– పథకం ప్రకారమే కాల్పులు
– 9 మంది నిందితులు పాల్గొన్నట్టు పోలీసుల అనుమానం.. ఎప్‌ఐఆర్‌లో పేర్ల నమోదు
– నిందితుల కోసం పది బృందాల జల్లెడ
– భూతగాదాల వల్లే హత్య జరిగినట్టు ప్రాథమిక నిర్ధారణ
నవతెలంగాణ-సిటీబ్యూరో
హైదరాబాద్ నగరంలోని మలక్‌పేటలో జరిగిన సీపీఐ నేతపై కాల్పులు, హత్య ఘటనపై పోలీసులు విచారణను వేగవంతం చేశారు. నలుగురు ప్రత్యక్షంగా, ఐదుగురు పరోక్షంగా పాల్గొన్నట్టు గుర్తించారు. మంగళవారం ఉదయం వాకింగ్ చేస్తున్న సీపీఐ రాష్ట్ర నాయకులు చందు నాయక్‌పై కాల్పులు జరిపింది రాజేష్, ప్రశాంత్, ఏడుకొండలు, సుధాకర్‌గా గుర్తించారు. వారికి సహాయ సహకారాలు అందించింది రాజేష్‌తోపాటు రవీంద్రాచారి, రాయుడు, యాదిరెడ్డి, మున్నా, శివల పేర్లను ఎఫ్‌ఐఆర్‌లో నమోదు చేశారు. చందు నాయక్‌ను హతమార్చేందుకు రెండ్రోజుల నుంచి రెక్కీ నిర్వహించిన నిందితులు పథకం ప్రకారమే స్విఫ్ట్ కారులో ఆయనను అనుసరించారు. అదును చూసుకుని క్షణాల్లో చందునాయక్ ముందుకొచ్చి కండ్లల్లో కారం కొట్టారు. ప్రాణభయంతో పారిపోతున్న అతన్ని వెంటాడి తుపాకీతో కాల్పులు జరిపారు. దాంతో అతను అక్కడికక్కడే మృతిచెందారు. పరారీలోవున్న నిందితుల కోసం 10 ప్రత్యేక పోలీసు బృందాలు జల్లెడపడుతున్నాయి.
భూతగాదాలే కారణం..
ముఖ్యంగా కాల్పులకు కుంట్లూర్‌లోని భూతగాదాలే కారణమని పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. భూమి విషయమై కొద్ది రోజుల నుంచి రాజేష్‌కు, చందు నాయక్‌కు మధ్య విభేదాలు నడుస్తున్నాయి. కుంట్లూరులోని రావి నారాయణరెడ్డి నగర్‌లో చందునాయక్ అనుచరులు గుడిసెలు వేయడంతో రాజేష్ కక్ష పెంచుకున్నాడని పోలీసుల విచారణలో తేలింది. సీపీఐలో చందునాయక్ ప్రస్తుతం కౌన్సిల్ నెంబర్‌గా ఉన్నారు. అయితే, నిందితులు చౌటుప్పల్ వైపు పారిపోయినట్టు సీసీ కెమెరాల్లో గుర్తించిన పోలీసులు ఆ మేరకు వారిని వెంబడించి అదుపులోకి తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. చందు నాయక్‌కు ప్రాణహాని ఉన్నా ఎందుకు ఫిర్యాదు చేయలేదనే కోణంలోనూ పోలీసులు ఆరా తీస్తున్నారు.
సీపీఐ నేత చందు నాయక్ హత్య కేసులో విచారణ వేగవంతం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES