మురళీధర్‌రావు అక్రమాస్తులు రూ.కోట్లలోనే
ఆయన ఆస్తులపై ఏసీబీ మెరుపుదాడులు
హైదరాబాద్‌తో పాటు కరీంనగర్‌లో సోదాలు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్రంలో నీటిపారుదల శాఖకు చెందిన మరో అవినీతి తిమింగళం ఏసీబీ వలకు చిక్కింది. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంజినీర్ ఇన్ చీఫ్(ఈఎన్సీ)గా పని చేసి రిటైర్ అయిన సి. మురళీధర్‌రావుకు చెందిన కోట్లాది రూపాయల అక్రమాస్తుల గుట్టును రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) అధికారులు మంగళవారం రట్టు చేశారు. ఏసీబీ డైరెక్టర్ జనరల్ విజరుకుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. నీటిపారుదల శాఖ రిటైర్డ్ ఇంజినీర్ మురళీధర్‌రావు అవినీతి, అక్రమాలకు పాల్పడి కోట్లాది రూపాయల విలువైన ఆదాయానికి మించిన ఆస్తులను సంపాదించినట్టు ఏసీబీకి విశ్వసనీయ సమాచారం అందింది. దీంతో ఏసీబీ అధికారులు హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌తోపాటు కరీంనగర్, హుజూరాబాద్‌లలోని మురళీధర్‌రావుకు చెందిన ఆస్తులు, వారి సమీప బంధువుల ఆస్తులపై మెరుపుదాడులను నిర్వహించారు. మొత్తం 11 ప్రాంతాల్లో ఈ మెరుపుదాడులు సాగించారు. ఈ దాడుల్లో మురళీధర్‌రావు కొనుగోలు చేసిన విల్లాలు, అపార్ట్‌మెంట్‌లు, విలువైన ప్రాంతాల్లో ఇండ్ల స్థలాలు, ఎకరాల్లో వ్యవసాయ భూమితో పాటు నివాసంలో అత్యంత విలువైన బంగారు నగలు, నగదును ఏసీబీ అధికారులు కనుగొన్నారు. వీరు జరిపిన దాడుల్లో… కొండాపూర్‌లోని ఒక విల్లా, బంజారాహిల్స్, యూసఫ్‌గూడ, బేగంపేట్, కోకాపేట్‌లలో ఒకటి చొప్పున ఫ్లాట్‌లు, హైదరాబాద్, కరీంనగర్‌లో ఒకటి చొప్పున కమర్షియల్ బిల్డింగ్‌లు, కోదాడలో ఒక అపార్ట్‌మెంట్, జహీరాబాద్‌లో ఒక 2కేడబ్ల్యూ సోలార్ పవర్ ప్రాజెక్ట్, వరంగల్‌లో నిర్మాణంలో ఉన్న ఒక అపార్ట్‌మెంట్‌ను గుర్తించారు. అలాగే, హైదరాబాద్‌లో నాలుగు రెసిడెన్షియల్ ప్రైమ్ ఓపెన్ ప్లాట్లు, మోకిలాలో 6500 చదరపు గజాల భూమి, మెర్సిడిస్ బెంజ్ కారుతో సహా మూడు ఫోర్ వీలర్ వాహనాలు, బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లను అధికారులు కనుగొన్నారు. ప్రస్తుతం దాడుల్లో బయటపడిన ఆస్తుల మార్కెట్ విలువ ఐదింతలు ఎక్కువగా ఉంటుందనీ, అది కోట్లాది రూపాయల్లో ఉంటుందని ఏసీబీ అధికారులు అంచనా వేస్తున్నారు. నిందితుడు మురళీధర్‌రావుపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసును నమోదు చేయటంతో పాటు అరెస్టు చేశామని అధికారులు తెలిపారు. ఇంకా ఆయన ఆస్తులపై సోదాలు కొనసాగుతున్నాయని చెప్పారు.
ఇరిగేషన్ మాజీ ఈఎన్‌సీ అరెస్ట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES