మస్క్ పార్టీతో అమెరికా ప్రజలకు ఒరిగేదేంటి?
ట్రంప్ ప్రతీకారచర్యలతో మస్క్ కంపెనీలు డౌన్‌ఫాల్
ఇద్దరివీ స్వీయ ఆర్థిక ప్రయోజనాలే…
2028లోనే అధ్యక్ష ఎన్నికలు
సంఘమిత్ర
సంపద అంతిమలక్ష్యం అధికారమే. పెట్టుబడిదారీ వ్యవస్థలో ప్రపంచవ్యాప్తంగా నిరూపితమైంది ఇదేే! ఇప్పుడు అమెరికా రాజకీయాల్లోనూ ఇదే జరుగుతున్నది. వ్యాపారవేత్తలైన అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్‌ల ఇద్దరి లక్ష్యం ఒక్కటే. అధికారాన్ని అడ్డం పెట్టుకొని మరింత సంపదను ఎలా పోగేసుకోవాలనేదే లక్ష్యం. రాజకీయంగా తీసుకొనే ప్రతి నిర్ణయం వెనుక ‘నాకేంటి?’ అనే స్వప్రయోజన కాంక్షే. ట్రంప్, మస్క్ ఇద్దరికీ ప్రత్యేకించి సిద్ధాంతాలు, ప్రజల కష్టసుఖాలు వంటి బాధ్యతలేం లేవు. ప్రజలతో వ్యాపారం ఎలా చేయాలా అనే ఉమ్మడి అజెండా తప్ప! అధ్యక్షుడు ట్రంప్ గొప్పగా చెప్పుకున్న ‘బిగ్ బ్యూటిఫుల్ బిల్’ అమెరికా పార్లమెంట్ ఆమోదం పొందగానే, ప్రపంచకుబేరుడు ఎలెన్ మస్క్ ‘అమెరికా పార్టీ’ని ప్రకటించారు. ఇక్కడి వరకు బాగానే ఉంది. అసలు అమెరికాలో మూడోపార్టీ మనగల్గుతుందా అనే చర్చ ఇప్పుడు చర్చనీయాంశమైంది.
భారీ నష్టం
మస్క్ పార్టీని ప్రకటించగానే ఆయన కంపెనీల షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. ఆయన కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్‌లో దాదాపు రూ.5.8 లక్షల కోట్లు ఆవిరైపో యింది. ముఖ్యంగా టెస్లా షేర్లు 27 శాతం నష్టపోయాయి. మస్క్ నికర సంపద రూ.1.31 లక్షల కోట్లకు తగ్గింది. అయితే ఈ సొమ్మేం మస్క్ స్వయంగా కష్టపడి సంపాదించిందేం కాదు. ఆయన కంపెనీల్లో ప్రజలు పెట్టిన పెట్టుబడివాటాలు. మస్క్‌పై నమ్మకం కంటే, ట్రంప్ ప్రతీకారచర్యలు ఎలా ఉంటాయో అనే భయంతోనే ఇన్వెస్టర్లు తమ వాటాలను తెగనమ్ముకున్నారు. దీనితో మస్క్ రాజకీయ భవిష్యత్‌కు ఇదో నమూనాగా మారిందనేది అంతర్జాతీయ రాజకీయ విశ్లే షకుల అభిప్రాయం. ఎప్పుడైతే కంపెనీల షేర్లు ఢమాల్న పడి పోయాయో, మస్క్ అనూహ్యంగా పొలిటికల్‌గా సైలెంట్ అయి పోయారు. రాజకీయపార్టీ ప్రకటన తర్వాత ఆయన ట్రంప్‌నకు వ్యతిరే కంగా పెద్దగా ఎలాంటి సంచలన వ్యా ఖ్యలు చేయలేదు.ఈ వ్యవహార మంతా ఇద్దరు మొండోళ్ల మధ్య జరిగిన వ్యాపార లావాదేవీగా కనిపిస్తున్నదే తప్ప, ఆ దేశానికి కానీ, ఆ దేశ ప్రజలకు కానీ ఒనగూరే ప్రయోజనం ఏమీలేదనేది నిర్వివాదాంశం.
