Saturday, July 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంకేసీఆర్‌ దూర దృష్టి ఫలితమే కాళేశ్వరం

కేసీఆర్‌ దూర దృష్టి ఫలితమే కాళేశ్వరం

- Advertisement -

తెలంగాణకు జీవనాధారం
నిజానిజాల కోసం రేవంత్‌ రెడ్డి చర్చలకు సిద్ధమా ? : మాజీమంత్రి, ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
నవతెలంగాణ-సూర్యాపేట
కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణకు జీవనాధారం అని, ఇది కేసీఆర్‌ దూర దృష్టి ఫలితమని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై కాంగ్రెస్‌, బీజేపీ నేతలు దుష్ప్రచారం చేయడం బాధాకరమన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పన, నిర్మాణం, ప్రస్తుత వినియోగం గురించి బుధవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. కరీంనగర్‌ నుంచి నల్లగొండ దాకా ప్రజలు కాళేశ్వరం నీళ్ల కోసం ఎదురు చూస్తున్నారని, కేసీఆర్‌ తెచ్చిన నీటిని ఇప్పటి ప్రభుత్వం నిలిపివేయడం వల్లే యాసంగిలో పొలాలు ఎండిపోయాయని అన్నారు. ప్రపంచంలోనే అద్భుతమైన ప్రాజెక్టు ఇది అని చెప్పారు. ఒక్క బటన్‌ నొక్కితే 17 పంప్‌హౌసులు పని చేస్తాయని, ప్రాణహిత నదిలో నుంచి నీటిని పుష్కలంగా ఎత్తిపోసే సదుపాయాలు ఉన్నాయన్నారు. కాంగ్రెస్‌, బీజేపీ నేతల ఆరోపణలు అవాస్తవమని చెప్పారు. మేడిగడ్డలో ఒకటి, రెండు ఫిల్లర్లు కుంగినా, అది గోదావరి చరిత్రలో ఎన్నడూ లేనివిధంగా వచ్చిన 38 లక్షల క్యూసెక్కుల వరద కారణంగానే జరిగినదని తెలిపారు. పోలవరం ప్రాజెక్టును మూడుసార్లు కట్టిన ఎన్డీఎస్‌ఏ సంస్థే కాళేశ్వరం విషయంలో రిపోర్ట్‌ ఇచ్చిందని, ఆ నివేదిక కేంద్రానికి కాకుండా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డికి ఇచ్చిన తీరే దురుద్దేశంతో కూడినదని విమర్శించారు. చంద్రబాబుతో రేవంత్‌రెడ్డి చర్చలు చేస్తూ బనకచర్ల అనుమతిని ఆధారంగా పెట్టుకుని కాళేశ్వరాన్ని ఎండబెడుతున్నారని ఆరోపించారు. సూర్యాపేట, తుంగతుర్తి నియోజకవర్గాల్లో లక్షల ఎకరాలకు, కోదాడ నియోజకవర్గంలో 58 వేల ఎకరాలకు సాగునీరు అందుతోందని, ఇది కూలిపోయిన ప్రాజెక్టా ? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు 40 లక్షల ఎకరాలకు నీటిని అందించిందని గుర్తుచేశారు. ‘నీళ్లు వచ్చాయో లేదో రైతుల వద్దకే వెళ్లి తెలుసుకుందాం. దమ్ముంటే రా.. రేవంత్‌… చిన్న సీతారాంతండాకి వెళ్లి రైతుల చేతే చెప్పిద్దాం. వాళ్ల భూములకు నీళ్లు రాకపోతే నన్ను చెప్పుతో కొట్టొచ్చు, వచ్చుంటే నిన్ను కొట్టాలి..’ అని సవాల్‌ విసిరారు. ఇసుక దందా కోసమే గోదావరిలో నీళ్లు ఎత్తిపోయకుండా ఆపేస్తున్నారని, వేలాది లారీలు గోదావరి ఒడ్డున తిరుగుతున్నాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి నల్లగొండ జిల్లా మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు కంచర్ల భూపాల్‌రెడ్డి, భాస్కర్‌రావు, రవిందర్‌ నాయక్‌, గాదరి కిషోర్‌, బూడిద భిక్షమయ్య గౌడ్‌, చెరుకుపల్లి సుధాకర్‌, కోటిరెడ్డి, బడుగుల లింగయ్య యాదవ్‌ పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -