Saturday, July 19, 2025
E-PAPER
Homeజాతీయంనదీజలాల సమస్యలపైనిపుణుల కమిటీ

నదీజలాల సమస్యలపైనిపుణుల కమిటీ

- Advertisement -

– తెలంగాణలో గోదావరి బోర్డు, ఏపీలో కృష్ణా బోర్డు
– బనకచర్లపై నో డిబేట్‌ నాలుగు అంశాలపై కుదిరిన అంగీకారం
– ప్రాజెక్టుల వద్ద టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు
– శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులు, రక్షణకు చర్యలు
– నిర్ణయాలన్నీ తెలంగాణ విజయమే : రేవంత్‌ రెడ్డి
– ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి అధ్యక్షతన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీ
– హాజరైన సీఎంలు రేవంత్‌రెడ్డి, చంద్రబాబునాయుడు
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో

తెలుగు రాష్ట్రాల మధ్య నెలకొన్న జలవివాదాల పరిష్కారం కోసం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల అధికారులు, ఇంజినీర్లతో నిపుణుల కమిటీ ఏర్పాటు చేయాలని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయించారు. బుధవారంనా డిక్కడ కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ కార్యాలయంలో కేంద్రమంత్రి సీఆర్‌ పాటిల్‌ అధ్యక్షతన తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రుల సమావేశం జరిగింది. తెలంగాణ రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌ రెడ్డి, రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, రాష్ట్ర జలవనరుల శాఖ అధికారులు హాజరయ్యారు. కేంద్ర ప్రభుత్వం తరఫున కేంద్రమంత్రి సిఆర్‌ పాటిల్‌తో పాటు కేంద్ర జలవనరుల శాఖ కార్యదర్శి, అధికారులు పాల్గొన్నారు. సమావేశం ఆద్యంతం సుహృద్భావ వాతావరణంలో జరిగింది. ఇరు రాష్ట్రాల మధ్య ఉన్న అన్ని సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలని నిర్ణయించారు. దీనిలో భాగంగా నాలుగు అంశాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు.


రెండు రాష్ట్రాలకు న్యాయం జరిగేలా కమిటీ : నిమ్మల రామానాయుడు, ఏపీ నీటిపారుదల శాఖ మంత్రి
రెండు రాష్ట్రాలకు న్యాయం జరిగేలా కేంద్ర ప్రభుత్వం కమిటీ వేస్తుందని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు. ఈ సమావేశం ఆహ్లాదకర వాతావరణంలో జరిగిందన్నారు. ఇరు రాష్ట్రాలు ఇచ్చి పుచ్చుకొనే ధోరణిలో చర్చలు జరిగాయన్నారు. శ్రీశైలం ప్రాజెక్టును కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఆ ప్రాజెక్టు మరమ్మతులు, రక్షణ చర్యలపై చర్చించామన్నారు. నిపుణుల కమిటీ నివేదిక ఆధారంగా చర్యలు చేపడతామని కేంద్రమంత్రి స్పష్టం చేశారని వివరించారు. శ్రీశైలం ప్రాజెక్ట్‌ మరమ్మతులు చేసేందుకు ఏపీ అంగీకరించిం దన్నారు. అలాగే టెలిమెట్రీ ఏర్పాటుకు సైతం అంగీకరించామని మంత్రి నిమ్మల వివరించారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదించిన పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు, అలాగే తెలంగాణ లేవనెత్తిన కృష్ణా, గోదావరి నదీ జలాల సమస్యలు సాంకేతిక అంశాలతో కూడుకొని ఉన్నాయని అన్నారు. వీటికి పరిష్కారం చూపేందుకు కమిటీ నిర్ణయం తీసుకోవాలని కోరారు. ఈ కమిటీతో తెలంగాణ, ఏపీ లేవనెత్తిన అంశాలపై ప్రాథమిక యంత్రాంగాన్ని రూపొందించి, ఒక రోడ్‌ మ్యాప్‌తో ముందుకు వెళ్తామని అన్నారు. కాలయాపన లేకుండా సోమవారంలోగానే కమిటీ వేసేలా నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కమిటీలో కేంద్రంతో పాటు ఇరు రాష్ట్రాల నిపుణులు ఉంటారని వివరించారు.

