– రెండు లక్షల ఉద్యోగాల ప్రకటన మళ్లీ మోసమే
– ఉద్యమాలను ఉధృతం చేస్తాం : డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేశ్
నవతెలంగాణ – ముషీరాబాద్
స్థానిక సంస్థల ఎన్నికల్లోపే ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్స్ వేసి నియామకాలు చేపట్టాలని డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కోట రమేష్, ఆనగంటి వెంకటేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో కోట రమేష్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆనగంటి వెంకటేశ్ మాట్లాడుతూ.. నీళ్లు, నిధులు, నియామకాల డిమాండ్లతోనే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం సాగిందని, ఇందులో నీళ్ళు, నిధుల గురించి పక్కన పెడితే గత బీఆర్‌ఎస్ సర్కార్ యువతకు ఉద్యోగ, ఉపాధి పట్ల నిర్లక్ష్యం వహించిందని తెలిపారు. ఇచ్చిన నోటిఫికేషన్లు కూడా పేపర్ లీకులు, పరీక్షల వాయిదాలు, కోర్టు వివాదాలు సృష్టించేలా ఉండటంతో నిరుద్యోగుల్లో తీవ్ర ఆందోళన తలెత్తిందన్నారు. తాము అధికారంలోకొస్తే.. యూత్ డిక్లరేషన్ ప్రవేశపెట్టి ఉద్యోగాలిస్తామని చెప్పడం వల్ల నిరుద్యోగులంతా కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపించారని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి.. రెండు లక్షల ఉద్యోగాలు కూడా ఇవ్వకపోగా గత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్ల ద్వారా 55,424 ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేసిందని వివరించారు. యూత్ కమిషన్ ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వ రాయితీలు పొందుతున్న ప్రయివేటు కంపెనీల్లోనూ తెలంగాణ యువతకు ఉద్యోగాలిస్తామని, జాబ్ క్యాలెండర్ ప్రకటించి అమలు చేస్తామని హామినిచ్చి విస్మరించిందని చెప్పారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల తర్వాత ఇదే జాబ్ క్యాలెండర్ అంటూ ప్రణాళిక లేకుండా, తూ.తూ మంత్రంగా ఉద్యోగాల భర్తీకి చర్యలంటూ ఓ క్యాలెండర్ ప్రకటించిందని అన్నారు. ఎన్ని ఉద్యోగాల ఖాళీలు ఉన్నాయో, ఎంత కాలానికి ఎన్ని ఉద్యోగాలు భర్తీ చేస్తారో ప్రస్తావన లేదన్నారు. ప్రకటించిన వాటికి కూడా ఇప్పటివరకు షెడ్యూల్ ప్రకారం నోటిఫికేషన్లు ఇవ్వకుండా కాలయాపన చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
కోట రమేష్ మాట్లాడుతూ.. రెండేండ్లలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇటీవల తుంగతుర్తి సభలో ముఖ్యమంత్రి ప్రకటించారని, ఇది మరోసారి నిరుద్యోగ యువతను మోసం చేయడమేనని అన్నారు. తక్షణమే ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వేయాలని, రాజీవ్ యువ వికాస్ పథకాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనియెడల ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి పుట్ట లక్ష్మణ్, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి దామెర కిరణ్, పీడీఎస్‌యూ జాతీయ నాయకులు మహేష్, రాష్ట్ర నాయకులు నాగరాజు సాంబ, శ్రీనివాస్, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర ఉపాధ్యక్షులు జావీద్, పీవైఎల్ రాష్ట్ర నాయకులు కొల్లూరు భీమేష్, పీడీఎస్‌యూ జార్జిరెడ్డి రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు ఎస్.నాగేశ్వరరావు, సుమంత్, నిరుద్యోగ జేఏసీ నాయకులు జనార్దన్ మోతిలాల్, కాశి, సలీం, కిరణ్, పూజ, రమేష్, రాజయ్య, అనిల్, సురేందర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.
స్థానిక ఎన్నికల్లోపే ఉద్యోగ నోటిఫికేషన్లు వేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES