వారి నిర్లక్ష్యంతోనే ఘోర ప్రమాదం.. కార్మికులు మృతి
మృతుల కుటుంబాలకు రూ.కోటి పరిహారం వెంటనే ఇవ్వాలి : సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె. వెంకటేశ్
కలెక్టరేట్ ఎదుట కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ధర్నా
నవతెలంగాణు మెదక్ ప్రాంతీయ ప్రతినిధి
పరిశ్రమల్లో భద్రత ప్రమాణాలు పాటించని యాజమాన్యాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు అతిమేల మాణిక్ అధ్యక్షతన పలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టరేట్ ఏవోకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వెంకటేష్ మాట్లాడుతూ.. సిగాచి పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యంతోనే ఘోర ప్రమాదం జరిగి 53 మంది కార్మికులు మృతిచెందారని, అందులో ఇప్పటికీ ఎనిమిది మంది ఆచూకీ దొరకలేదన్నారు. మృతిచెందిన కార్మిక కుటుంబాలకు కోటి రూపాయలు, గాయపడిన వారికి రూ.50 లక్షలు నష్టపరిహారం వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. సిగాచి పరిశ్రమలో ఘోర ప్రమాదం జరిగి 15 రోజులు దాటినా నేటికీ పరిశ్రమ యాజమాన్యాన్ని ఎందుకు అరెస్టు చేయలేదని, యాజమాన్యంతో ప్రభుత్వానికి ఏమైనా లాలూచి ఉందా అని ప్రశ్నించారు. పరిశ్రమలో ప్రమాదాలకు యాజమాన్యాలదే బాధ్యత వహించాలని, సిగాచి పరిశ్రమ యాజ మాన్యాన్ని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. యాజమాన్యాలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుకూలమైన విధానాలు తేవడంతో ప్రమాదాలు జరగడానికి కారణమవుతు న్నాయని తెలిపారు. పరిశ్రమలను తనిఖీలు చేయాల్సిన ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులు.. యాజమాన్యాలిచ్చే మాముళ్ళ మత్తులో మునిగి తేలాడుతున్నారన్నారు. వీళ్లకు కార్మికుల ప్రాణాలంటే లెక్క లేదన్నారు.. కార్మిక భద్రత పట్ల నిర్లక్ష్యం వహిస్తున్న యాజమాన్యాలపై కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సిగాచి పరిశ్రమ జరిగిన దుర్ఘటన చూసైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలని, లేని పక్షంలో కార్మికుల పోరాటాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ప్రమాదానికి కారణమైన ఇన్‌స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి జి సాయిలు, రాష్ట్ర కమిటీ సభ్యులు కె.రాజయ్య, జిల్లా ఉపాధ్యక్షులు పాండురంగారెడ్డి, జిల్లా సహాయ కార్యదర్శి ఎం యాదగిరి, ఐఎఫ్‌టీయూ జిల్లా నాయకులు సురేష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.
‘సిగాచి’ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
- Advertisement -
- Advertisement -