Wednesday, July 16, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుపాలిటెక్నిక్‌ ఫీజుల పిడుగు

పాలిటెక్నిక్‌ ఫీజుల పిడుగు

- Advertisement -

రూ.39 వేలకు పెంచిన ప్రభుత్వం
రీయింబర్స్‌మెంట్‌ కింద రూ.14,900 మంజూరు
మిగిలిన రూ.24,100 విద్యార్థులు కట్టాల్సిందే…
పేద విద్యార్థులపై పెనుభారం
ఎస్సీ,ఎస్టీ,వికలాంగులు, ప్రభుత్వ స్కూళ్లు, పాలిసెట్‌లో వెయ్యిలోపు ర్యాంకు వచ్చిన వారికి మినహాయింపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

రాష్ట్రంలో ఇంజినీరింగ్‌ కోర్సుల్లో చేరే స్థోమత లేని విద్యార్థులు పాలిటెక్నిక్‌ కోర్సుల్లో చేరతారు. ఇంజినీరింగ్‌ చదువు ఎంతో ఖరీదైనది. పాలిటెక్నిక్‌ చదువు పేద విద్యార్థులకు ఇంతకాలం అందు బాటులో ఉండేది. పాలిటెక్నిక్‌ చదువు కూడా పిరం అయ్యింది. పేద విద్యార్థులకు పెనుభారం కానుం ది. ప్రయివేటు పాలిటెక్నిక్‌ కాలేజీల్లో ఫీజును రూ.14,900 నుంచి రూ.39 వేలకు రాష్ట్ర ప్రభుత్వ ం పెంచింది. ఏకంగా 161 శాతం పెంచడం గమనార్హం. పాలిటెక్నిక్‌ కోర్సుల్లో పేద విద్యార్థులే చేరతారు. వారిపై ప్రభుత్వం పెనుభారం మోపింది. రూ.39 వేలల్లో రాష్ట్ర ప్రభుత్వం రూ.14,900 ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద మంజూరు చేస్తుంది. అంటే ఏడాదికి రూ.24,100 విద్యార్థులు అదనంగా కట్టాల్సి ఉంటుంది.


ఒక్కో విద్యార్థి రూ.72,300 కట్టాల్సిందే…
పాలిటెక్నిక్‌ కాలేజీల్లో పేద విద్యార్థులే ప్రవేశాలు పొందుతారు. బీసీలు, ఈడబ్ల్యూఎస్‌, ఓసీ విద్యార్థుల్లోనూ ఇంజినీరింగ్‌ చదివే స్థోమత లేనివారు, బాసర త్రిపుల్‌ఐటీలో సీట్లు రాని వారు, తొందరగా స్థిరపడాలనే ఆలోచన ఉన్న వారు పాలిటెక్నిక్‌ కోర్సుల్లో చేరతారు. ఇంకోవైపు ఐటీ, ఇతర పరిశ్రమల్లో పాలిటెక్నిక్‌
విద్యార్థులకు మంచి డిమాండ్‌ ఉన్నది. తక్కువ వేతనాలతో ఉద్యోగావకాశాలను కల్పిస్తున్నాయి. పాలిటెక్నిక్‌ పూర్తి చేశాక ఉన్నత విద్యకు వెళ్లాలనుకునే విద్యార్థులకు ఈసెట్‌ ద్వారా ఇంజినీరింగ్‌ ద్వితీయ సంవత్సరంలో లారటరల్‌ ఎంట్రీ ద్వారా ప్రవేశాలను కల్పిస్తారు. రాష్ట్రంలో ప్రయివేటు పాలిటెక్నిక్‌ కాలేజీల్లో బీసీ, ఈడబ్ల్యూఎస్‌, ఓసీ కోటా కింద చేరిన విద్యార్థులకు రూ.14,900 మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వస్తుంది. మిగిలిన రూ.24,100 ఆ విద్యార్థులే చెల్లించాలి. అయితే పెంచిన రూ.39 వేల ఫీజు 2023-24 విద్యాసంవత్సరం నుంచి అమల్లోకి వస్తుందని ఉన్నత విద్యాశాఖ 2024, అక్టోబర్‌ 30న జీవో నెంబర్‌ 38ని విడుదల చేసింది. విద్యాసంవత్సరం మధ్యలో ఉండడం అప్పుడు అమలు చేయలేదు. ఇంకోవైపు పాలిటెక్నిక్‌ కోర్సుల్లో చేరిన విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎంత ఇవ్వాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అందుకే ప్రస్తుతం పాలిటెక్నిక్‌ కౌన్సెలింగ్‌ ఆలస్యమైంది. ఈనెల నాలుగో తేదీన సీట్ల కేటాయింపు ఉంటే వాయిదా పడింది. ఎట్టకేలకు మంగళవారం సీట్లను కేటాయించారు. 2023-24 విద్యాసంవత్సరం నుంచి పాలిటెక్నిక్‌ విద్యార్థుల ఫీజు రూ.39 వేలు ఉంటుందని ప్రభుత్వం స్పస్టం చేసింది. దీంతో ప్రయివేటు పాలిటెక్నిక్‌ కాలేజీల్లో మూడో ఏడాదిలో ఉన్న విద్యార్థులు కూడా ఈ కొత్త ఫీజులను చెల్లించాల్సి ఉంటుంది. అంటే బీసీ, ఈడబ్ల్యూఎస్‌, ఓసీకి చెందిన ఒక్కో విద్యార్థి ఏడాదికి రూ.24,100 చొప్పున మూడేండ్లకు కలిపి రూ.72,300 కట్టాలి. దీంతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

వీరికి పూర్తి రీయింబర్స్‌మెంట్‌
రాష్ట్రంలో 115 పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 28,996 సీట్లు అందుబాటులో ఉన్నాయి. పాలిసెట్‌-2025లో 80,949 మంది అర్హత సాధించారు. వారిలో 20,811 మంది అభ్యర్థులు పాలిసెట్‌ కౌన్సెలింగ్‌కు హాజరై వెబ్‌ఆప్షన్లను నమోదు చేశారు. పాలిసెట్‌ మొదటి విడత కౌన్సెలింగ్‌లో 18,984 (65.5 శాతం) మందికి సీట్లు కేటాయించారు. ఇంకా 10,012 (34.5 శాతం) సీట్లు మిగిలాయి. 59 ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 13,964 సీట్లుంటే, 11,455 (82 శాతం) సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా 2,509 (18 శాతం) సీట్లు మిగిలాయి. 56 ప్రయివేటు పాలిటెక్నిక్‌ కాలేజీల్లో 15,032 సీట్లుంటే, 7,529 (50.1 శాతం) సీట్లు భర్తీ చేశారు. ఇంకా 7,503 (49.9 శాతం) సీట్లు మిగిలాయి. అయితే ఎస్సీ,ఎస్టీ, వికలాంగుల విద్యార్థులతోపాటు ప్రభుత్వ, జిల్లా పరిషత్‌, నవోదయ పాఠశాలలు, ప్రభుత్వ గురుకులాల్లో చదివిన విద్యార్థులు పాలిసెట్‌లో వెయ్యిలోపు ర్యాంకు విద్యార్థులకు పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వర్తిస్తుంది. అంటే రూ.39 వేలను ప్రభుత్వమే చెల్లిస్తుంది. మిగిలిన విద్యార్థులకు రూ.14,900 మాత్రమే ఫీజు రీయింబర్స్‌మెంట్‌ వస్తుంది. అంటే మిగిలిన రూ.24,100 విద్యార్థులే చెల్లించాల్సి ఉంటుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -