అయినా నియామకాల్లో కొనసాగుతున్న వివక్ష
న్యూఢిల్లీ : ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీసుల (ఐఏఎస్)లో మహిళా అధికారుల ప్రాతినిధ్యం పెరుగుతోంది. గత సంవత్సరం అక్టోబరులో విడుదలైన డేటా ప్రకారం కేంద్ర ప్రభుత్వంలో 236 మంది జాయింట్ సెక్రటరీలు పనిచేస్తుండగా వారిలో 64 మంది…అంటే 27 శాతం మహిళలే ఉండడం గమనార్హం. గత నెలలో కేంద్ర ప్రభుత్వం 1994 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అనురాధా ఠాకూర్‌ను ఆర్థిక వ్యవహారాల శాఖ (డీఈఏ) కార్యదర్శిగా నియమించింది. గతంలో మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్, ప్రణాళికా సంఘం మాజీ డిప్యూటీ ఛైర్మన్ మాంటెక్ సింగ్ అహ్లువాలియా వంటి నిపుణులు ఈ బాధ్యతను నిర్వర్తించారు. ఇప్పుడు తొలిసారిగా ఈ ఉన్నత స్థాయి పదవిని ఓ మహిళ నిర్వహిస్తున్నారు.
కీలక శాఖల్లో సైతం…
అయితే ఠాకూర్ వంటి వ్యక్తులు ఈ రోజులలో చాలా అరుదుగానే ఉంటారు. కేంద్రంలో ప్రస్తుతం ఉన్న 90 మంది కార్యదర్శులలో 16 మంది…అంటే 18 శాతం మంది మాత్రమే మహిళలు. అయినప్పటికీ గతంతో పోలిస్తే ఈ సంఖ్య ఎక్కువగానే ఉన్నదని రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు గుర్తు చేశారు. 1982 బ్యాచ్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి అరుణా శర్మ మాట్లాడుతూ అప్పట్లో మహిళా అధికారులు 10-12 శాతానికి మించి లేరని చెప్పారు. ఇప్పుడు ఆరోగ్యం, కార్పొరేట్ వ్యవహారాలు, వినియోగ వ్యవహారాలు, సిబ్బంది-శిక్షణ విభాగం, జల వనరులు, న్యాయ వ్యవహారాలు వంటి కీలకమైన పరిపాలనా విభాగాలకు మహిళా కార్యదర్శులే నేతృత్వం వహిస్తున్నారు.
రాష్ట్ర స్థాయిలో రివర్స్
రాష్ట్ర స్థాయిలో మాత్రం పరిస్థితి ఆందోళనకరంగానే ఉంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ప్రధాన కార్యదర్శులుగా కేవలం ఇద్దరు మహిళా అధికారులు మాత్రమే పనిచేస్తున్నారు. మొత్తం 36 మంది ప్రధాన కార్యదర్శులలో అల్కా తివారీ (జార్ఖండ్-1988 బ్యాచ్), డాక్టర్ షాలినీ రజనీష్ (కర్నాటక-1989 బ్యాచ్) మాత్రమే మహిళలు. 2015-16 నుండి పరిస్థితిలో మార్పు కన్పిస్తోందని 1982 బ్యాచ్‌కి చెందిన రిటైర్డ్ అధికారి లీలా నాయర్ తెలిపారు. ‘మా బ్యాచ్‌లో కేవలం పది మంది మహిళలు మాత్రమే ఉండేవారు. అయితే ఒక సమయంలో మాలో 14 మంది కార్యదర్శులు అయ్యారు. గతంలో పోస్టింగులలో పక్షపాతం చూపేవారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. మీరు సామర్ధ్యాన్ని నిరూపించుకుంటే పోస్టింగ్ పొందుతారు’ అని ఆమె తెలిపారు.
ముఖ్య శాఖలకు కార్యదర్శులుగా…
1951 తర్వాత మహిళా అధికారుల నియామకాలు క్రమేపీ పెరుగుతూ వస్తున్నాయి. అన్నా రాజం మల్హోత్రా తొలి మహిళా ఐఏఎస్ అధికారిగా నియమితులయ్యారు. 1950వ దశకంలో మహిళా అధికారుల నియామకాలు ఐదు శాతంగానే ఉండేవి. 70వ దశకం నాటికి అవి 15 శాతానికి, 2000 నాటికి 25 శాతానికి, 2020 నాటికి 27 శాతానికి పెరిగాయి. ఐఏఎస్, ఇతర సర్వీసులలో మహిళలు ఎక్కువ సంఖ్యలో చేరుతున్నారని, దాని ఫలితంగానే ఉన్నత పదవులలో వారి సంఖ్య పెరుగుతోందని ఓ సీనియర్ ఐఏఎస్ అధికారి చెప్పారు. ‘మా బ్యాచ్‌లో 25 శాతం మహిళలు ఉండేవారు. అంటే ప్రతి నలుగురిలో ఒకరన్న మాట. కాబట్టి యుక్త వయసులోనే ఉన్నత స్థానాన్ని అలంకరించడం మహిళలకు ఇప్పుడేమీ అరుదైన సందర్భం కాబోదు’ అని అన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖలోనో లేదా సామాజిక న్యాయ శాఖలోనో మాత్రమే మహిళలు అధికారులుగా నియ మితులు కావడం లేదని తెలిపారు. తాజా డేటా ప్రకారం రాష్ట్రపతి కార్యదర్శి, సైన్స్ అండ్ టెక్నాలజీ, కార్మిక శాఖ, ఆరోగ్యం, తపాలా, కెమికల్-పెట్రో కెమికల్స్, పశు సంవర్థక శాఖ, పాడి పరిశ్రమ వంటి విభాగాలు, శాఖలలో మహిళలు కార్యదర్శి పదవులను నిర్వహిస్తున్నారు.
గతంలో సచివాలయాలకే పరిమితం
గతంలో పోస్టింగుల విషయానికి వచ్చే సరికి తాము తీవ్ర వివక్షకు గురయ్యే వారమని నాయర్ గుర్తు చేశారు. ‘కార్యదర్శుల పోస్టులు కాదు కదా కనీసం జిల్లా మెజిస్ట్రేట్లు (డీఎం)గా కూడా మమ్మల్ని నియమించే వారు కాదు. మహిళలు కేవలం సచివాలయాలకే పరిమితం అయ్యే వారు’ అని ఆమె గుర్తు చేసుకున్నారు. తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాలలో మహిళలు ఉన్నత స్థానాలకు చేరుకునే వారని, హర్యానా, పంజాబ్ వంటి రాష్ట్రాలలో కనీసం డీఎం కావడం కూడా ఊహించలేమని అన్నారు. అయితే 1970వ దశకంలోనే మహిళలు ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులుగా నియమితులయ్యారని శర్మ చెప్పారు. ఉన్నత స్థానాలలో కొందరు మహిళలే ఉన్నప్పటికీ వారు ఇతరులకు దారి చూపారని తెలిపారు.
నేటికీ వివక్షే
అయితే ఇప్పటికీ వివక్ష కొనసాగుతూనే ఉన్నదని నాయర్ చెప్పారు. క్యాబినెట్, హోం, రక్షణ, కేంద్ర కార్యదర్శి స్థాయికి నేటికీ మహిళలు చేరలేదని అన్నారు. ఇటు రాష్ట్ర స్థాయిలోనూ వివక్ష కొనసాగుతోంది. 2014 నుండి ఐఏఎస్‌లో చేరిన మహిళల సంఖ్య 30 శాతంగా ఉన్నప్పటికీ ముఖ్యమైన జిల్లా మెజిస్ట్రేట్ల (కలెక్టర్లు) పోస్టులలో ఉన్న వారు 19 శాతానికి మించి లేరు. 716 జిల్లా కలెక్టర్లలో 142 మంది మాత్రమే మహిళలని వివిధ రాష్ట్ర ప్రభుత్వ వెబ్‌సైట్ల నుంచి సేకరించిన డేటా చెబుతోంది. 2021 వరకూ తీవ్రవాద ప్రాబల్యం ఎక్కువగా ఉన్న 47 జిల్లాలలో కేవలం ఏడుగురే కలెక్టర్లుగా పనిచేశారు.
పెరుగుతున్న మహిళా ఐఏఎస్‌లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES