– ట్రంప్ అధిక టారిఫ్‌లతో నష్టం
– భారత్ దిగుమతి సుంకాలు తగ్గించాలని యుఎస్ ఒత్తిడి
– ఆటో, ఫార్మా, స్టీల్ రంగాలపై ఒత్తిడి
– నేటితో ముగియనున్న వాణిజ్య చర్చలు
నవతెలంగాణ – బిజినెస్ డెస్క్
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన మేక్ ఇన్ ఇండియాకు అమెరికా తూట్లు పొడిచే ప్రయత్నంలో ఉంది. ఇప్పటికే దేశంలో మందగమనాన్ని ఎదుర్కొంటున్న తయారీ రంగం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చర్యలతో మరింత ఒత్తిడిని ఎదుర్కొనే సంకేతాలు కనబడుతున్నాయి. అమెరికా-భారత్ మధ్య జరుగుతున్న నాలుగు రోజుల వాణిజ్య చర్చలు గురువారం నాటితో ముగియనున్నాయి. ఆగస్టు 1 గడువు ముందు తాత్కాలిక ఒప్పందం కుదుర్చుకునే దిశగా చర్చలు వేగంగా సాగుతున్నాయి. జన్యు మార్పిడి విత్తనాలు, పాడి రంగం, స్టీల్, ఆల్యూమినియం, ఆటోమొబైల్ రంగాలు ఈ చర్చలలో కీలక అంశాలుగా ఉన్నాయి. ఈ చర్చల వివరాలను ఇరు దేశాలు చాలా రహస్యంగా ఉంచుతున్నాయి. భారత అధికారులు ఎలాంటి అంశాలను బయట పెట్టడం లేదు. ఈ సంప్రదింపుల్లో అమెరికా ఒత్తిడికి భారత్ తలొగ్గితే ముఖ్యంగా స్టీల్, ఫార్మా, ఆటో పరిశ్రమ రంగాలు సంక్షోభాన్ని ఎదుర్కోవచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
యుఎస్‌లో పూర్తిగా తయారయిన విద్యుత్ వాహనాలు భారత్‌కు భారీగా దిగుమతి కానున్నాయి. దీంతో ఇక్కడి వాహన పరిశ్రమ గడ్డుకాలాన్ని ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఫార్మా రంగంపై యుఎస్ అధిక టారిఫ్‌లు విధిస్తే ఎగుమతులు తగ్గనున్నాయి. మరోవైపు స్టీల్ రంగంలో 50 శాతం టారిఫ్‌లు ఎగుమతులను దెబ్బతీయనున్నాయి. దీంతో భారత్‌లోని ఈ పరిశ్రమల్లో తయారీ తగ్గనుంది. స్టీల్ ఉత్పత్తులపై అధిక టారిఫ్‌ల వల్ల 2024-25లో ఆ రంగం ఎగుమతులు 2.8 బిలియన్ డాలర్లకు పరిమితమయ్యాయి. ఈ టారిఫ్‌లను 20 శాతం కంటే తక్కువకు తగ్గించాలని భారత్ కోరుతోంది. మరోవైపు తనకు ఆకర్షణీయమైన ఒప్పందం కోసం అమెరికా అన్ని ఒత్తిడిలను చేస్తోందని సమాచారం.
వాహనాలపై సుంకాల తగ్గింపునకు డిమాండ్..
అమెరికా తన ఎలక్ట్రిక్ వాహనాల (ఇవి) కంపెనీలైన టెస్లా, ఫోర్డ్‌కోసం భారత మార్కెట్‌లో సులభమైన ప్రవేశం కోరుతోంది. ప్రస్తుతం వీటిపై ఉన్న 70-100 శాతం దిగుమతి సుంకాలను తగ్గించాలని డిమాండ్ చేస్తోంది. అదనంగా బ్యాటరీలు, సెమీకండక్టర్ తదితర ఆటో కాంపోనెంట్‌లపై 15-30 శాతం సుంకాలను తగ్గించాలని అడుగుతోంది. తక్కువ సుంకాలను విధిస్తే రెడీమేడ్ కార్లను భారత్‌కు ఎగుమతి చేయాలని యుఎస్ భావిస్తోంది. ఇందుకు టెస్లా కార్ల దిగుమతినే ముఖ్య ఉదాహరణ. కాగా.. భారత్ ఇక్కడి వాహనాల కంపెనీలకు మద్దతుగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా స్థానిక ఉత్పత్తిని పెంచేలా ప్రోత్సాహాలను ఇస్తుంది. ఒక వేళ అమెరికా కంపెనీలకు సులభ మార్కెట్‌ను అనుమతిస్తే.. ఇక్కడి వాహన పరిశ్రమలు ఆర్థిక ఒత్తిడిలోకి జారుకునే ప్రమాదం ఉంది.
సవాళ్లు..
అమెరికా భారత ఉత్పత్తులపై టారిప్‌లను పెంచితే ఎగుమతులు పడిపోతాయి. మరోవైపు యుఎస్ వాహనాలపై భారత్ సుంకాలు తగ్గిస్తే ఇక్కడి కంపెనీలు పోటీని తట్టుకోలేవు. ఈ రెండు అంశాల పర్యవసానం ఇక్కడి తయారీ రంగం క్షీణిస్తుంది. ఫలితంగా మేక్ ఇన్ ఇండియా లక్ష్యం నీరుగారుతుంది. దీంతో ఉపాధి కల్పన దెబ్బతింటుంది. అంతిమంగా భారత ఆర్థిక వ్యవస్థ సైకిల్ సంక్షోభంలోకి నెట్టబడే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
మేక్ ఇన్ ఇండియాకు తూట్లు..!
- Advertisement -
- Advertisement -