అప్పుడలా…
ట్రంప్‌ను రెండోసారి అమెరికా పీఠం ఎక్కించడంలో ఎలెన్ మస్క్ పోషించిన పాత్ర తక్కువేం కాదు. తన సోషల్‌మీడియా ‘ఎక్స్’ను ట్రంప్ గెలుపునకు ప్రచార సాధనంగా శక్తివంతంగా ఉప యోగించాడు. దీనికి ప్రతిఫలంగా ట్రంప్ గెలిచాక మొదటి వంద రోజులు మస్క్‌కు అంతే స్థాయిలో ప్రాధాన్యత ఇచ్చాడు. ప్రభుత్వ ఖర్చుల్ని నియంత్రించే కొత్త విభాగాన్ని (డోజ్) ఏర్పాటు చేసి, దానికి మస్క్‌ను అధిపతిని చేసాడు. ఇతర దేశాల కార్ల దిగుమతులపైన 25శాతం సుంకాలు విధించాడు. దీనివల్ల జపాన్, దక్షిణకొరియా, జర్మనీ కార్ల మార్కెట్ పడిపోయి టెస్లా కారుకు డిమాండ్ పెరిగే విధంగా అమెరికా అధ్యక్షుడి హోదాలో ట్రంప్ వ్యాపార నిర్ణయం తీసుకు న్నారు. ఇదంతా పథకం ప్రకారం జరిగిందే. టెస్లా కారుకు అధ్య క్షుడు ట్రంప్ బ్రాండ్ అంబాసిడర్ స్థాయిలో ప్రచారం కల్పించారు.
ఆర్థిక ప్రయోజనాలే…
ట్రంప్, మస్క్‌కు మధ్య విభేదాలకు మరింత లోతైన ఆర్ధిక ప్రయోజనాలు ఉన్నాయి. అమెరికాలో ఆయిల్, గ్యాస్ కుబేరుల లాబీ చాలా బలమైంది. వీళ్లంతా రిపబ్లికన్ పార్టీకి, ట్రంప్‌నకు గట్టి అనుచరులు. ఇప్పుడు శిలాజ ఇంధనాల వాడకాన్ని తగ్గించి, గ్రీన్‌ఎనర్జీని (సూర్యరశ్మి, గాలి, నీరు ద్వారా) విద్యుత్ వినియోగాన్ని పెంచాలనీ, పర్యావరణాన్ని పరిరక్షించాలనే ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. గతంలో సౌరవిద్యుత్ చాలా ఖరీదుగా ఉండేది. ఈరంగంలో చైనా అద్భుత కృషి వల్ల రేట్లు బాగా తగ్గిపోయాయి. ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ ఎనర్జీ వినియోగం పెరుగుతోంది. ఈ దోరణికి ట్రంప్ వ్యతిరేకం. ప్రపంచ పర్యావరణ ఒప్పందాల నుంచి ట్రంప్ వైదొలిగారు. తన ఆయిల్ లాభాల కోసం విద్యుత్ వాహనాల వాడకాన్ని నిరుత్సాహ పర్చాలనేది ఆయన పథకం. విద్యుదుత్పత్తికి ఆయిల్, గ్యాస్ పైనే ఆధారపడాలనేది ఆయిల్ లాబీ అభిమతం. బ్యూటీఫుల్ బిల్ గురించి మాట్లాడుతూ ‘అమెరికన్లు విద్యుత్ కార్లకంటే గ్యాస్ కార్లంటేనే ఇష్టపడతారు’ అంటూ ట్రంప్ వ్యాఖ్యానించాడు. అయితే ఇప్పుడు ఏ దేశ ఆర్ధిక వ్యవస్థకైనా విద్యుత్ వినియోగం కీలకం. సోలార్, విండ్, హైడ్రో వంటి పునుత్పాదక ఇంథనం ధర చౌక అయ్యింది. దీనిలో చైనా అధిపత్యం సాధించింది. ఫలితంగా ఆర్ధికంగా పటిష్టంగా ఉంది. కానీ దీనికి విరుద్ధంగా అమెరికా ఆలోచన ఉంది.
సబ్సిడీలు రద్దు
బిగ్ బ్యూటిఫుల్ బిల్ అమెరికా పార్లమెంట్ ఆమోదం పొందింది. దీనితో టెస్లా బ్యాటరీ కార్లకు ఇస్తున్న సబ్సిడీలన్నీ రద్దు అయ్యాయి. ఫలితంగా మస్క్‌కు ఏటా దాదాపు 600 బిలియన్ డాలర్ల నష్టం వస్తుంది. అలాగే గ్రీన్ ఎనర్జీ పరిశ్రమలకిస్తున్న రాయితీలను కూడా ఎత్తేస్తే ఆ పరిశ్రమే సంక్షోభంలో పడుతుంది. గడచిన 20 ఏండ్లుగా అమెరికా విద్యుదుత్పత్తి ఒకే తరహాలో ఉంది. దానికోసం ఆయిల్, బొగ్గుపైనే ఆధారపడితే మస్క్ తలపెట్టిన అర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (ఎఐ) అభివృద్దితో తలపెట్టిన స్టార్‌గేట్ ప్రాజెక్టు ఇబ్బందుల్లో పడుతుంది. దానికి భారీగా విద్యుత్తు అవసరం.
