 48,800 కోట్ల డాలర్లు, ఆహార సబ్సిడీలలో 28,700 కోట్ల డాలర్లు కోతలు పెడతారు. వృద్ధులు, పేదలు, వికాలంగులు వంటి అత్యంత బలహీన తరగతుల ప్రజానీకపు వైద్యానికి చేసే సహాయంలో కోత పెట్టడం అంటే అత్యంత నిస్సహాయుల్ని నిర్దాక్షిణ్యంగా దెబ్బ తీయడమే. ట్రంప్ తెచ్చిన ‘పెద్ద, అందమైన బిల్లు” కడు పేదల నుండి అత్యంత సంపన్నులకు సంపదను బదలాయిం చడం కోసమే వచ్చింది.
అయితే, పేదల సంక్షేమంలో పెట్టిన కోతలకన్నా సంపన్నులకు ఇచ్చే పన్ను రాయితీలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీని వలన అమెరికా బడ్జెట్ ద్రవ్యలోటు రానున్న పదేండ్లలో 3.4 లక్షల కోట్ల డాలర్ల మేరకు అదనంగా పెరుగుతుంది. ఈ లోటును పూడ్చడం కోసం ప్రభుత్వం అప్పులు చేయాలి. వాటిని తీర్చడం పేరుతో పేదల సంక్షేమానికి మరిన్ని కోతలు పెడతారు. ఇదంతా ఆర్థిక వ్యవస్థ పునరుజ్జీవం కోసమేనంటూ సమర్ధిం చుకుంటున్నారు. నిజంగా ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం కోసమే అయితే, ప్రభుత్వం అప్పు చేసి తెచ్చిన ధనాన్నంతటినీ ప్రభుత్వమే ఖర్చు చెయ్యాలి. కాని ఆ సంపదనంతటినీ ధనవంతుల చేతుల్లో పెడుతోంది. అంటే కొనుగోలు శక్తిని ధనవంతులకు పెంచుతోంది. దాని ప్రభావంతో ఆర్థిక వ్యవస్థ కోలుకోవడం అనేది జరగదు. ఎందుకంటే ఆ ధనవంతులు అదనంగా కొనుగోలు చేసేదేమీ ఉండదు. ఇదంతా ఆ సంపన్నులను మరింత సంతృప్తి పరచడం కోసమే జరుగుతోంది.
ఇక్కడ ఒక సందేహం తలెత్తుతుంది. ద్రవ్య పెట్టుబడికి భారీ బడ్జెట్ లోటు ఉండటమనేది ఏమాత్రమూ అంగీకారం కాదు. ఒకవేళ భారీ లోటు ద్వారా సంపన్నులకు ధనాన్ని బదలాయించినా, బడ్జెట్ లోటు పెరగడం ద్రవ్య పెట్టుబడికి నచ్చదు. మాజీ బ్రిటిష్ ప్రధాని లిజ్ ట్రస్ ఇదే పద్ధతిని అమలు చేయడానికి పూనుకున్నారు. అప్పుడు ఎంత ఎక్కువ వ్యతిరేకత వచ్చిందంటే బ్రిటిష్ పౌండు విలువ అమాంతం పడిపోయి, లిజ్ ట్రస్ రాజీనామా చేయాల్సి వచ్చింది. బ్రిటన్ చరిత్రలోనే అత్యంత తక్కువ కాలం ప్రధానిగా ఉన్న వ్యక్తిగా ఆమె చరిత్ర పుటల్లోకెక్కారు. యాభై రోజులకు మించి ఆమె పదవిలో కొనసాగలేకపోయారు. అటువంటప్పుడు అదే ద్రవ్య పెట్టుబడి డొనాల్డ్ ట్రంప్‌ను మాత్రం ఎందుకు కొనసాగనిస్తుంది?
ఇప్పుడు అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి బడ్జెట్ లోటును భారీగా పెంచడానికి ట్రంప్‌ను అనుమతిస్తుందా అన్నది ప్రశ్న. బడ్జెట్ లోటును ఇంకా తగ్గించమని పట్టుబడుతుందా? సంపన్నులకు అందించే తాయిలాలలో కోతలు పెట్టమని కోరకపోవచ్చు కాని పేదల సంక్షేమానికి చేసే ఖర్చులో మరింత కోత పెట్టమని పట్టుబట్టవచ్చు. ఐతే అమెరికన్ డాలర్ ప్రస్తుతం చెలాయిస్తున్న ఆధిపత్యం కారణంగా ట్రంప్‌కు కొంత వెసులుబాటు ఉండవచ్చు. ఈ మాదిరి వెసులుబాటు బ్రిటిష్ పౌండుకు లేదు. ప్రపంచ సంపదలో ఎక్కువ భాగాన్ని తమ చెప్పుచేతల్లో ఉంచుకున్న వారు ఇప్పటికీ డాలర్ అంటే బంగారంతో దాదాపు సమానమే అని భావిస్తున్నారు. ఇటువంటి సదుపాయం లిజ్ ట్రస్‌కు లేకపోయింది.
ఇప్పుడు అమెరికాలో సంక్షేమ పద్దులకు మొదలైన కోతలు త్వరలోనే సంపన్న పెట్టుబడిదారీ దేశాలన్నింటికీ వ్యాపిస్తాయి. జూన్ 24, 25 తేదీల్లో ది హేగ్ లో జరిగిన నాటో దేశాల శిఖరాగ్ర సమావేశంలో 2035 నాటికి నాటో సభ్య దేశాలన్నీ తమ జీడీపీలో ఐదు శాతం సైనిక వ్యయానికి కేటాయించాలని తీర్మానించాయి. ప్రస్తుతం అది రెండు శాతం మాత్రమే ఉంది. కొన్ని దేశాల్లో ఆ మాత్రం కూడా లేదు. అంటే నాటో సభ్య దేశాలన్నీ రాబోయే పదేండ్లలో తమ సైనిక వ్యయాన్ని ఇప్పుడున్న రెండు నుండి ఐదు శాతానికి పెంచుతాయన్నమాట.