కమిటీ రిపోర్టు మేరకే తదుపరి చర్యలు : సీఎం రేవంత్‌రెడ్డి
నదీ జలాలపై నిపుణుల కమిటీ రిపోర్టు మేరకే తదుపరి చర్యలు ఉంటాయని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డి తెలిపారు. సమావేశంలో ఏపీ ప్రభుత్వం నుంచి గోదావరి-బనకచర్ల ప్రాజెక్టు కడతామనే ప్రతిపాదన చర్చకు రాలేదన్నారు. ఎజెండాలో వారు కడతామనే ప్రతిపాదనే లేనప్పుడు, దాన్ని ఆపాలనే చర్చే ఉండదని స్పష్టం చేశారు. పెండింగ్‌ సమస్యల పరిష్కారం కోసం ఈ సమావేశం జరిగిందనీ, ఈ భేటీలో కేంద్ర ప్రభుత్వం కేవలం నిర్వాహక పాత్రే పోషించిందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఎవరివైపూ మాట్లాడలేదనీ, ఈ భేటీలో తీసుకున్న నిర్ణయాలన్నీ తెలంగాణ విజయమేనని అన్నారు. నాలుగు అంశాలపై చర్చించామనీ, ఆ అంశాలపైనే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. సమస్యలను పరిష్కరించుకునేందుకే ఉన్నామనీ, గొడవలు పెట్టుకునేందుకు లేమని స్పష్టం చేశారు. రెండు రాష్ట్రాలు గొడవలు పెట్టుకోవాలని కొందరు ఎదురు చూస్తున్నారనీ, అయితే వివాదాలు లేకుండా సమస్యలు పరిష్కరించుకోవడమే తమ ఎజెండా అని తేల్చిచెప్పారు. తెలంగాణ హక్కులను మాజీ సీఎం కేసీఆర్‌ గతంలో ఏపీకి ధారాదత్తం చేశారని విమర్శించారు. ఆయన చేసిన తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేస్తున్నామన్నారు. రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఎన్‌. ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మాట్లాడుతూ అన్ని రిజర్వాయర్లు, కెనాల్స్‌ వద్ద యుద్ధప్రాతిపదిక టెలీమెట్రీలు ఏర్పాటు చేసేందుకు ఏపీ ప్రభుత్వం అంగీకరించిందని తెలిపారు. కృష్ణా నదీజలాల వాడకం లెక్కలపై అనుమానాలు ఉన్నాయనీ, అందుకే టెలీమెట్రీలు ఏర్పాటు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని వివరించారు. కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వకపోయినా రాష్ట్రమే నిధులు కేటాయిస్తుందన్నారు. వీటి ఏర్పాటుపై గత ప్రభుత్వం అలసత్వం ప్రదర్శించిందని చెప్పారు.

ఇవీ నిర్ణయాలు
– ప్రాజెక్టుల నుంచి నీటి విడుదలకు సంబంధించి
టెలిమెట్రీ పరికరాల ఏర్పాటుకు ఇరు రాష్ట్రాలు అంగీకారం
– గోదావరి నదీ జలాల యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)ను
హైదరాబాద్‌లో, కృష్ణా నదీ జలాల యాజమాన్య బోర్డు (కేఆర్‌ఎంబీ)ను
ఆంధ్రప్రదేశ్‌లోని అమరావతిలో పెట్టేందుకు అంగీకారం
– శ్రీశైలం ప్రాజెక్ట్‌ మరమ్మతులకు అంగీకారం.
– రెండు రాష్ట్రాల్లో గోదావరి, కృష్ణా నదులపై ఉన్న ప్రాజెక్టులకు
సంబంధించి పెండింగ్‌ సమస్యల పరిష్కారానికి అధికారులు,
సాంకేతిక నిపుణులతో కమిటీ ఏర్పాటుకు నిర్ణయం.
– వారంలో కమిటీ నియామకం ఏర్పాటుకు అంగీకారం.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -