పాల్గొన్న 15 మంది అధికారులు
రికార్డులు సీజ్
వంట సరుకుల శాంపిల్స్ సేకరణ
నవతెలంగాణ-మహబూబాబాద్
మహబూబాబాద్ పట్టణంలోని కలెక్టర్ అద్వైత్ కుమార్‌సింగ్ క్యాంప్ ఆఫీస్ ఎదురుగా ఉన్న గిరిజన ఆశ్రమ పాఠశాల బాలికల హాస్టల్‌లో ఏసీబీ డీఎస్పీ సాంబయ్య ఆధ్వర్యంలో బుధవారం అధికారులు ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. నాలుగు శాఖలకు చెందిన 15 మంది అధికారులు ఉదయం నుంచి రాత్రి వరకు తనిఖీలు చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చిన సరుకులు, తినుబండారాలు, పదార్థాలు విద్యార్థులకు అందించడం లేదని వచ్చిన ఫిర్యాదుల మేరకు ఈ సోదాలు జరిగాయి. ఏసీబీ ఆడిట్ తూనికల కొలతలు ఫుడ్‌సేఫ్టీకి చెందిన నాలుగు శాఖలు, 15 మంది అధికారులు తనిఖీల్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డీఎస్పీ సాంబయ్య విలేకరులతో మాట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం, టిఫిన్ పెట్టడం లేదని ఫిర్యాదులు వచ్చాయన్నారు. దాంతో తనిఖీ నిర్వహిస్తున్నట్టు తెలిపారు. సరుకుల స్టాక్ సరిగా నిర్వహించడం లేదన్నారు. ఆడపిల్లలకు ఇవ్వాల్సిన కాస్మోటిక్ సరిగా ఇవ్వడం లేదన్నారు. హాస్టల్‌లో వాష్‌రూమ్‌లకు డోర్స్ లేవన్నారు. డ్రైనేజీ పైపులు, నల్లాపైపులు లీక్ అవుతున్నాయని, పాఠశాల ప్రాంగణం అపరిశుభ్రంగా ఉందని అన్నారు. వంటశాల చిందరవందరగా అపరిశుభ్రంగా ఉందన్నారు. మెనూ ప్రకారం భోజనం, కూరలు, టిఫిన్, స్నాక్స్ అందించడం లేదన్నారు. బాలికల హాస్టల్ గేటు వద్ద వాచ్‌మెన్ కూడా లేడన్నారు. ప్రభుత్వం హాస్టల్‌లో సమకూర్చిన సీసీ కెమెరాలు పనిచేయడం లేదన్నారు. హాస్టల్ నుంచి బాలికలను బయటికి తీసుకెళ్లేటప్పుడు నిర్వహించాల్సిన ఔటింగ్ రిజిష్టర్ లేదన్నారు. జీసీసీ నుంచి వచ్చిన నూనెలు పసుపు, కారం, చింతపండు నాణ్యత తనిఖీ చేయడానికి శాంపిల్స్ సేకరించినట్టు తెలిపారు. వచ్చిన సరుకుల నాణ్యత, తూకంలో తేడాలు గుర్తించామమన్నారు. హాస్టల్ స్కూలు నిర్వహణలో హెచ్‌ఎం, వార్డెన్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందన్నారు. ఇంకా తనిఖీలు కొనసాగుతాయని, పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని తెలిపారు.
ఎస్టీ హాస్టల్లో ఏసీబీ తనిఖీలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES