Thursday, July 17, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపాలెం 'పరిశోధనలు'

పాలెం ‘పరిశోధనలు’

- Advertisement -

– అధిక దిగుబడి వంగడాలపై శాస్త్రవేత్తల కృషి
– జొన్న, ఆముదం విత్తనాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు
– ఎన్నో రకాల విత్తనాలు తయారవుతున్నా.. తప్పని దిగుమతులు
– రైతులకు అవగాహన కల్పించని పాలకులు
– సంప్రదాయ వంగడాలే వాడుతున్న అన్నదాతలు
నవతెలంగాణ – మహబూబ్‌నగర్‌ ప్రాంతీయప్రతినిధి

రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడం, మేలైన పరిశోధనలు చేయడంలో ప్రొఫెసర్‌ జయశంకర్‌ యూనివర్సిటీ దృష్టి సారించింది. అధిక దిగుబడులు ఇచ్చే వంగడాలను తయారు చేయడమే కాకుండా జొన్న, ఆముదం విత్తనాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. యూనివర్సిటీ పరిధిలోని పాలెం వ్యవసాయ పరిశోధన కేంద్రం నాణ్యమైన విత్తనాలు ఉత్పత్తి చేస్తోంది. నాణ్యమైన విత్తనాలతోపాటు ఆధునిక వ్యవసాయంపై రైతులకు అవగాహన కల్పిస్తోంది. పాలెం వ్యవసాయ పరిశోధన కేంద్రంలో బోధన, పరిశోధన, విస్తరణ దృక్పథంతో రైతులకు మేలైన విత్తనాలు అందించడానికి శాస్త్రవేత్తలు నిరంతరం కృషి చేస్తున్నారు. ప్రధానంగా అధిక దిగుబడులను ఇచ్చే విత్తనాలపై పరిశోధనలు చేస్తున్నారు. ఇక్కడ ఆముదం, జొన్న విత్తనాల ఉత్పత్తి జరుగుతోంది. అయితే, వంగడాలను మూడు, నాలుగుసార్లు వేసినా.. ఆశించిన స్థాయిలో దిగుబడులు వస్తాయి. కానీ రైతులు ప్రతిసారీ విత్తనాలు కొనుగోలు చేయడం వల్ల పెట్టుబడి పెరిగి నష్టాల బారిన పడుతున్నారు.
బోధన, పరిశోధన విస్తరణ
ప్రధానంగా బోధన పరిధిలో అగ్రికల్చరల్‌ కళాశాల, వ్యవసాయ పాలిటెక్నిక్‌ కళాశాల, వ్యవసాయ ఇంజినీరింగ్‌ కళాశాల, ఫుడ్‌సైన్స్‌ టెక్నాలజీ, హౌమ్‌సైన్స్‌ తదితర విభాగాల్లో బోధన జరుగుతోంది. పాలెంతోపాటు జగిత్యాల, వరంగల్‌లో వ్యవసాయ విత్తనాలపై పరిశోధనలు చేసి నాణ్యమైన వంగడాలు తయారు చేస్తున్నారు. విస్తరణలో భాగంగా కృషి విజ్ఞాన కేంద్రాలు, ఏరువాక కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా ఉంటాయి. దక్షిణ తెలంగాణ పాలెం, కంపసాగర్‌లో డాటా కేంద్రాలున్నాయి. ఏరువాక సెంటర్లు పాలెం, తాండూరు, యాదాద్రి భువనగిరిలో ఉన్నాయి. పాలిటెక్నిక్‌ కళాశాలలు పాలెం, నారాయణపేట, కంపసాగర్‌లో ఉన్నాయి.
మేలురకమైన విత్తనాలు
పాలెం పరిశోధనాలయంలో మేలురకమైన ఆహార విత్తనాలు తయారు చేస్తున్నారు. ఇక్కడ కంది పీఆర్‌జీ 176, ఉజ్వలను సాగు చేస్తే 140 రోజుల్లో పంట చేతికి వస్తోంది. ఆముదం పిసిహెచ్‌ 111 ఎకరాకు 8 క్వింటాళ్లు వస్తుంది. పిసిహెచ్‌ఎస్‌, 330 వంగడం కొత్తది. దీన్ని నెల రోజుల కిందట గుర్తించారు. తెల్ల జొన్న సిఎస్‌వి 41కి జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చింది. దీని ద్వారా ఎకరాకు 8 క్వింటాళ్ల దిగుబడితోపాటు పశువులకు నాణ్యమైన మేత వస్తోంది. పివైపిఎస్‌ 2 పచ్చజొన్న.. మంచి దిగుబడి ఇస్తోంది. ఉలువలు పాలెం 1, పాలెం 2 కూడా ఇక్కడ గుర్తించిన విత్తనాలే. చిరుధాన్యాలు రాగి పిఆర్‌ఎస్‌ 38, సజ్జ పిబిహెచ్‌1625 విడుదల అయ్యాయి. వేరుశనగ విత్తనాలు ఇక్రిశాట్‌ అనుసంధానంతో వచ్చాయి. సజ్జలో పిజిఎన్‌1, పిజీఎన్‌2 విత్తనాలు విడుదల కావాల్సి ఉంది. చిరుధాన్యాల పంటలపై ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. వరిలో తెలంగాణ సోనా మంచి విత్తనంగా గుర్తింపు వచ్చింది. ఇది 120 రోజుల్లో పంట చేతికి వస్తుంది.
300 ఎకరాల్లో పాలెం పరిశోధనాలయం
పాలెం వ్యవసాయ క్షేత్రం 300 ఎకరాల్లో విస్తరించి ఉంది. అందులో 100 ఎకరాలు పరిశోధనకే కేటాయించారు. ఇక్కడ 16 మంది పరిశోధకులు ఉన్నారు. వీరికి సహకారంగా 25 మంది పనిచేస్తున్నారు. గ్రామగ్రామాన నాణ్యమైన విత్తనం వేయడమే లక్ష్యంగా ఇక్కడ పరిశోధనలు జరుగుతున్నాయి. ఇక్కడి పరిశోధనల పలితంగా జొన్న, ఆముదం పంటకు జాతీయ గుర్తింపు వచ్చింది. ఆముదానికి బెస్ట్‌ ఎఐసీఆర్‌పి ఆవార్డు వచ్చింది.
రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు
తెలంగాణలో అత్యంత నాణ్యమైన విత్తనాలు తయారు చేసే పాలెం పరిశోధన కేంద్రంలో గుర్తించిన విత్తనాలు ఇక్కడి రైతులకు మాత్రం ఉపయోగపడటం లేదని రైతు సంఘం నేతలు అంటున్నారు. ప్రధానంగా ఉమ్మడి మహబూబ్‌నగర్‌ జిల్లాలో 3 లక్షల ఎకరాలకు పైగానే తెల్లజొన్న పంట సాగు చేసేవారు. మరో లక్ష ఎకరాలకు పైగానే ఆముదం, 50 వేల ఎకరాలు కంది పంట సాగు చేసేవారు. నేడు ఈ పంటలు వందల ఎకరాలకే పరిమితం అయ్యాయి. షుగర్‌ పేషెంట్లకు ఉపయోగపడే జొన్నను ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు. పాలెం వ్యవసాయ పరిశోధన కేంద్రంలో కంది, జొన్న, ఆముదం, వేరుశనగ వంటి విత్తనాలు అనేకం తయారు చేస్తున్నా.. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అవగహన కల్పించడంలో పూర్తిగా విఫలం అయిందన్న విమర్శలున్నాయి.
అవగహన కల్పించాలి
పాలెంలో పరిశోధనలు చేసినా అవి పూర్తి స్థాయిలో రైతులకు చేరువకావడం లేదు. ముఖ్యంగా విత్తన ఎంపికలో రైతులకు అవగహన కల్పించాలి. వరి, పత్తి వంటి విత్తనాలను ఎంపిక చేసుకునే సమయంలో మార్కెట్‌లో నాసిరకమైన విత్తనాలను గుర్తించి కట్టడి చేయాలి. వాటిని నియంత్రణ చేయడంతోపాటు బాధ్యులపై చర్యలు తీసుకోవాలి.
-శ్రీనివాసులు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి, నాగర్‌కర్నూల్‌
రైతులే శాస్త్రవేత్తలు
రైతులే శాస్త్రవేత్తలుగా ఎదగాలి. తమ విత్తనాలను తామే తయారు చేసుకోవాలి. ప్రతి ఏటా కొత్త విత్తనం కొని డబ్బులు వృథా చేసుకోవద్దు. ఒకసారి వరి విత్తనం కొంటే అది మూడు నాలుగు ఏండ్లపాటు ఉపయోగించుకోవచ్చు. పాలెం పరిశోధనలో గుర్తించి విత్తనాలను ఉపయోగించుకొని అధిక లాభాలు గడించాలి.
– డాక్టర్‌ సుధాకర్‌, ఏడీఆర్‌ వ్యవసాయ పరిశోధన కేంద్రం పాలెం

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -