నవతెలంగాణ – కమ్మర్ పల్లి : మండలంలోని హాసకొత్తూర్ గ్రామంలో క్షేత్రస్థాయిలో వరి పొలాలను మండల వ్యవసాయ అధికారిని రమ్యశ్రీ బుధవారం పరిశీలించారు. గ్రామానికి చెందిన రైతు పురుషోత్తం వరి పొలాలని ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆమె రైతులకు పలు సలహాలు, సూచనలు చేశారు.వరి నారుని ట్రైచోడెర్మా విరిడే ద్రావణంలో 30 నిముషాలు ముంచి, నీడలో ఆరబెట్టిన తర్వాత నాటుకోవాలని సూచించారు.
తద్వారా వరి నారు భూమి నుండి సంక్రామించే వ్యాధులని తట్టుకొని, మంచి దుబ్బు చేస్తుందన్నారు. ట్రైచోడెర్మా విరిడే (శిలీంద్ర నాశిని) వల్ల మొక్క వేర్లు పోషకాలను గ్రహించే శక్తిని పెంపొందించుకుంటాయని తెలిపారు. అదేవిధంగా మొక్క రోగాలను తట్టుకునే విధంగా, దృఢంగా తయారవుతుందన్నారు. ఫలితంగా మంచి దిగుబడులు పొందవచ్చని మండల వ్యవసాయ అధికారిని రమ్యశ్రీ వివరించారు. ట్రైచోడెర్మా విరిడే ద్రావణంను10 గ్రాములు లీటర్ నీటిలో కలపాలని సూచించారు.
రైతులకు ముఖ్య గమనిక…
మండలంలోని ఆయా గ్రామాల్లో ఎవరికైనా రైతులకు ట్రైచోడెర్మా విరిడే కావాలంటే ఆయా సెక్టార్ల వ్యవసాయ విస్తీర్ణ అధికారులను సంప్రదించాలని మండల వ్యవసాయ అధికారిని రమ్యశ్రీ సూచించారు. 1కేజీ ట్రైచోడెర్మా విరిడే ప్యాకెట్ రూ.100 ఉంటుందని తెలిపారు. కావాలనుకున్న రైతులు ఆయా గ్రామాల ఏఈఓ లను సంప్రదించి తీసుకోవాలని స్పష్టం చేశారు.