రష్యాకు ట్రంప్ హెచ్చరిక
యుద్ధాలు ఆపడానికి వాణిజ్యాన్ని వాడుకుంటా
వైట్‌హౌస్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ రష్యాకు హెచ్చరిక చేశారు. 50 రోజుల్లో ఉక్రెయిన్‌తో ఒప్పందం చేసుకుని యుద్ధాన్ని ఆపాలని హుకుం జారీ చేశారు. లేదంటే 100 శాతం సుంకాలతో శిక్షిస్తానని స్పష్టం చేశారు. అయితే ఈ సుంకాల అమలు ఎలా ఉంటుందనే వివరాలు మాత్రం ఆయన చెప్పలేదు.
పుతిన్ బాంబులు కురిపిస్తారు!
నాటో సెక్రెటరీ జనరల్ మార్క్ రుట్టేతో ట్రంప్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌పై ట్రంప్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. పుతిన్ పగలు చాలా అందంగా మాట్లాడతారని, కానీ రాత్రైతే బాంబులు కురిపిస్తారని అన్నారు. అసలు పుతిన్ ప్రవర్తన తనకు ఏమాత్రం నచ్చట్లేదని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
యుద్ధం విషయంలో ట్రంప్ విధానం మారే అవకాశం ఉందనే ఊహాగానాలు వస్తున్న వేళ, ఆయన ప్రత్యేక దూతగా విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ కీత్ కెల్లోగ్, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీతో సమావేశమయ్యారు. ఈ భేటీలో తమ గగనతల వ్యవస్థల్ని బలోపేతం చేయడం, సంయుక్త ఆయుధాల ఉత్పత్తి, అమెరికా నుంచి ఆయుధాల కొనుగోలు, రష్యాపై అంతర్జాతీయ ఆంక్షల్ని మరింత కఠినతరం చేయడానికి ఉన్న అవకాశాలు, తదితర అంశాలపై ఫలప్రదంగా చర్చలు సాగినట్టు జెలెన్‌స్కీ వెల్లడించారు.
రష్యాకు సాయం చేస్తే ఇక అంతే!
మరోవైపు రష్యాకు సాయం చేసే దేశాలపై 500 శాతం టారిఫ్‌లు విధించేలా బిల్లును రూపొందించినట్టు రిపబ్లికన్ సెనెటర్ లిండ్సే గ్రాహమ్ పేర్కొన్నారు. ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు అందించేందుకు ట్రంప్ అంగీకరించారని, రికార్డు స్థాయిలో ఆయుధాలతో పాటు, పేట్రియాట్ గగనతల రక్షణ వ్యవస్థను కీవ్‌కు పంపించనున్నారని గ్రాహమ్ వెల్లడించారు. ట్రంప్ కూడా స్వయంగా ఉక్రెయిన్‌కు మరిన్ని గగనతల రక్షణ వ్యవస్థలను అందజేయనున్నట్టు ప్రకటించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇవి కీవ్‌కు చాలా అవసరమని ఆయన పేర్కొన్నారు.
యుద్ధాలు ఆపడానికి వాణిజ్యాన్ని వాడుకుంటా!
దేశాల మధ్య జరుగుతున్న భీకర యుద్ధాలను ఆపడానికి తాను వాణిజ్యాన్ని వాడుకుంటానని ట్రంప్ అన్నారు. ఇది చాలా గొప్పగా ఉంటుందంటూ మరోసారి భారత్-పాక్ ఘర్షణల గురించి ప్రస్తావించారు. వివిధ దేశాల మధ్య నెలకొన్న ఘర్షణలను తాను వాణిజ్య ఒప్పందాలతో ముడిపెట్టి ఆపినట్టు పేర్కొన్నారు.