అమెరికా పార్టీ ప్రభావమెంత?
అమెరికా రాజకీయాల్లో రిపబ్లికన్, డెమొక్రాట్ పార్టీలను వెనక్కి నెట్టి, మూడో రాజకీయపార్టీ అధికారంలోకి రావడాన్ని ఊహించలేమని అంతర్జాతీయ రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. మస్క్‌కంటే ముందు అమెరికాలో మూడో రాజకీయపార్టీ ఏర్పాటుకోసం చాలామందే ప్రయత్నించారు. థియోడర్ రూజ్వెల్ట్ రిపబ్లికన్ పార్టీ తరఫున 1901 సెప్టెంబరు 14 నుంచి 1909 మార్చి 4 వరకు అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరించారు. అయితే తదుపరిగా ఆయనకు అధ్యక్ష అభ్యర్థిత్వం ఇచ్చేందుకు రిపబ్లికన్ పార్టీ అంగీకరించలేదు. దీంతో ఆయన ‘బుల్ మూస్’ అనే ప్రోగ్రెసివ్ పార్టీని ఏర్పాటు చేశారు. 1912లో జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో పోటీచేసి 27 శాతం ఓట్లు పొంది ఓడిపోయారు. 1924లో రాబర్ట్ లా ఫోలేట్ అనే నేత మూడో రాజకీయ ప్రత్యామ్నాయ ఆలోచనతో కసరత్తు చేశారు. 1948లో స్ట్రామ్ థర్మోండ్ అనే నేత స్టేట్స్ రైట్స్ డెమొక్రటిక్ పార్టీని ఏర్పాటు చేశారు. డెమొక్రటిక్ పార్టీలోని పౌర హక్కుల విధానాలను వ్యతిరేకిస్తూ ఈ పార్టీ ఏర్పా టైంది. అయితే దీర్ఘకాలం కొనసాగలేకపోయింది. శ్వేత జాతీయులు, నల్ల జాతీయులను కలిపి చూడకూడదని, ఇరువర్గాలకు ఒకే వ్యవస్థ, ఒకే న్యాయం ఉండకూడదని చెప్తూ జార్జ్ వాలేస్ 1968లో అమెరికన్ ఇండిపెండెంట్ పార్టీ ఏర్పాటు చేశారు. ఈ పార్టీ ఆనాటి ఎన్నికల్లో 13.5 శాతం ఓట్లు సాధించింది. ఇప్పుడు మస్క్ పెట్టిన ఆమెరికా పార్టీ ఏం చేస్తుందో చూడాలి. 2026 నవంబర్‌లో జరిగే అమెరికా కాంగ్రెస్ ఎన్నికలపై దృష్టిపెట్టాలనీ, తద్వారా దేశంలోని 50 రాష్ట్రాలకు పార్టీని విస్తరించాలనే ఆలోచనలో మస్క్ ఉన్నారని ప్రచారం జరుగుతున్నది. ఆ ఎన్నికలు పూర్తయితే, 2028లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతాయి. అప్పుడు మస్క్ తనపార్టీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంటుంది. అప్పటి వరకు మస్క్ వ్యాపార సామ్రాజ్యం ఇలాగే ఉంటుందా లేక మధ్యలోనే రాజీకి వచ్చేస్తారా అనే సందేహాలూ లేకపోలేదు. ఎందుకంటే రాజకీయాలే కాదు….వ్యాపారాల్లోనూ శాశ్వత శత్రువులు ఉండరనేదే పెట్టుబడిదారీ వ్యవస్థ మౌలిక సూత్రం!!
ఆటలో అరటిపండు
ఆమెరికాలో ఆయిల్ లాబీతోపాటు సిలికాన్‌వ్యాలీ గ్రూప్, వాల్‌స్ట్రీట్ గ్రూపు లాంటి అపర కుబేర లాబీలున్నాయి. వీరి లాభాల ఆటలో పరస్పర భిన్న ప్రయోజనాల మధ్య ‘ఆటలో అరటి పండు’లా ముందుకొచ్చిన మస్క్ అమెరికా పార్టీ ధనరాసులు పోగేసే కార్పొరేట్ శక్తులకోసమే తప్ప ఇప్పుడున్న రిపబ్లికన్‌లు, డెమొక్రాట్స్‌కు భిన్నంగా సాధారణ అమెరికన్ ప్రజల కోసం నిలబడతారనే భ్రమలు అక్కడి ప్రజలకే కాదు… ప్రపంచవ్యాప్తంగా ఎవరికీ లేవు.