తక్కిన నాటో దేశాల కరెన్సీలు అమెరికన్ డాలర్ మాదిరి ఆధిపత్యాన్ని కలిగిలేవు. అందుచేత ఆ దేశాలు తమ బడ్జెట్‌లలో లోటును పెంచి తద్వారా సైనిక వ్యయాన్ని పెంచడం కుదరదు. దానికి అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఒప్పుకోదు. పైగా చాలా నాటో దేశాలు యూరోపియన్ యూనియన్ సభ్యదేశాలుగా కూడా ఉన్నాయి. ఇ.యు. చట్టం ప్రకారం ఆ దేశాలేవీ తమ బడ్జెట్ లోటును మూడు శాతానికి మించి పెంచకూడదు. ఇప్పటికే ఆ పరిమితికి చాలా దేశాలు చేరుకున్నాయి. ఇక సంపన్నుల మీద అదనపు పన్నులు వేయడం ఎలానూ కుదరదు. కనుక సైనిక వ్య యాన్ని పెంచాలంటే శ్రామిక ప్రజలను బలి పెట్టడం ఒక్కటే వారి ముందున్న మార్గం. వారి మీద అదనపు పన్నులు విధించడం ద్వారానో, లేక సంక్షేమ వ్యయాన్ని తగ్గించడం ద్వారానో, రెండింటినీ జమిలిగా అమలు చేయడం ద్వారానో అది జరుగుతుంది.
అన్నింట్లోకీ సంక్షేమ పద్దులకు కోత పెట్టడం తేలిక. ఏ పద్ధతిని అనుసరించినా, అంతిమంగా అది శ్రామిక ప్రజల కొనుగోలుశక్తి దిగజారిపోవడానికే దారి తీస్తుంది. ఇప్పుడున్నదాని కన్నా జీడీపీలో మూడు శాతం భారాన్ని అదనంగా శ్రామిక వర్గం మీద మోపడం అంటే అది చాలా ఎక్కువ మోతాదు. ఒక విధంగా చెప్పాలంటే నాటో సభ్య దేశాలు సంక్షేమ విధానాలను అమలు చేసే పెట్టుబడిదారీ వ్యవస్థకు కాలం చెల్లిందని ప్రకటించాయని అనుకోవాలి. అంటే మళ్ళీ ”కొల్లగొట్టి దోచుకునే” పెట్టుబడిదారీ విధానంలోకి ప్రపంచం మళ్లుతోంది.
ఇంతకూ ఇప్పుడు సైనిక వ్యయాన్ని పెంచడానికి నాటో దేశాలు ఎందుకు తయారౌతు న్నాయి? పశ్చిమ యూరప్‌కు రష్యా నుండి ప్రమాదం పొంచివుందన్న సాకు ఎటూ ఉండనే వుంది. ప్రచ్ఛన్న యుద్ధం కాలంలో కూడా సోవియట్ యూనియన్ నుంచి యుద్ధ ప్రమాదం ఉందని ప్రచారం చేసి తమ సైనిక వ్యయాన్ని పెంచడాన్ని సమర్ధించుకున్నారు. కాని మొత్తం నాటో దేశాలన్నింటి సైనిక వ్యయంతో పోల్చి చూసినా, రష్యా సైనిక వ్యయం అందులో మూడో వంతు కూడా లేదు. అంటే రష్యన్ బూచిని చూపడం వట్టి బూటకం మాత్రమే. పశ్చిమ సంపన్న దేశాల్లో పెట్టుబడిదారీ వ్యవస్థ కుప్పకూలకుండా నిరోధించాలంటే తమకు సవాలుగా పరిణమించే అవకాశం ఉన్న దేశాలను సైనిక బలంతో బెదిరించి ఎదుర్కోవడమే మార్గమని అవి భావిస్తున్నాయి. ఇరాన్ మీద బాంబుల దాడి వెనుక ప్రేరణ ఈ ఆలోచనే. రాబోయే కాలంలో ఇటువంటి దాడులు మరిన్నింటిని చూస్తాం.
ఇటువంటి దాడులకు సన్నద్ధం కావడానికి ఈ పశ్చిమ సంపన్న దేశాలు తమ తమ దేశాల కార్మిక వర్గం ఇంతవరకూ అనుభవిస్తున్న సంక్షేమ పథకాలను బలి చేయనున్నాయి. కుప్పకూలే స్థితిలో ఉండే సామ్రాజ్యవాదం అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే అది మొత్తం ప్రపంచాన్నే వినాశనానికి గురి చేయగలదు. బేఖాతరుగా ఇరాన్ మీద కురిపించిన బాండుల వర్షం దీనికి ఉదాహరణ. అందుచేత ప్రపంచం మొత్తం మీద ప్రజానీకానికి ఈ సామ్రాజ్య వాదపు ప్రమాదం ఎంత తీవ్రమైనదో వివరించి ప్రతిఘటించే దిశగా నడిపించడం నేడు అత్యంత ప్రాధాన్యత కలిగిన కర్తవ్యంగా ముందుకొచ్చింది.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్ పట్నాయక్
పెట్టుబడిదారీ వ్యవస్థ – సంక్షేమానికి కోత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES