నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా జస్టిస్ ఏ.కే సింగ్ ఈ నెల 19న ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లో మధ్యాహ్నం 12.30 గంటలకు జరిగే కార్యక్రమంలో ఆయనతో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించనున్నారు. త్రిపుర హైకోర్టు సీజేగా ఉన్న జస్టిస్ ఏ.కే.సింగ్ బదిలీపై తెలంగాణకు రానున్నారు. హైకోర్టు యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా చేస్తున్న జస్టిస్ సుజోరు పాల్ కోల్‌కతా హైకోర్టుకు బదిలీ అయిన నేపథ్యంలో ఆయనకు బుధవారం హైకోర్టు వీడ్కోలు చెప్పనుంది. మొదటి కోర్టు హాల్లో మధ్యాహ్నం 3.45 గంటలకు ఫుల్ కోర్టు వీడ్కోలు చెప్పనుంది. గత చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే జనవరిలో బదిలీపై బాంబే హైకోర్టుకు బదిలీపై వెళ్లినప్పటి నుంచి జస్టిస్ సుజరు పాల్ యాక్టింగ్ చీఫ్ జస్టిస్‌గా చేస్తున్నారు.
చీఫ్ జస్టిస్ బెంచ్‌కి ఇంజనీరింగ్ కాలేజీల ఫీజుల కేసు
రాష్ట్రంలో ప్రయివేటు ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపునకు ఉత్తర్వులు ఇవ్వాలంటూ దాఖలైన పలు వ్యాజ్యాలపై విచారణ ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలోని డివిజన్ బెంచ్‌కు చేరింది. ఇంజనీరింగ్ కాలేజీల్లో ఫీజుల పెంపు అంశంపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టు న్యాయమూర్తులు ఇద్దరు సింగిల్ జడ్జిల ఏకసభ్య ధర్మాసనాలు వేరు వేరు నిర్ణయాలు వెలువరించాయి. దీంతో ఈ వ్యాజ్యాలను చీఫ్ జస్టిస్ బెంచ్ ఎదుట ఉంచాలని జస్టిస్ బి.విజరుసేన్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు వెలువరించారు. ఒక ప్రయివేటు ఇంజనీరింగ్ కాలేజీ పిటిషన్‌లో ఫీజు పెంపునకు జస్టిస్ విజరుసేన్‌రెడ్డి ఇటీవల అనుమతిచ్చారు. మరో న్యాయమూర్తి జస్టిస్ కె.లక్ష్మణ్ పీజుల పెంపునకు నిరాకరించారు. తుది తీర్పుకు లోబడి ఫీజుల పెంపు అంశం ఉంటుందన్నారు. ఈ పరిస్థితుల్లో జస్టిస్ విజరుసేన్‌రెడ్డి వద్ద విచారణలో ఉన్న పిటిషన్ సోమవారం విచారణకు రావడంతో పైవిధంగా రిజిస్ట్రీకి ఆదేశాలు జారీ చేశారు. ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీల్లో 2025-26 ఏడాదికి గత బ్లాక్ పీరియడ్ ఫీజులే వర్తిస్తాయన్న ప్రభుత్వ జీవో 26న పలు ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీలు సవాలు చేశాయి.
అక్రమ రవాణా వాహనాలకు విడుదల ఉత్తర్వులు ఇవ్వబోం: హైకోర్టు
రుణంపై కొనుగోలు చేసిన వాహనంలో అక్రమ రవాణా చేస్తూ పోలీసులకు పట్టుబడితే, రుణం ఇచ్చిన సంస్థకు ఆ వాహనాన్ని అప్పగించాలని పోలీసులకు ఉత్తర్వులు ఇవ్వబోమని హైకోర్టు స్పష్టం చేసింది. రుణం ఇచ్చినంత మాత్రన రుణదాతకు వాహనంపై హక్కులు ఉండవని పేర్కొంది. రుణదాతకు వాహనంపై యాజమాన్య హక్కులు ఉండబోవని వెల్లడించింది. కేవలం తాకట్టు హక్కులే ఉంటాయని తెలిపింది. ఎన్డీపీఎస్ కింద సీజ్ చేసిన వాహనాన్ని ఇప్పించాలని రుణం ఇచ్చిన సంస్థ చేసిన అభ్యర్ధనను తిరస్కరించింది. నల్లబెల్లం తరలిస్తుండగా సీజ్ చేసిన బొలెరో వాహనాన్ని అప్పగించేలా ఎక్సైజ్ శాఖకు ఉత్తర్వులివ్వాలని కోరుతూ టైగర్ క్యాపిటల్ ప్రయివేట్ లిమిటెడ్ వేసిన పిటిషన్‌ను జస్టిస్ టి.వినోద్ కుమార్ విచారించారు. వాహనాన్ని తాకట్టు పెట్టుకుని రుణం మంజూరు చేశామనీ, ఎక్సైజ్ పోలీసులు ఆ వాహనాన్ని సీజ్ చేయడం వల్ల అప్పు ఇచ్చిన తమ సంస్థ నష్టపోయిందని పిటిషనర్ న్యాయవాది వాదించారు. మంజూరు చేసిన రుణం చెల్లించనప్పుడు ఆ వాహనాన్ని వేలం వేయగా వచ్చిన డబ్బును రికవరీ చేసుకోవాలనే రుణ ఒప్పందం ఇరు పక్షాల మధ్య ఉంటుందని హైకోర్టు గుర్తు చేసింది. అయితే, నల్లబెల్లం మొదలైన వాటిని అక్రమ రవాణా చేస్తుండగా పట్టుబడిన వాహనాన్ని విడుదల చేయాలని ఉత్తర్వులు ఇవ్వబోమని తేల్చి చెప్పింది. కేసు తేలే వరకు వాహనాన్ని విడుదలకు ఉత్తర్వులు ఇవ్వబోమని తీర్పు చెప్పింది.
ఎంపీ ఈటలకు ఊరట
హుజూరాబాద్ పోలీస్‌స్టేషన్‌లో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌పై నమోదైన కేసులో హైకోర్టు వెసులుబాటు కల్పించింది. ఈటలపై కేసును విచారిస్తున్న నాంపల్లి ప్రజా ప్రతినిధుల కేసుల విచారణ ప్రత్యేక కోర్టులో జరిగే విచారణకు హాజరీ నుంచి ఆయనకు మినహాయింపు ఇచ్చింది. కింది కోర్టులో జరిగే విచారణకు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇచ్చింది. పోలీసులకు నోటీసులు ఇచ్చి తదుపరి విచారణ ఆగస్టు 4కు వాయిదా వేస్తూ జస్టిస్ కె.లక్ష్మణ్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. 2021 సెప్టెంబర్‌లో హుజూరాబాద్ అసెంబ్లీ సీటుకు జరిగిన ఉప ఎన్నికప్పుడు కోవిడ్ నిబంధనలకు వ్యతిరేకంగా, అనుమతి లేకుండా ర్యాలీ తీశారని ఖాజా బషీరుద్దీన్ అనే ప్రభుత్వాధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసును కొట్టేయాలని ఈటల హైకోర్టులో పిటిషన్ వేశారు. న్యాయవాది వాదిస్తూ, ఆధారాలు లేవనీ, అన్యాయంగా కేసు పెట్టారన్నారు. రోడ్డు కార్నర్ మీటింగ్‌లు నిర్వహించేందకు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు పోలీసులు అనుమతిచ్చారని చెప్పారు. ఈ కేసు నాంపల్లి కోర్టులో ఆగస్టు 14న విచారణకు ఉందన్నారు. ఎఫ్‌ఐఆర్‌ను కొట్టేయాలనీ, ఈలోగా కింది కోర్టు విచారణకు పిటిషనర్ హాజరు కాకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరగా, న్యాయమూర్తి మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు.
చిరంజీవి అప్లికేషన్‌పై చర్యలు తీసుకోండి : జీహెచ్‌ఎంసీకి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో తన ఇంటి పునరుద్ధరణ పనులను క్రమబద్ధీకరించాలని సినిమా హీరో చిరంజీవి పెట్టుకున్న అప్లికేషన్‌ను చట్ట ప్రకారం నాలుగు వారాల్లోగా పరిష్కరించాలని జీహెచ్‌ఎంసీని హైకోర్టు ఇటీవల ఆదేశించింది. ఇంటి పునరుద్ధరణలో భాగంగా రిటైన్ వాల్ నిర్మాణం చేశామనీ, దీని క్రమబద్ధీకరణకు జూన్ 5న జీహెచ్‌ఎంసీకి చేసుకున్న దరఖాస్తు అక్కడ పెండింగ్‌లో ఉందనీ, చర్యలు తీసుకునేలా ఆర్డర్ ఇవ్వాలని చిరంజీవి పిటిషన్ వేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ బి.విజరుసేన్‌రెడ్డి ఇటీవల విచారణ పూర్తి చేసి పైవిధంగా ఉత్తర్వులు జారీ చేశారు. 2002లో గ్రౌండ్, మరో రెండంతస్తుల నిర్మాణానికి అనుమతి తీసుకుని నిర్మించాక పునరుద్ధరణలో భాగంగా ముందస్తు జాగ్రత్త చర్యగా అనుమతులు తీసుకున్నట్టు న్యాయవాది వివరించారు. తనిఖీ చేసి క్రమబద్ధీకరించాలన్న అభ్యర్థనను జీహెచ్‌ఎంసీ పట్టించుకోలేదని తెలిపారు. దీనిపై జీహెచ్‌ఎంసీ న్యాయవాది స్పందిస్తూ, చట్ట ప్రకారం దరఖాస్తుపై చర్యలు తీసుకుంటామని చెప్పారు. పిటిషనర్ దరఖాస్తును నాలుగు వారాల్లోగా పరిష్కరించాలని జీహెచ్‌ఎంసీని ఆదేశించిన న్యాయమూర్తి పిటిషన్‌పై విచారణ మూసివేసినట్టు ప్రకటించారు.